0-37-24-0-4-1.. టీమిండియా కొత్త 'ఓపెనర్' సూపర్ ఫ్లాప్
ఎంతటి బౌలర్ నైనా కొట్టేయగలడు. ఫామ్ లో లేకపోవడం అంటూ ఉండనే ఉండదు. మరి ఏం జరుగుతోంది?
6 మ్యాచ్ లు.. 66 పరుగులు.. ఇందులో రెండు డకౌట్లు.. ఇదీ టీమిండియా నయా ఓపెనర్ తాజా రికార్డు.. అది కూడా ప్రపంచ కప్ వంటి ప్రతిష్ఠాత్మక టోర్నీలో.. అతడు ఫామ్ లో ఉంటే ఒక్క ఓవర్ లో చేసే పరుగులు.. గత ఆరు మ్యాచ్ లలోనూ సాధించలేకపోయాడు. ఈ మ్యాచ్ లలో మూడు పసికూనలు లేదా చిన్న జట్లు. వాటిపైనా పరుగులు చేయడంలో విఫలమయ్యాడు. దీనికి బ్యాడ్ లక్ కొద్దీ జరుగుతోందా? ఫామ్ కోల్పోయాడా? పిచ్ లు కారణమా? అనేది అప్రధానం. ఎలాంటి పిచ్ పై అయినా అతడు రాణించగలడు. ఎంతటి బౌలర్ నైనా కొట్టేయగలడు. ఫామ్ లో లేకపోవడం అంటూ ఉండనే ఉండదు. మరి ఏం జరుగుతోంది?
ఫామ్ కాదు ఫార్మాట్?
గత ఏడాది టి20ల నుంచి టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి దాదాపు విరామం ఇచ్చారు సెలక్టర్లు. మరో స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మనూ పక్కనపెట్టారు. కానీ, ఆ ఇద్దరినీ మళ్లీ ఈ ప్రపంచ కప్ కోసం జట్టులోకి తీసుకున్నారు. అంతేకాదు.. రోహిత్ కు తోడుగా కోహ్లిని ఓపెనర్ గానూ పంపుతున్నారు. అతడు మాత్రం దారుణంగా విఫలం అవుతున్నాడు. అమెరికా పిచ్ లపై ఆపసోపాలు పడ్డాడు. కరీబియన్ లో ఇరగదీస్తాడనుకుంటే అదీ లేదు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ టి20 ఫార్మాట్ కు కోహ్లి సరిపోతాడా? అనే ప్రశ్న వస్తోంది. పొట్టి ఫార్మాట్ లో అతడికి మంచి రికార్డే ఉంది. ప్రపంచ కప్ నకు ముందు జరిగిన ఐపీఎల్ లో టాప్ స్కోరర్ అతడే. కానీ, నలుగురైదుగురు మేటి బౌలర్లు ఉండే అంతర్జాతీయ క్రికెట్ వేరు. ఒకరిద్దరే మేటి బౌలర్లు ఉండే ఐపీఎల్ వేరు.
ఓపెనింగ్ దెబ్బకొడుతోందా?
కోహ్లి అచ్చమైన వన్ డౌన్ బ్యాటర్. లేదా టెస్టుల్లో నాలుగో స్థానంలో వస్తాడు. కానీ ఈ టి20 ప్రపంచ కప్ లో మాత్ర ఓపెనింగ్ కు దిగుతున్నాడు. ఇది బలవంతపు పెళ్లిలా మారిందా? అనే అనుమానం వ్యక్తం అవుతోంది. ఐపీఎల్ లోనూ ఓపెనింగ్ చేసినా.. పైన చెప్పుకొన్నట్లు అక్కడి పరిస్థితులు వేరే. అందుకనే కోహ్లిని మళ్లీ వన్ డౌన్ లో పంపాలనే డిమాండ్లు వస్తున్నాయి.
జట్టు కూర్పు కూడా కారణమే..
ఈ ప్రపంచ కప్ లో టీమిండియా బ్యాటింగ్ బలం గురించి ఆలోచిస్తోంది. స్పెషలిస్ట్ ఓపెనర్ అయిన జైశ్వాల్ ను జట్టులోకి తీసుకున్నా.. అతడిని ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు. కోహ్లిని ఓపెనింగ్ కు పంపుతోంది. వన్ డౌన్ లో రిషభ్ పంత్ ను దింపుతూ, ఐదో నంబరులో పేస్ బౌలింగ్ వేయగల బ్యాటింగ్ ఆల్ రౌండర్ శివమ్ దూబెను ఆడిస్తోంది. దూబె తనపై ఉంచిన నమ్మకాన్ని పూర్తిగా నిలుపుకోలేదు. కానీ, ఆడించక తప్పడం లేదు. ఆరో నంబరులో హార్దిక్ ఆదుకుంటుండడంతో దూబెకు పెద్దగా దెబ్బ పడడం లేదు. అతడు బౌలింగ్ లో కూడా పెద్దగా చేసిందేమీ లేదు. అయితే, చివరకు కూర్పులో కోహ్లి బలయిపోతున్నాడు.
ఈ 2 మ్యాచ్ లలో చెలరేగితే చాలు
ఇప్పటివరకు విఫలమైనా ఫర్వాలేదు.. విరాట్ కోహ్లి వంటి బ్యాటర్ సత్తా తగ్గినట్లు కాదు. అతడి పనై పోలేదు. అయితే, అతడు చేయాల్సింది ఏమంటే టి20 ప్రపంచ కప్ సెమీస్ లో ఇంగ్లండ్ పై చెలరేగితే చాలు. ఆపై దక్షిణాఫ్రికా-అఫ్ఘానిస్థాన్ లలో ఫైనల్ కు వచ్చే జట్టుపైనా కోహ్లి దుమ్మురేపితే టి20 ప్రపంచ కప్ మన సొంతం అవుతుంది.