4జీ స్పెషల్; చెట్ల లాంటి సెల్ టవర్లు

Update: 2015-07-15 07:19 GMT
విజయవాడ.. గుంటూరులలోని కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు ఇప్పుడు ఆసక్తిగా ఆకాశం వైపు చూస్తున్నారు. పక్కనున్న వారితో ఆసక్తిగా చేతులు చూపిస్తూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంత ఆశ్చర్యం అంటే.. రోడ్ల మధ్యలో కొబ్బరిచెట్లు.. తాటి చెల్ల లాంటివి వచ్చేయటం వారిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పొడవాటి చెట్లు రోడ్ల మధ్యలో రావటం ఏమిటన్న ఆశ్చర్యానికి అక్కడికక్కడే సమాధానం లభిస్తోంది కూడా.

చూసేందుకు చెట్లు మాదిరి కనిపిస్తున్న అవి చెట్లు కావు. సెల్ టవర్లు. గతంలో మాదిరి ఒక పెద్ద ఖాళీ స్థలంలో భారీ టవర్ ఏర్పాటు చేసేవారు. కానీ.. 4జీ సాంకేతికతతో ఉండే సమస్య ఏమిటంటే.. 4జీ సిగ్నల్ కోసం చాలా తక్కువ నిడివిలో టవర్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అంటే.. 2జీతో పోలిస్తే.. బ్యాండ్ విడ్త్ తక్కువ. అయితే.. వేగంగా పని చేసేందుకు ఉపయోగపడే ఈ టెక్నాలజీలో చాలా తక్కువ పరిధిలో సెల్ టవర్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

అలా అని.. బలమైన సిగ్నల్ కోసం భారీగా టవర్లు పెడితే కష్టం కావటంతో.. ఈ సమస్య పరిష్కారం కోసం వినూత్నమైన ఆలోచన చేశారు. రోడ్డు మధ్యలో చెట్లను నాటిన స్ఫూర్తిగా చెట్ల ఆకారంలో సెల్ టవర్లు తయారు చేశారు. దీనివల్ల తక్కువ వ్యాసార్థంలో దీని నిర్మాణం పూర్తి అవుతుంది. స్థలం కూడా పెద్దగా అవసరం కాదు. ఖర్చు కూడా తక్కువే. ఇక.. రేడియేషన్ సమస్యలు కూడా చాలా తక్కువగా ఉంటాయని చెబుతున్నారు. స్టీల్ గొట్టాలతో తయారు చేస్తున్న ఈ స్తంభాలకు పైన చెట్ల మాదిరి ఆకులు ఏర్పాటు చేసి ఆకట్టుకుంటున్నారు.

ప్రస్తుతం విజయవాడ.. గుంటూరులోని పలు ప్రాంతాల్లో ఇలాంటి వాటిని ఏర్పాటు చేశారు. రిలయన్స్ జియో నెట్ వర్క్ కోసం ఇలాంటి అత్యాధునిక చెట్ల లాంటి సెల్ టవర్లను వినియోగిస్తున్నారు.
Tags:    

Similar News