ఆ రావు.. ఈ రావు.. మధ్యలో ఎమ్మెల్యే పదవి
ఇప్పుడు అక్కడి ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేస్తూ కోర్టు తీర్పు నిచ్చింది
ఆ ఇద్దరూ ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకులే.. గత ఎన్నికల్లో ఒకే నియోజకవర్గం నుంచి ఒకరు గెలవగా.. మరొకరు ఓడిపోయారు. ఇప్పుడు అక్కడి ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేస్తూ కోర్టు తీర్పు నిచ్చింది. దీంతో ఆ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన మరో నాయకుడు తనతో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించాలని కోరుతున్నారు. ఇంతకీ ఆ ఇద్దరు నాయకులు ఎవరంటే.. వనమా వెంకటేశ్వరరావు, జలగం వెంగల్ రావు.
2018 ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి కాంగ్రెస్ తరపున గెలిచిన వనమా.. ఆ తర్వాత బీఆర్ఎస్‌లో చేరారు. అప్పుడు రెండో స్థానంలో నిలిచిన బీఆర్ఎస్ నేత వెంగల్రావు.. ఎన్నికల అఫిడవిట్‌లో వెంకటేశ్వరరావు తప్పడు సమాచారం ఇచ్చారని, ఆయన ఎన్నికను కొట్టేయాలని కోర్టును ఆశ్రయించారు.
తాజాగా వెంకటేశ్వర రావు ఎన్నిక చెల్లదని, 2018 డిసెంబర్ 12 నుంచి వెంగల్ రావే ఎమ్మెల్యే అని హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో తనతో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించాలని, కోర్టు తీర్పును అమలు చేయాలని వెంగల్రావు శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కోరారు. శాసన సభ కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వినతి పత్రంతో పాటు హైకోర్టు తీర్పు ప్రతిని కూడా అందజేశారు.
మరోవైపు వనమా ఏమో.. తీర్పును నెల రోజుల పాటు నిలిపివేయాలని, తాను సుప్రీం కోర్టుకు వెళ్తానని హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. కానీ దీన్ని న్యాయస్థానం కొట్టేసింది. దీంతో ఇప్పుడు వెంకటేశ్వర్‌రావు ఏం చేస్తారనే ఆసక్తి నెలకొంది. మరోవైపు ఈ ఇద్దరు రావుల విషయంలో పార్టీ అధినేత కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి. కోర్టు తీర్పును అనుసరించి వెంగల్రావుతో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయిస్తారా? లేదా ఎన్నికలకు మరో మూణ్నాలుగు నెలలే ఉండడంతో అప్పటి వరకూ వేచి చూసే ధోరణి అవలంభిస్తారా? అన్నది చూడాలి.