హృతిక్ ఫ్యామిలీ డాక్యుమెంటరీ ‘ది రోషన్స్‌’ ఆకట్టుకుందా..?

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఇటీవల కాలంలో పలువురు సినీ ప్రముఖల జీవితాలను డాక్యుమెంటరీల రూపంలో ప్రేక్షకులకు అందిస్తున్న సంగతి తెలిసిందే.

Update: 2025-01-18 15:43 GMT

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఇటీవల కాలంలో పలువురు సినీ ప్రముఖల జీవితాలను డాక్యుమెంటరీల రూపంలో ప్రేక్షకులకు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్ట్రీమింగ్ కు వచ్చేసిన దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి, స్టార్ హీరోయిన్ నయనతార డాక్యుమెంటరీలకు మంచి ఆదరణ లభించింది. ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్‌ స్టార్ హీరో హృతిక్‌ రోషన్‌ ఫ్యామిలీ ఆధారంగా తెరకెక్కిన ‘ది రోషన్స్‌’ డాక్యుమెంటరీ రిలీజ్ అయింది.

హిందీ చలనచిత్ర పరిశ్రమలో రోషన్‌ కుటుంబానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ ఫ్యామిలీ లెగసీ, మూడుతరాల ప్రముఖుల గురించి ‘ది రోషన్స్‌’ డాక్యుమెంటరీలో వివరించారు. హృతిక్‌ రోషన్‌, ఆయన తండ్రి రాకేశ్‌ రోషన్‌, తాతయ్య రోషన్‌ కెరీర్‌ మరియు పర్సనల్‌ లైఫ్‌ కు సంబంధించిన విషయాలను ఇందులో చూపించారు. నాలుగు ఎపిసోడ్‌లలో సుమారు 3 గంటల నిడివితో నలుగురు రోషన్స్ జీవితంలోని ముఖ్యమైన అంశాలను ఈ డాక్యుమెంటరీలో ప్రస్తావించారు. దీనికి శశి రంజన్ దర్శకత్వం వహించారు.

'రహెన్ నా రహెన్ హమ్' అనే పేరుతో వచ్చిన మొదటి ఎపిసోడ్ అలనాటి మ్యూజిక్ కంపోజర్ రోషన్ సంగీత ప్రయాణంపై దృష్టి పెడుతుంది. 'తోడా హై థోడే కి జరూరత్ హై' అనే రెండో ఎపిసోడ్ లో రాజేష్ రోషన్ గురించి వివరించారు. 'నిక్లే ది కహాన్ జానే కే లియే' ఎపిసోడ్ లో రాకేష్ రోషన్ విశేషాలను తెలియజేశారు. ఆయన కెరీర్ ప్రారంభం, యాక్టర్ గా ఫెయిల్యూర్స్, దర్శకుడిగా సక్సెస్ అవ్వడం, తన డైరెక్షన్ లో హృతిక్ కెరీర్‌కు బలమైన పునాది వేయడం, క్యాన్సర్‌తో పోరాడటం వంటి అంశాల గురించి చూపించారు.

హృతిక్ రోషన్ గురించి 'కోయి మిల్ గయా' అనే నాలుగో ఎపిసోడ్ లో ప్రముఖంగా చూపించారు. అతని బాల్యం దగ్గర నుంచి హీరోగా ఎదిగే క్రమాన్ని వివరించారు. కానీ హృతిక్ సినీ ప్రయాణాన్ని అతని తండ్రి దర్శకత్వం వహించిన 'కహో నా ప్యార్ హై', 'కోయి మిల్ గయా', 'క్రిష్' వంటి మూడు చిత్రాలకే పరిమితం చేయడం నిరాశపరుస్తుంది. కెరీర్ ప్రారంభంలో హృతిక్ ఫెయిల్యూర్స్, హీరోగా నిలబెట్టిన ఇతర చిత్రాల గురించి ప్రస్తావించలేదు.

ఫైనల్ గా 'ది రోషన్స్' అనేది బాలీవుడ్ లోని ఒక దిగ్గజ కుటుంబం యొక్క సినీ ప్రయాణాలను.. మ్యూజిక్, డైరెక్షన్, యాక్టింగ్ లలో రోషన్స్ సహకారాన్ని వివరించే ఒక డాక్యుమెంటరీ. దీని ద్వారా హిందీ సినిమా పరిశ్రమకు వారు చేసిన సేవలు, ఎవరికీ తెలియని కొన్ని విషయాలను తెలియజెప్పారు. అయితే కొన్నిపరిమితులకు లోబడే ఈ ఎపిసోడ్స్ సాగినట్లుగా అనిపిస్తుంది. వివాదాల గురించి చర్చించలేదు. ముఖ్యంగా హృతిక్ రోషన్‌పై సాగే ఎపిసోడ్ పెద్దగా ఆకట్టుకోలేదనే కామెంట్స్ వస్తున్నాయి. హిందీ ఆడియన్స్ కు, హృతిక్ అభిమానులను ఈ డాక్యుమెంటరీ మెప్పిస్తుంది.

Tags:    

Similar News