పసివాళ్లు.. ప్రపంచ కప్ మొనగాళ్లు.. మనోళ్లు ఇద్దరు

ప్రపంచ కప్ అంటే నాలుగేళ్లకు వచ్చే కల.. టి20లు ఆడినా.. టెస్టుల్లో అదరగొట్టినా వన్డేలకు ఉన్న ప్రాధాన్యం వేరే. అందుకనే ప్రతి ఆటగాడు వన్డే ప్రపంచ ఆడాలనుకుంటాడు

Update: 2023-10-05 09:38 GMT

ప్రపంచ కప్ అంటే నాలుగేళ్లకు వచ్చే కల.. టి20లు ఆడినా.. టెస్టుల్లో అదరగొట్టినా వన్డేలకు ఉన్న ప్రాధాన్యం వేరే. అందుకనే ప్రతి ఆటగాడు వన్డే ప్రపంచ ఆడాలనుకుంటాడు. అందులో కనీసం ఒక్క మ్యాచ్ లో పాల్గొన్నా కెరీర్ ధన్యం అయిందనుకుంటాడు. కానీ, కొందరికి ఈ అవకాశం రానే రాదు.. వీవీఎస్ లక్ష్మణ్ వంటి దిగ్గజ బ్యాట్స్ మన్ కు, అంబటి రాయుడి వంటి ప్రతిభావంతుడికి.. ఈ విషయం బాగా తెలుసు. కొందరికి మాత్రం అనుకోకుండానే అవకాశం దక్కుతుంది.


కెరీర్ కు ఓ మచ్చుతునక

ఎన్ని మ్యాచ్ లు ఆడినా ప్రపంచ కప్ లో ఒక్క మ్యాచ్ ఆడకుంటే కెరీర్ కు సార్థకత లేనట్లేననేది క్రికెటర్ల భావన. కాగా, చాలామంది క్రికెటర్లకు 30 ఏళ్ల వయసుకు గాని ప్రపంచ కప్ ఆడే అవకాశం రాదు. సచిన్ టెండూల్కర్ వంటి క్రికెట్ దేవుడికి మాత్రం 18 ఏళ్ల వయసుకే ప్రపంచ కప్ లో జట్టు బ్యాటింగ్ భారం మోసే బాధ్యత లభించింది. అందరు క్రికెటర్ల విషయంలోనూ సాధ్యం కాని విషయం ఇది. అయితే, భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ లో కొందరు కుర్రాళ్లు నూనూగు మీసాల వయసులోనే ఆడబోతున్నారు. మరి వారెవరో తెలుసుకుందామా?

తమ జట్లకు తురుపుముక్కలు

వయసు 18 నుంచి 20 మాత్రమే. కానీ, వారు జట్టుకు తురుపుముక్కలు. అనుభవం పెద్దగా లేకున్నా.. అనుభవం ఉన్నవారిని వణికించగలవారు. ఓ మాటలో చెప్పాలంటే రహస్య ఆయుధాల వంటివారు.

కత్తి 'నూర్' తున్న అఫ్ఘానీ

నూర్ అహ్మద్.. ఇప్పటివరకు మనకు రషీద్ ఖాన్, ముజీబుర్ రెహ్మాన్ వంటి అఫ్ఘానీల గురించి తెలుసు. అలాంటి మిస్టరీ స్పిన్నర్లనూ తోసిరాజని ఓ అఫ్ఘానీ పేరు మార్మోగుతోంది. ఇంతకూ అతడి వయసు 18 మాత్రమే. ఈ ప్రపంచ కప్ లో అత్యంత చిన్న వయసు ఆటగాడు. ముజీబ్, రషీద్ రైట్ ఆర్మ్ స్పిన్నర్లయితే.. నూర్ ఎడమచేతివాటం కావడం ప్రత్యేకత. గుజరాత్ టైటాన్స్ కు ఈ సీజన్ లో ప్రాతినిధ్యం వహించి ఆకట్టుకున్న నూర్.. వివిధ టీ20 లీగ్ లలోనూ సత్తా చాటాడు. 3 వన్డేల్లో 6 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌ నేపథ్యంలో భారత పిచ్‌లపై అతడికి మంచి అవగాహన ఉంది. ఇక స్పిన్‌ కు అనుకూలించే పిచ్‌ లపై కచ్చితంగా కీలకమవుతాడు.

బంతితో దత్తు.. బ్యాట్ తో విక్రమ్ జీతూ..

ప్రపంచ కప్ నకు అనూహ్యంగా అర్హత సాధించింది నెదర్లాండ్స్. గతంలోనూ భారత్ లో జరిగిన ప్రపంచ కప్ లో పాల్గొన్న ఈ జట్టులో భారతీయులు ఎక్కువే. విజయవాడకు చెందిన తేజ నిడమానూరు ఇప్పటివరకు తెలిసిన పేరు. కానీ.. ఆర్యన్‌ దత్‌ అని మరో కుర్రాడు ఉన్నాడు. ఈ కప్ ఆడుతున్న రెండో పిన్న వయస్కుడు. ఇతడి వయసు 20 ఏళ్ల 118 రోజులే. లెఫ్ట్‌ ఆర్మ్‌ సీమర్‌ కావడం ఇతడి ప్రత్యేకత. భారత్ మూలాలున్న దత్ ప్రపంచ కప్ లో ముద్ర వేయడానికి ఆసక్తిగా ఉన్నాడు. రెండేళ్ల కిందటే అంటే 18 ఏళ్ల వయసులో 2021లో స్కాట్లాండ్‌ పై అరంగేట్రం చేసిన ఆర్యన్‌... 25 వన్డేలు ఆడి 20వికెట్లు పడగొట్టాడు. 3/31 అతడి ఉత్తమ ప్రదర్శన. కీలక భాగస్వామ్యాలను విడగొట్టడంలో దత్ ది అందెవేసిన చేయి. ఇక నెదర్లాండ్స్ తరఫున ఆడనున్న మరో భారతీయుడు విక్రమ్ జీత్ సింగ్ . పంజాబీ మూలాలున్న విక్రమ్ వయసు 20ఏళ్ల 342 రోజులు. 25 వన్డేల్లో 808 పరుగులు చేశాడు. ఓ సెంచరీ, 4 అర్ధసెంచరీలు బాదాడు. విక్రమ్ ఫ్యామిలీ 14 ఏళ్ల కిందట నెదర్లాండ్స్ కు వలస వెళ్లింది. కాగా, సొంతగడ్డపై ఆడబోతున్న విక్రమ్ సత్తా చాటేందుకు ఎదురుచూస్తున్నాడు.

మరో అఫ్ఘాన్ గన్..

అఫ్గాన్ కు చెందిన రియాజ్‌ హసన్‌ 20 ఏళ్ల 310 రోజుల వయసులో ప్రపంచ కప్ ఆడబోతున్నాడు. మూడో అతి పిన్న వయసు వాడు ఇతడు. కుడి చేతి వాటం బ్యాటర్‌ అయిన హసన్ .. టాపార్డర్‌లో వస్తాడు. 2022 జనవరిలో నెదర్లాండ్స్‌పై అరంగేట్రం చేశాడు. నాలుగు వన్డేలు ఆడాడు. ఒక అర్ధ సెంచరీ చేశాడు.

బంగ్లా బుల్లెట్..

ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్ క్రికెట్ వర్గాల్లో మార్మోగుతున్న పేరు తన్‌జీమ్‌ హసన్‌. మెరుగ్గా రాణిస్తున్న ఈ పేసర్ ఆసియా కప్ లో భారత్ ను ఇబ్బందిపెట్టాడు. ఇదే అతడికి తొలి మ్యాచ్. ఇతడి వయసు 20 ఏళ్ల 341 రోజులే. తమ దేశంలో తరహాలో పిచ్ లు ఉండే భారత్ లో బంతులు ఎలా వేయాలో హసన్ కు కొట్టినపడింది. ఆడింది 2 వన్డేలే అయినప్పటికీ 2 వికెట్లే తీసినప్పటికీ మంచి భవిష్యత్ ఉన్నవాడిలా కనిపించాడు.

యార్కర్, స్లో బౌన్సర్లతో వికెట్లు తీయడం హసన్ ప్రత్యేకత.

Tags:    

Similar News