నేడే వరల్డ్ కప్ జట్టు ప్రకటన? ఇదే పూర్తి జట్టు.. తిలక్ లేనట్లే

వచ్చే నెల 5 నుంచి భారత్ లో వన్డే ప్రపంచ కప్ మొదలుకానుంది.

Update: 2023-09-03 09:39 GMT

వచ్చే నెల 5 నుంచి భారత్ లో వన్డే ప్రపంచ కప్ మొదలుకానుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ మొదటి మ్యాచ్ లో తలపడనున్నాయి. ఇప్పటివకే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ప్రాబబుల్స్ ను ప్రకటించాయి. స్వదేశంలో సరిగ్గా 31 రోజుల్లో ప్రపంచ కప్ మొదలు కానుండగా.. టీమిండియా ప్రాబబుల్స్ వెల్లడికి సమయం దగ్గరపడింది. ఇందుకు సోమవారమే చివరి తేదీ. అంటే అన్ని దేశాలు.. సెప్టెంబరు 4 నాటికి తమ 17 మంది సభ్యుల ప్రాబబుల్స్ను వెల్లడించాలి. వీరిలోంచి 15 మంది సభ్యుల జట్టును ఆ తర్వాత ప్రకటించాల్సి ఉంటుంది.

ఆసియా కప్ జట్టేనా?

టీమిండియా ప్రస్తుతం ఆసియా కప్ ఆడుతోంది. ఇందుకోసం 17 మందితో జట్టును ప్రకటించారు. వీరిలోంచే ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేస్తారని ఇప్పటికే స్పష్టమైంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌ అజిత్‌ అగార్కర్‌ ప్రత్యేకంగా చర్చించారని తెలుస్తోంది. ఆదివారమే ప్రపంచ కప్ జట్టును ప్రకటిస్తారని కథనాలు వస్తున్నాయి. వాస్తవానికి తొలుత 17 మంది ప్రాబబుల్స్ ను ప్రకటించి అందులోంచి 15 మందిని ఎంపిక చేయాలి. ఇంగ్లండ్, ఆసీస్ అంతే చేయనున్నాయి. అయితే, భారత్ కు తగిన సమయం లేకపోవడంతో 15 మంది జట్టును ప్రకటించేయనుంది. ఇక ఆసియా కప్ నకు ఎంపికచేసిన వారినే ప్రపంచ కప్ లోకీ తీసుకుంటారా? లేదా? అనేదానిపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన లేదు.

రాహుల్ ఉంటాడా?

వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ కేఎల్ రాహుల్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఫిట్ నెస్ లేకపోవడంతో అతడు ఆసియా కప్ తొలి రెండు మ్యాచ్ లు ఆడడం లేదు. దీంతో యవ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ఇషాన్ కిషన్ కు తుది జట్టులో చోటు దొరికింది. దానిని అతడు పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. శనివారం పాకిస్థాన్ తో మ్యాచ్ లో కిషన్ ఇన్నింగ్స్ చూశాక అతడిని పక్కనపెట్టడం కష్టమే. ఇప్పుడు రాహుల్ పరిస్థితి ఏమిటన్న ప్రశ్న వస్తోంది. వాస్తవానికి రాహుల్ ఎంపికను మాజీలు కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే, కీలక బ్యాట్స్ మన్ కాబట్టి ఫిట్‌నెస్‌ నిరూపించుకోగలిగితే ఎంపిక చేసే అవకాశం ఉంది. అదే జరిగితే సంజూ శాంసన్ మళ్లీ రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితం కాక తప్పదు.

తిలక్, క్రిష్ణకు చాన్స్ లేనట్లే..

ఆసియా కప్‌ జట్టులో హైదరాబాదీ తిలక్ వర్మ, కర్ణాటక పేసర్ ప్రిసిద్ క్రిష్ణకు చోటు దక్కింది. ప్రపంచ కప్ నకు మాత్రం వీరిద్దరికీ చాన్సు లేనట్లే. మరో హైదరాబాదీ మొహమ్మద్ సిరాజ్ మాత్రం ఉండనున్నాడు. రాహుల్ ను తీసుకోకుంటేనే తిలక్ కు చాన్సు అనుకోవాలి. టి20ల్లో 360 డిగ్రీ బ్యాటర్ గా అద్భుతాలు సాధిస్తూ వన్డేల్లో తేలిపోతున్నప్పటికీ సూర్యకుమార్‌ యాదవ్‌ ప్రపంచ కప్ జట్టులో ఉంటాడు. పేసర్లుగా బుమ్రా, షమీ, సిరాజ్‌, పేస్ ఆల్ రౌండర్లుగా శార్దూల్, హార్దిక్‌ పాండ్య బౌలింగ్‌ను నడిపిస్తారు. మణికట్టు స్పిన్నర్ చాహల్‌కు మరోసారి నిరాశ తప్పకపోవచ్చు. స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌గా కుల్‌దీప్‌ యాదవ్‌ పక్కా. స్పిన్‌ ఆల్‌రౌండర్లుగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఉన్నారు.

ఇదీ టీమిండియా ప్రపంచ కప్ జట్టు?

రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్య (వైస్‌ కెప్టెన్), విరాట్ కోహ్లి, శుభ్‌ మన్‌ గిల్, శ్రేయస్‌ అయ్యర్, సూర్యకుమార్‌ యాదవ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్‌దీప్‌ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, మహమ్మద్‌ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా

Tags:    

Similar News