సడెన్ ట్విస్టు.. టైగర్ మెడపై మార్వల్ కత్తి
ఈ దీపావళి పండుగకి భారీ యాక్షన్ అడ్వెంచర్..పూర్తిస్థాయి కుటుంబ వినోదం కోసం మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన 'ది మార్వెల్స్' ని విడుదల చేస్తున్నామని టీమ్ ప్రకటించింది.
దీపావళి పండక్కి `టైగర్ 3` విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అయితే సల్మాన్ భాయ్ నటిస్తున్న ఈ సినిమాతో పోటీపడుతూ ఇప్పుడు మార్వల్ బ్రాండ్ సినిమా విడుదలవుతోంది. పండగ ముందు భాయ్ కి ఇది బిగ్ జోల్ట్ లాంటిది. నిజానికి సల్మాన్ కి దీపావళి సెంటిమెంట్ చాలా ఎక్కువ. ఇది చాలాసార్లు వర్కవుటైంది. అందుకే ఈసారి భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ `టైగర్ 3`తో పాన్ ఇండియాలో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు.
కానీ ఇంతలోనే ఊహించని పిడుగులా ది మార్వల్ సినిమాని భారతదేశంలో అత్యంత భారీగా విడుదల చేస్తున్నారు. ఈ దీపావళి పండుగకి భారీ యాక్షన్ అడ్వెంచర్ .. పూర్తిస్థాయి కుటుంబ వినోదం కోసం మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన `ది మార్వెల్స్` ని విడుదల చేస్తున్నామని టీమ్ ప్రకటించింది. అంతేకాదు.. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ట్రైలర్ కూడా రానే వచ్చింది. ఈ ట్రైలర్ ఆద్యంతం భారీ వీఎఫ్ ఎక్స్ యాక్షన్ తో అలరించింది. ఒక భారీ హాలీవుడ్ చిత్రం టైగర్ 3 కి పోటీగా రావడంతో ఒక్కసారిగా ఖంగుతినడం భాయ్ వంతయింది.
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి సినిమా వస్తోంది అంటే ప్రపంచవ్యాప్తంగా అభిమానులు కళ్లు కాయలు కాసేలా వేచి చూస్తారు. ఆ రకంగా ది మార్వల్ కోసం భారతీయ అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తారనడంలో సందేహం లదు. ది మార్వల్ కథ ప్రకారం.. ఘోరమైన దుష్ఠశక్తులను తరిమి కొట్టేందుకు శక్తివంతమైన ముగ్గురు మహిళా సూపర్ గాళ్స్ ఏకమయ్యాక ఏం జరిగింది? అన్నదే సినిమా.
`ది మార్వెల్స్` మూవీలో అత్యంత శక్తివంతమైన ఎవెంజర్స్ లో ఒకరైన కరోల్ డాన్వర్స్ అకా కెప్టెన్ మార్వెల్ తిరిగి శక్తివంతుడిగా బరిలోకి దిగుతాడు. సుప్రీం ఇంటెలిజెన్స్ పై అతడు ప్రతీకారం తీర్చుకునే సమయాన.. ఊహించని పరిణామాలు కరోల్ అస్థిరమైన విశ్వం తాలూకా భారాన్ని మోయడం కనిపిస్తుంది. కరోల్ కి సూపర్ గాళ్ హోదాలో ప్రత్యేకమైన విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. తనతో పాటు కలిసి పోరాటానికి సిద్ధపడే మరో ఇద్దరు అమ్మాయిలతో అంతిమపోరాటం ఎలా సాగిందనేది? పెద్ద తెరపైనే చూడాలి.
ఇక కరోల్ ను క్రీ విప్లవకారుడితో అనుసంధానించబడిన అసాధారణమైన వార్మ్ హోల్ కి పంపినప్పుడు ఏం జరిగిందో చూడాలి. జెర్సీ సిటీ సూపర్-ఫ్యాన్ కమలా ఖాన్ అకా Ms. మార్వెల్ .. S.A.B.E.R వ్యోమగామి కెప్టెన్ మోనికా రాంబ్యూ త్రయం కలిసి `ది మార్వెల్స్`గా విశ్వాన్ని రక్షించడానికి ఎలాంటి ప్రయత్నం చేసారన్నది తెరపై చూడాలి. ఈ చిత్రంలో బ్రీ లార్సన్, టెయోనా ప్యారిస్, ఇమాన్ వెల్లని, శామ్యూల్ ఎల్. జాక్సన్, జావే ఆష్టన్ పార్క్ సియో-జూన్ తదితరులు నటించారు. నియా డకోస్టా దర్శకత్వం వహించగా కెవిన్ ఫీగే నిర్మాత.
మార్వెల్ స్టూడియోస్ `ది మార్వెల్స్` ఈ దీపావళికి ఇంగ్లీష్- హిందీ- తమిళం- తెలుగు భాషలలో భారతీయ థియేటర్లలోకి వస్తుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సల్మాన్ ఖాన్ నటించిన భారీ చిత్రం `టైగర్ 3`తో పోటీపడనుంది. మనీష్ శర్మ దర్శకత్వం వహించిన టైగర్ 3 సోలోగా రిలీజవుతుందని తొలుత భావించినా ఇంతలోనే ఠఫ్ కాంపిటీషన్ ప్రారంభమైంది. టైగర్ 3లో కత్రినా కైఫ్, ఇమ్రాన్ హష్మీ, రణవీర్ షోరే మరియు రేవతి కూడా ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో పఠాన్ గా షారుఖ్ ఖాన్ అతిధి పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే.