తెలంగాణలో రికార్డు వర్షపాతం... బండి ఆగితే ఫోన్ చేయండి!

ఇందులో భాగంగా హైదరాబాద్ లో ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షాలు

Update: 2023-07-27 04:46 GMT

హైదరాబాద్ ను వర్షం ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే. ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాలవల్ల రహదారులు కాలువలను తలపిస్తున్నాయి! ఇదే సమయంలో లోతట్టు ప్రాంతాలు నీటమునుగుతున్నాయి. దీంతో ప్రజలను జీ.హెచ్.ఎం.సీ అధికారులు అప్రమత్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీచేశారు.

ఇందులో భాగంగా హైదరాబాద్ లో ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షాలు గురువారం కూడా కొనసాగుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇప్పటికే నగరంలోని జలాశయాలు నిండుకుండల్లా మారాయి. ఇదే సమయంలో తెలంగాణ జిల్లాలలోని పలు జిల్లాలలో అతి భారీ వర్షాలు నమోదయ్యాయి.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల్ వద్ద బుధవారం ఉదయం నుంచీ గురువారం ఉదయం 7 గంటల వరకు అత్యధికంగా 616.5 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. ఫలితంగా భూపాలపల్లి-పరకాల ప్రధాన రహదారి పై మోరంచపల్లి వద్ద సుమారు 15 అదుగుల ఎత్తులో మోరంచ వాగు పొంగి ప్రవహిస్తోంది.

ఇదే క్రమంలో ములుగు జిల్లాలోని వెంకటాపురంలో 193.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రధానంగా బుధవారం రాత్రి నుంచి హైదరాబాద్‌ లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. దీంతో... హైదరాబాద్‌ లో శుక్రవారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర వాతావరణ శాఖ అంచనా వేసింది.

ఇదే సమయంలో రానున్న 48 గంటల్లో ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ముందుజాగ్రత్త చర్యగా తెలంగాణ ప్రభుత్వం బుధ, గురువారాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది.

బండి ఆగితే ఫోన్ చేయండి:

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నడిరోడ్డుపై వాహనాలు మొరాయిస్తే, ట్రాఫిక్ జామ్ సమస్య పరిష్కరించేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వినూత్న ఆలోచన చేశారు. ఇందులో భాగంగా... ఇకపై వర్షానికి బండి ఆగిపోతే (రోడ్డుపై బ్రేక్డౌన్ అయితే) వెంటనే 83339 93360 నెంబర్‌ కు వాట్సప్ కాల్ చేస్తే సైబరాబాద్ పోలీసులు సహాయం చేస్తారు. అయితే ఇది సైబరాబాద్ కమిషనరేట్ పరిధి వరకు మాత్రమేనని పోలీసులు స్పష్టం చేశారు.

ఇదే సమయంలో భారీ వర్షాల వేళ సైబరాబాద్ పోలీసులు సాయం కోసం సంప్రదించాల్సిన నెంబర్లను ప్రకటించారు. మేడ్చల్ ట్రాఫిక్ డీసీపీ మాదాపూర్ ట్రాఫిక్ డీసీపీ: 87126 63011, 87126 63010 ను సంప్రదించాలని సూచించారు. సైబరాబాద్ పోలీసులు వాట్సప్ నంబరు: 9490617346 ను సంప్రదించాలని పోలీసులు తెలిపారు!

Tags:    

Similar News