కష్టకాలంలో కోహ్లి.. ఆ సూపర్ బ్యాటర్ కు ఇదే గొప్ప ఊరట

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సానియా మీర్జా, పీవీ సింధులకు ఒకప్పుడు టాప్ బ్రాండ్ వాల్యూ ఉండేది. ఇక జాతీయ స్థాయిలో చూస్తే..

Update: 2024-06-19 11:30 GMT

బ్రాండ్ వాల్యూ.. స్పోర్ట్స్ లో, సినిమా స్టార్ల విషయంలో తరచూ వినిపించే మాట ఇది.. సినిమాలు హిట్ అవుతున్నకొద్దీ, స్పోర్ట్స్ స్టార్లు రికార్డులు కొల్లగొడుతున్నకొద్దీ వారి బ్రాండ్ వాల్యూ అమాంతం పెరుగుతూ పోతుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సానియా మీర్జా, పీవీ సింధులకు ఒకప్పుడు టాప్ బ్రాండ్ వాల్యూ ఉండేది. ఇక జాతీయ స్థాయిలో చూస్తే..

పడిలేచిన బ్రాండ్ వాల్యూ

ప్రస్తుతం దేశంలో అత్యంత విలువైన సెలబ్రిటీ ఎవరు? ఆ టాపర్ సినిమాల నుంచా? స్పోర్ట్స్ నుంచా..? ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతూ జాబితా విడుదలైంది. బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ ను తోసిరాజంటూ టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. క్రోల్ రిపోర్ట్ ప్రకారం, బ్రాండ్ వాల్యూ పరంగా బాలీవుడ్ స్టార్లు షారుఖ్ ఖాన్, రణవీర్ సింగ్ లనూ కోహ్లీ అధిగమించాడు.

అయితే, నిరుడు కోహ్లి బ్రాండ్ వ్యాల్యూ దారుణంగా పడిపోయింది. ఇప్పుడు మాత్రం ‘సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్’ రిపోర్ట్‌లో పూర్వ వైభవం సాధించాడు. బాలీవుడ్ స్టార్లు, అథ్లెట్లతో సహా భారత టాప్ 25 ప్రముఖులు, వారి సామూహిక బ్రాండ్ విలువ 2023లో సుమారు $1.9 బిలియన్లు పెరగడం గమనార్హం. నిరుటితో పోలిస్తే ఇది 15.5% అధికం.

కాగా, కోహ్లి 28.9% వృద్ధితో టాప్ లో నిలిచాడు. ‘సెలబ్రిటీ బ్రాండ్ అసెస్ మెంట్‘ ప్రకారం 2022లో అతడి బ్రాండ్ విలువ 176.9 మిలియన్ డాలర్లు. తరువాతి ఏడాదికి అది 227.9 మిలియన్ డాలర్లకు చేరింది. అంటే 28.9% పెరుగుదల నమోదైంది.

షారూఖ్ ను పడగొట్టి

బాలీవుద్ బాద్ షా షారూఖ్ ఖాన్ అంటే మామూలు మాటలు కాదు. అలాంటివాడినే పడగొట్టాడు కోహ్లి. షారూఖ్ బ్రాండ్ విలువ 2020లో 51.1 మిలియన్ల డాలర్ల నుంచి 2023లో 120.7 మిలియన్ డాలర్లకు పెరిగింది. 116.6% పెరుగుదల కనిపించినా.. అతడి బ్రాండ్ విలువ కోహ్లి కంటే చాలా తక్కువగా ఉంది. షారూఖ్ బ్రాండ్ విలువ 120.7 మిలియన్ డాలర్లు ఉంటే.. కోహ్లి బ్రాండ్ విలువ 227.9 మిలియన్ డాలర్లకు చేరుకుంది. మరో విశేషం ఏమంటే కోహ్లి తర్వాతి స్థానంలో బాలీవుడ్ నటుడు రణ వీర్ సింగ్ (203.1 మిలియన్ డాలర్లు) ఉన్నాడు.

కష్టకాలంలో కోహ్లి..

భారత అత్యంత విలువైన సెలబ్రిటీగా నిలిచిన కోహ్లి.. ప్రస్తుతం వెస్టిండీస్‌ లో టి20 ప్రపంచ కప్‌ ఆడుతున్నాడు. అమెరికాలో జరిగిన లీగ్ దశలో మూడు మ్యాచ్ ల్లోనూ విఫలమైన అతడు వెస్టిండీస్ లో సూపర్‌-8 మ్యాచ్ లు ఆడేందుకు సిద్దం అవుతున్నాడు. గురువారం అఫ్ఘానిస్థాన్ పై రాణించేందుకు బ్యాట్ నూరుతున్నాడు.

Tags:    

Similar News