ఆన్‌లైన్ మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఆన్‌లైన్‌లో పేరెన్నికగన్న సంస్థలు కూడా వినియోగదారులను అడ్డగోలుగా మోసం చేసే పరిస్థితులు నిత్యకృత్యం కావడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో వినియోగదారులు చేరుతున్నారు. తాజాగా ఈ కామర్స్ దిగ్గజం ప్లిప్‌కార్ట్ భారీ మోసానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. స్మార్ట్ ఫోన్ ఆర్డిరిస్తే మామిడిపండ్లను అందజేసిందా కంపెనీ.
కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన సృచరణ్ ప్లిప్‌కార్ట్ లో మెగా సేల్ ఆఫర్ లో ఆసుస్ ఫోన్ ను ఆర్డరిచ్చారు. క్రెడిట్ కార్డు ద్వారా రూ.8099 చెల్లించి
ఫోన్ బుక్ చేసుకున్నారు. పదిరోజుల తర్వాత కొరియర్ వచ్చింది. ఈ సమయంలో కొరియర్ ఓపెన్ చూస్తే దిమ్మ తిరిగింది. అందులో రెండు మామిడిపండ్లు కనిపించాయి. షాక్ నుంచి తేరుకున్న సృచరణ్ కస్టమర్ కేర్‌కు కాల్ చేసి స్మార్ట్ ఫోన్ బుక్ చేస్తే మామిడిపళ్లు పంపారంటూ ఫిర్యాదు చేశాడు. వాళ్ల దగ్గరి నుంచి సరైన రెస్పాన్స్‌రాకపోవడంతో మీడియా దృష్టికి తీసుకొచ్చాడు బాధితుడు. ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసిన సృచరణ్ తనకు న్యాయం జరగకుంటే... వినియోగదారుల ఫోరం ఆశ్రయిస్తానని చెప్పారు.
ప్రముఖ కంపెనీలు కూడా ఇలా మోసం చేస్తే పరిస్థితి ఏంటనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఆన్ లైన్లో ఏదైనా కొనాలనుకునే వారు అన్ని జాగ్రత్తలు తప్పనిసరి తీసుకోవాలని ఈ ఘటన తెలుపుతోంది.