కోహ్లి పరుగులు కొట్టాడు.. రెస్టారెంట్ లో లాభాలూ కొట్టాడు

ముంబైలోని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి చెందిన వన్8 కమ్యూన్ రెస్టారెంట్ అయితే కస్టమర్లతో నిండిపోయింది.

Update: 2024-07-01 11:40 GMT

అసలే టి20 ప్రపంచ కప్.. అందులోనూ వీకెండ్ శనివారం.. భారత జట్టు 10 ఏళ్ల తర్వాత ఫైనల్ చేరింది. 17 ఏళ్లుగా పొట్టి కప్ కోసం నిరీక్షిస్తోంది. ఎప్పుడో ఐపీఎల్ మొదలవకముందు టి20 చాంపియన్ గా నిలిచింది టీమిండియా. మధ్యలో 17 సీజన్లు గడిచినా మరో టైటిల్ లేదు. ఇక ఈసారి ఫైనల్ ప్రత్యర్థి దక్షిణాఫ్రికా కావడంతో అందరూ మన జట్టుకే కాస్త ఓటు వేశారు. అనుకున్నట్లే భారత్ గెలిచింది. ఈ గొప్ప విజయం యావత్‌ జాతినే కాదు.. ఆహార పానీయాల, క్విక్‌ కామర్స్‌ కంపెనీలకూ మాంచి వ్యాపారం జరిగేలా చేసింది.

తింటూ, తాగుతూ..

ప్లేట్ లో ఇష్టమైన ఆహార పదార్థాలు తింటూ ఏకంగా టి20 ఫైనల్ చూడడం అంటే అది మామూలు లక్ కాదు.. మరి ఇలాంటి చాన్స్ దొరికితే ఎవరైనా ఎందుకు ఊరుకుంటారు. గత శనివారం ఫైనల్ ను ఆస్వాదించేందుకు, భారత్‌ టి20 ప్రపంచ కప్‌ గెలిచాక సంబరాలు చేసుకునేందుకు ప్రజలు ఆహార, పానీయాలకు భారీగా ఆర్డర్లు పెట్టారు. దీంతో రెస్టారెంట్లతో పాటు క్విక్ కామర్స్ సంస్థల విక్రయాలు, ఆదాయాలు 40% నుంచి 50% వరకు పెరిగాయి.

ముంబైలోని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి చెందిన వన్8 కమ్యూన్ రెస్టారెంట్ అయితే కస్టమర్లతో నిండిపోయింది. ఓవైపు కోహ్లి మైదానంలో పరుగులు చేస్తుంటే.. అతడి రెస్టారెంట్ లో కస్టమర్లు ఆర్డర్లతో కుమ్మేశారు. ది బీర్ కేఫ్‌ రెస్టారెంట్‌ ప్రారంభమైన 12 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఒక్క రోజు రెవెన్యూను చూసింది. ఇవే కాదు.. దేశంలోని అన్ని పెద్ద నగరాల్లో బార్‌ లు కేఫ్‌ లు, రెస్టారెంట్లు, హోటళ్లు కస్టమర్లతో నిండిపోయాయి. కొందరైతే తాము ఇంత క్రౌడ్ ను ఎప్పుడూ చూడలేదని చెప్పడం గమనార్హం.

రాత్రి 8-11 గంటల మధ్యనే..

దక్షిణాఫ్రికా –భారత్ ఫైనల్ మ్యాచ్ రాత్రి 8 గంటలకు మొదలైంది. 'సింపుల్' రిపోర్ట్‌ ప్రకారం మ్యాచ్‌ సమయంలో తమ వినియోగదార్లు 40 శాతం ఖర్చు ఎక్కువ చేశారని తెలిపింది. యూజర్లు వాలెట్లను లోడ్ చేసి వాడేశారని పేర్కొంది. వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌ తో పోలిస్తే, T20 ప్రపంచ కప్ ఫైనల్‌లో క్విక్ కామర్స్‌ లో కొనుగోళ్లు 40 శాతం పెరిగినట్లు అంచనా. శనివారం రాత్రి 8-11 మధ్య క్విక్ కామర్స్ లో ఆర్డర్లు వెల్లువెత్తాయి. సింపుల్ ద్వారా ఒక వ్యక్తి గరిష్టంగా రూ. 16,410 ఖర్చు చేయడం గమనార్హం. మరో వినియోగదారు ఏకంగా 59 ఆర్డర్లు చేశాడు. జెప్టో, బ్లింకిట్‌, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, పోర్టర్‌ సహా వివిధ ప్లాట్‌ఫామ్స్‌ లో సింపుల్ ద్వారా రూ. 100 లోపు ఆర్డర్లు నిరంతరం వచ్చాయి. నవంబరులో జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌ తో పోలిస్తే ఈసారి ఆర్డర్లు 35% పెరిగాయి.

Tags:    

Similar News