వందేమాతరం... వాంఖడేలో ఉద్వేగభరిత వాతావరణం!
ఇదంతా ఒకెత్తు అయితే... టీంఇండియా ఆటగాళ్లు వాంఖడే స్టేడియానికి చేరుకున్న సమయంలో... వారిని చూసేందుకు అభిమానులకు అవకాశం ఇచ్చారు.
టీ20 ప్రపంచకప్ గెలిచి గురువారం స్వదేశానికి వచ్చిన భారత క్రికెట్ జట్టుకు అఖండ స్వాగతం లభించింది. కళ్లల్లో అభిమానం నింపుకున్న చూపులతో జనాలు కేరింతలతో ఊగిపోయారు. అప్పటికే ముంబై లోని మెరైన్ డ్రైవ్ ప్రాంతం మొత్తం జనాలతో కిక్కిరిసి పోయింది. వర్షం వారి అభిమానాన్ని ఆపలేకపోయింది. తిండి, నీరు లేకపోయినా.. ఫ్యాన్స్ అలా నిలుచుండిపోయారు.
అవును... ఢిల్లీ నుంచి ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ విమానాశ్రయానికి వచ్చిన భారత జట్టుకు అపూర్వ స్వాగతం లభించింది. ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు రాగానే... అభిమానులు భారీగా నిలిచి భారత జట్టును ఆహ్వానించారు. అక్కడ నుంచి నారిమన్ పాయింట్ కు వచ్చిన భారత జట్టు... ఓ ప్రత్యేకమైన ఓపెన్ బస్సులో సక్సెస్ టూర్ షురూ చేసింది. ఈ యాత్ర సాగిన మెరైన్ డ్రైవ్ రోడ్డుపై ఇసుక వేస్తే రాలే అవకాశం లేకపోయింది.
ఈ సందర్భంగా... భారత్ మాతాకీ జై.. జయహో భారత్.. వందేమాత్రం వంటి నినాదాలతో అభిమానులు ముంబై వీదులను హోరెత్తించేశారు. ఈ సమయంలో బస్సుపై కూర్చున్న భారత జట్టు సభ్యులు జాతీయ జెండా చేతబూని ముందుకు సాగారు. ఒక వైపు వర్షం.. మరోవైపు పూల వర్షంతో టీం ఇండియా క్రికెటర్లు తడిసి ముద్దయ్యారు.
ఇదంతా ఒకెత్తు అయితే... టీంఇండియా ఆటగాళ్లు వాంఖడే స్టేడియానికి చేరుకున్న సమయంలో... వారిని చూసేందుకు అభిమానులకు అవకాశం ఇచ్చారు. దీంతో స్టేడియం మొత్తం నిండిపోగా.. వేలాది మంది బయటే ఉండిపోయారు. ఈ సమయంలో... అంతా జాతీయ గీతం ఆలపించారు. అటు క్రికెటర్లు, ఇటు అభిమానులు అంతా కలిసి ఒకేసారి గీతం ఆలపించడంతో... ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది.
ఈ సమయంలో తమకు ఎంతో మద్దతుగా నిలిచిన అభిమానులకు భారత జట్టు స్టేడియం చుట్టూ తిరుగుతూ అభినందనలు తెలిపింది. ఇక ముందే ప్రకటించినట్లుగా టీ20 ప్రపంచ కప్ గెలిచిన టీంఇండియాకు బీసీసీఐ రూ.125 కోట్ల భారీ నజరానా అందించింది.