టీమిండియా టి20 వరల్డ్ కప్ వేట షురూ.. ఓపెనింగ్, తుది జట్టులో ఆశ్చర్యం

టి20లు ఎంత ధనాధన్ అయినప్పటికీ.. జట్టులో ఒక బ్యాటర్ టెక్నికల్ గా సౌండ్ అయి ఉండాలి.

Update: 2024-06-05 07:25 GMT

ఎప్పుడో 2007లో తొలి టి20 ప్రపంచ కప్ గెలిచింది టీమిండియా. అప్పటినుంచి అనేక ప్రయత్నాలు.. సొంతగడ్డపై.. విదేశాల్లో పలుసార్లు చివరి మెట్టుపైనో, సెమీ ఫైనల్స్ లోనో పరాజయం. ఇప్పుడు మళ్లీ ప్రపంచ కప్ వచ్చేసింది. బుధవారమే భారత జర్నీ షురూ. మరి ఈసారైనా కప్ కల నెరవేరుతుందా?

ఆ ఇద్దరితో ఓపెనింగ్..

టి20లు ఎంత ధనాధన్ అయినప్పటికీ.. జట్టులో ఒక బ్యాటర్ టెక్నికల్ గా సౌండ్ అయి ఉండాలి. భారత జట్టులో అలాంటివాడే విరాట్ కోహ్లి. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ గురించి చెప్పేదేముంది...? ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఈ ఇద్దరూ తమతమ జట్లు బెంగళూరు, ముంబైలకు ఓపెనింగ్ చేసే సంగతి తెలిసిందే. అయితే, స్వతహాగా కోహ్లి ఓపెనర్ కాదు. రోహిత్ కూడా కెరీర్ తొలినాళ్లలో ఓపెనర్ కాదు. అయితే, నుంచి 2013 చాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా ఇన్నింగ్స్ ఆరంభించడం మొదలుపెట్టి శిఖరాలకు చేరాడు. కోహ్లి నాలుగైదేళ్లుగా బెంగళూరుకు ఓపెనింగ్ చేస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లో మాత్రం రెగ్యులర్ గా ఓపెనింగ్ కు దిగింది లేదు.

తొలిసారి..ఒకేసారి క్రీజులోకి

టి20 ప్రపంచ కప్ సందర్భంగా మాత్రం ఓ అరుదైన కాంబినేషన్ కనిపించనుంది. కోహ్లి, రోహిత్ భారత ఇన్నింగ్స్ ను మొదలుపెట్టనున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఇదే జరిగితే.. మూడో నంబరులో 360 డిగ్రీ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ వస్తాడు. నంబర్ 4గా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్, నంబర్ 5-6లో ఆల్ రౌండర్లు శివమ్ దూబె, హార్దిక్ పాండ్యా దిగనున్నారు. స్పిన్ ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా/అక్షర్ పటేల్ లలో ఒకరిని ఎంచుకునే చాన్సుంది. కుల్దీప్ రెండో స్పిన్నర్. ముగ్గురు పేసర్లు బుమ్రా, అర్షదీప్, సిరాజ్ కాకుండా ఇద్దరితో బరిలో దిగాలనుకుంటే.. సిరాజ్ స్థానంలో చాహల్ ను ఆడించవచ్చు.

జైశ్వాల్, శాంసంగ్ లేకుండా

స్పెషలిస్ట్ ఓపెనర్ అయిన జైశ్వాల్, వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ లేకుండానే టీమిండియా బరిలో దిగేలా ఉంది. జైశ్వాల్ ఫామ్ లో లేనందున పక్కనపెట్టనున్నారు. శాంసన్ స్థానంలో పంత్ వైపే మొగ్గుచూపుతున్నారు.

ఐర్లాండ్ డేంజరే..

ఐర్లాండ్ తో ఇప్పటివరకు ఏడు టి20ల్లో తలపడి అన్నిట్లోనూ గెలిచింది టీమిండియా. అయితే, క్రికెట్ బలమైన మూలాలున్న ఐరిష్ జట్టును తేలిగ్గా తీసుకోకూడదు. గతంలో ఇంగ్లండ్ వంటి జట్లకే షాకిచ్చిన రికార్డు దానిది. ముఖ్యంగా టి20ల్లో ఆల్‌ రౌండర్లతో నిండిన ఐర్లాండ్‌ తో జాగ్రత్తగా ఉండాల్సిందే. క్యాంఫర్, అడైర్, డెలానీ, డాక్రెల్, టెక్టార్, స్టిర్లింగ్‌.. వీరంతా తుది జట్టులో ఉండే ఆల్‌ రౌండర్లే. ఓపెనర్ స్టిర్లింగ్‌ మంచి బ్యాటర్. కెప్టెన్‌ బాల్‌ బిర్నీ ఇటీవల మంచి ఫామ్‌ లో ఉన్నాడు. టెక్టార్, టకర్, డాక్రెల్, డెలానీ, క్యాంఫర్, అడైర్‌.. బ్యాటింగ్ లో, జోష్ లిటిల్, యంగ్, అడైర్‌ బౌలింగ్ లో కీలకం.

Tags:    

Similar News