డైలమాలో దిగ్గ‌జ OTT.. ఎట్ట‌కేల‌కు రీలాంచ్?

టాలీవుడ్ నిర్మాత సాహు గారపాటి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 2025లో ఫ్లిప్ కార్ట్ OTT గేమ్‌లోకి తిరిగి రావాలని ప్లాన్ చేస్తున్న‌ట్టు వెల్ల‌డించారు.

Update: 2024-12-29 15:54 GMT

ఓటీటీ వ్యాపారం స‌వాళ్ల‌తో కూడుకున్న‌ది. కార్పొరెట్ దిగ్గ‌జాలు ఒరిజిన‌ల్ వీడియో కంటెట్ రూపొందించ‌డం కోసం వంద‌ల కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. డ‌బ్బు తిరిగి వ‌స్తుందా లేదా? అని ఆలోచిస్తే ముందుకు వెళ్ల‌డం సాధ్య‌ప‌డ‌దని ప్ర‌ముఖ వ్యాపార దిగ్గ‌జాలు, స్టూడియోల య‌జ‌మానులు గ‌తంలో విశ్లేషించారు. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోస్ భారీ పెట్టుబ‌డుల‌తో సాహ‌సాలు చేసాయ‌ని వివ‌రించారు.

'ఆహా-తెలుగు' ఓటీటీని అభివృద్ధి చేసేందుకు అగ్ర‌నిర్మాత‌, బిజినెస్ మేన్ అల్లు అర‌వింద్ కోట్లాది రూపాయ‌ల‌ పెట్టుబ‌డుల్ని పెట్టిన సంగ‌తి తెలిసిందే. చాలా ప్రాంతీయ ఓటీటీలు బ‌రిలో దిగినా వీటిలో కొన్ని మూత‌ప‌డ్డాయి. ఇటీవ‌ల సెన్సార్ షిప్ లేని అడ‌ల్ట్ కంటెంట్ ని ప్ర‌సారం చేస్తున్న 18 ఓటీటీల‌ను కేంద్ర స‌మాచార ప్ర‌సారాల శాఖ బ్యాన్ చేసింది. ఓటీటీల‌పై ప‌రిమితులు, నిబంధ‌న‌లు పెరుగుతున్న ఈ సమ‌యంలో వాటి నిర్వ‌హ‌ణ‌, మ‌నుగ‌డ‌పై చాలా సందేహాలున్నాయి.

ఇదిలా ఉంటే 2019లో ప్రారంభ‌మై కేవ‌లం రెండేళ్ల‌కే మూత ప‌డిన 'ఫ్లిప్ కార్ట్ వీడియో' ఓటీటీ రంగంలో పోటీ నుంచి వైదొల‌గ‌డంపై చాలా చ‌ర్చ సాగింది. తాజా స‌మాచారం మేర‌కు ఫ్లిప్‌కార్ట్ వీడియో తిరిగి రీలాంచ్‌ కానుంద‌ని స‌మాచారం. టాలీవుడ్ నిర్మాత సాహు గారపాటి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 2025లో ఫ్లిప్ కార్ట్ OTT గేమ్‌లోకి తిరిగి రావాలని ప్లాన్ చేస్తున్న‌ట్టు వెల్ల‌డించారు.

ఫ్లిప్‌కార్ట్ వీడియో అనేది వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్ (ఆన్‌లైన్ గూడ్స్ డెలివ‌రీ సంస్థ‌) నిర్వహించే OTT (ఓవర్ ది టాప్) వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్. దీనిని 2019లో ప్రారంభించారు. వూట్, అర్రే, విఐయు, టివిఎఫ్‌, పాకెట్ ఏసెస్, డైస్ మీడియా స‌హా ప‌లు అనుబంధ సంస్థ‌ల‌ నుండి కంటెంట్‌ని క్రమబద్ధీకరించి ప్ర‌సారం చేసింది. అయితే వూట్ గ‌తంలో రిల‌య‌న్స్ కి చెందిన‌ 'జియో సినిమాస్' ఓటీటీతో మెర్జ్ అయిన సంగ‌తి తెలిసిందే.

అక్టోబర్ 2019లో మొదటి ఒరిజినల్ సిరీస్ 'బ్యాక్ బెంచర్స్‌'ను ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. ఇది బాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత ఫరా ఖాన్ హోస్ట్ చేసిన క్విజ్ షో. ఇందులో బాలీవుడ్ ప్రముఖులు విద్యార్థులుగా .. హోస్ట్ ఫరా స్కూల్ చిత్రకళకు డీన్‌గా ఉన్నారు. ఈ షోలో బాలీవుడ్ ప్రముఖులు అనిల్ కపూర్, శిల్పాశెట్టి, కార్తీక్ ఆర్యన్, పరిణీతి చోప్రా, అనన్య పాండే, జాన్వీ కపూర్, మలైకా అరోరా తదితరులు పాల్గొన్నారు. ఫ్లిప్‌కార్ట్ వినోద రంగంపై దృష్టి సారించినందున .. ఓటీటీ రంగంలో స‌వాళ్ల‌ను ఎదుర్కొని వీక్షకులను ఏమేర‌కు ఆక‌ర్షిస్తుందో చూడాలి.

Tags:    

Similar News