5 మ్యాచ్ ల్లో 700 నుంచి 4 మ్యాచ్ ల్లో 39.. టీమిండియా స్టార్ ఘోర వైఫల్యం

సరిగ్గా నెల కిందట వరకు అతడో భవిష్యత్ సూపర్ స్టార్ క్రికెటర్ గా పేరుతెచ్చుకున్నాడు. 5 టెస్టుల సిరీస్ లో ఏకంగా 700 పైగా పరుగులు చేసి రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు

Update: 2024-04-07 14:30 GMT

సరిగ్గా నెల కిందట వరకు అతడో భవిష్యత్ సూపర్ స్టార్ క్రికెటర్ గా పేరుతెచ్చుకున్నాడు. 5 టెస్టుల సిరీస్ లో ఏకంగా 700 పైగా పరుగులు చేసి రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. ఇంకేం..? మీడియా ఆకాశానికి ఎత్తేసింది. కానీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు వచ్చేసరికి ఆ యువ క్రికెటర్ తీవ్రంగా తడబడుతున్నాడు. మూడు ఫార్మాట్లలోనూ టీమిండియాకు నిలకడగా ఆడతాడని, ఓపెనింగ్ లో దుమ్మురేపుతాడని ఆశలు పెట్టుకుంటే.. పొట్టి ఫార్మాట్ లో తడబడుతున్నారు.

మొన్న పరుగుల వరద

9 మ్యాచ్ లు.. 16 ఇన్నింగ్స్ లు.. 1028 పరుగులు.. 3 సెంచరీలు, 4 అర్ద సెంచరీలు.. ఇదీ యశస్వి జైశ్వాల్ రికార్డుల పరంపర. ఇటీవలి ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో అయితే 712 పరుగులు బాదేశాడు. కాగా, భారత్ తరఫను 17 టి20ల్లో జైశ్వాల్ 16 ఇన్నింగ్స్ ఆడి 500 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. ఇంకా వన్డేల్లో అరంగేట్రం చేయాల్సి ఉంది.

నేడు స్కోరు కోసం తండ్లాట

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో జైశ్వాల్ పూర్తిగా తడబడుతున్నాడు. రాజస్థాన్ రాయల్స్ కు ఆడుతున్న అతడు 4 మ్యాచ్ లలో చేసినవి 39 పరుగులే కావడం గమనార్హం. శనివారం నాటి బెంగళూరుతో మ్యాచ్ లో అయితే డకౌట్ అయ్యాడు. అంతకుముందు ముంబై 10, ఢిల్లీపై 5 పరుగులే చేశాడు. కాగా.. తొలి మ్యాచ్ లో (లక్నో) తర్వాత మూడు మ్యాచ్ లలోనూ జైశ్వాల్ సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యాడు. మొత్తమ్మీద 9.75 మాత్రమే అతడి సగటు.

ప్రచారం చేటు చేసిందా..?

జైశ్వాల్ కు వచ్చిన విపరీతమైన ప్రచారం అతడి ఆటపై ప్రభావం చూపిందా..? లేదంటే టెస్టుల మూడ్ నుంచి అతడు ఇంకా బయటకు రాలేదా..? అనే అనుమానం కలుగుతోంది. వాస్తవానికి జైశ్వాల్ మంచి హిట్టర్. టెస్టుల్లో పాతుకుపోవడమే కాదు.. టి20ల్లోనూ దుమ్మురేపేంత సామర్థ్యం ఉంది. కానీ, అతడు ఈ ఐపీఎల్ సీజన్ లో విఫలం అవుతున్నాడు. దీనికి విరామం లేకుండా ఆడడమే కారణం. అయితే, ఇప్పటికి జరిగింది నాలుగు మ్యాచ్ లే. రాజస్థాన్ వీటన్నిటిలో విజయం సాధించింది కాబట్టి జైశ్వాల్ కు కాస్త విశ్రాంతి ఇచ్చినా ఏం కాదు. వరుసగా క్రికెట్ ఆడుతున్న అతడికి ఉపశమనం లభించి రీచార్జ్ అయ్యే చాన్స్ ఉంటుంది.

ప్రపంచ కప్ కు ఉంటాడా?

వచ్చే జూన్ లో జరిగే టి20 ప్రపంచ కప్ నకు టీమిండియా ప్రాబబుల్స్ ఎంపిక ఈ నెలలోనే ఉంది. ఇందుకోసం జైశ్వాల్ పేరును పరిగణించాలంటే ఐపీఎల్ లో రాణించాల్సి ఉంటుంది. ఇప్పటికైతే జైశ్వాల్ రేసులోనే ఉన్నట్లు. ఐపీఎల్ లో రాణించకుంటే మాత్రం ప్రపంచ కప్ వంటి ప్రతిష్ఠాత్మక టోర్నీకి ఎంపికవడం కష్టమే.

కొసమెరుపు: నిరుడు రాజస్థాన్ రాయల్స్ ద్వారానే తొలి అంతర్జాతీయ క్రికెట్ అనుభవం చూసిన జైశ్వాల్ 14 మ్యాచ్ ల్లో 625 పరుగులు చేశాడు. ఇందులో 5 అర్థ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి.

Tags:    

Similar News