ఏపీలో ప్రజల మూడ్ ఎలా ఉంది? వారు ఏం కోరుకుంటున్నారు? అసలు ప్రజల నాడి ఎలా ఉంది? ఇదీ .. ఇప్పుడు రాష్ట్రంలో గ్రామం నుంచి నగరం వరకు, పట్టణం నుంచి పంచాయతీ వరకు జరుగుతున్న చర్చ. మరో 8 మాసాల్లోనే ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ఏమనుకుంటున్నారు? వారి ఆశ ఎలా ఉంది? అనే విషయాలు ఆసక్తిగా చర్చకు వస్తున్నాయి.
ప్రధానంగా పలు సోషల్ మీడియాలు, యూట్యూబ్ చానెళ్లు క్షేత్రస్థాయిలో చేస్తున్న సర్వేల్లో అన్ని వర్గాల ప్రజలు కూడా మనసు విప్పుతున్నారు. తమ అవసరాలు ఏంటో.. తాము ఏం కోరుకుంటున్నారో స్పష్టంగా చెబుతున్నారు. అయితే.. ఇలా స్పష్టంగా చెబుతున్నవారు 40 శాతం మంది మాత్రమే ఉండడం గమనా ర్హం. మరో 40 శాతం మంది ఎన్నికలకు ఇంకా సమయం ఉందిగా! అని దాట వేస్తున్నారు. ఇక, 10 శాతం మంది ఎవరు వచ్చినా.. మా బతుకులు ఇంతే! అని నిరాశావాదానే వినిపిస్తున్నారు.
మరో 10 శాతం ఎప్పటిలాగే.. విక్రమార్కుడి భుజంపై ఉన్న భేతాళుడు తిరిగి చెట్టెక్కినట్టు.. సైలెంట్ సీన్‌లో గడిపేస్తున్నారు. సరే.. ఇక, క్షేత్రస్థాయిలో మూడురకాలుగా ఈ సర్వేలు సాగుతున్నాయి. పైకి సర్వే అని చెప్పకపోయినా.. ప్రజల మూడ్‌ను తెలుసుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి వేల రూపాయల పథకాలు అందుకుంటున్నవారు... బాగానే ఉందని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తమకు మేలు చేస్తున్నవారికి మొగ్గు చూపుతామని అంటున్నారు.
ఇక, యువత, ఉద్యోగులు(కొందరు మాత్రమే), మధ్యతరగతి(30 శాతం), నిరుద్యోగులు, పట్టణ వాసులు మాత్రం రాష్ట్రం అభివృద్ది చెందాలని కోరుకుంటున్నామని చాలా నర్మగర్భంగా చెబుతున్నారు. ఉద్యోగులు అయితే.. తమ జీవితాలు ఇబ్బందుల్లో ఉన్నాయని వాపోతున్నారు. ఏ పార్టీ కూడా.. ఏ ప్రభుత్వం కూడా సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పలేక పోతున్నాయని అంటున్నారు. ఇక, పట్టణవాసి నాడి మరో విధంగా ఉంది. పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు తగ్గించేవారు కావాలని, రావాలని కోరుతున్నారు.
ఇక, ఎటొచ్చీ.. అన్ని పార్టీలకు కీలకమైన మహిళా ఓటు బ్యాంకును పరిశీలిస్తే.. వారి పరిస్థితి అటు ఇటుగా ఉంది. ఉచిత బస్సు ప్రయాణాలు కోరుకునేవారు.. ప్రతి పిల్లాడికీ/ పిల్లకీ.. డబ్బులు కోరుకునేవారు, ఉచిత గ్యాస్ సిలెండర్లు కోరుకునేవారు కనిపిస్తున్నారు. గ్రామీణ స్థాయిలో ఇంటికి వచ్చి ఇస్తే చాలనే వారే ఎక్కువగా కనిపిస్తున్నాయి. యువత ఉపాధి, పరిశ్రమలు, ఉద్యోగాలు కోరుతున్నారు.
ఇలా మొత్తంగా ఏపీ నాడి ఒక మిశ్రమ వాతావరణంలో కనిపిస్తోంది. ఎన్నికలకు ఇంకా 8 నెలల సమయం ఉండడం, పార్టీలు వ్యూహాలను పరిపూర్ణంగా ప్రకటించకపోవడంతో ప్రజలు కూడా ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలోనే ఉన్నారని అన్ని రకాల సర్వేలు స్పష్టం చేస్తుండడం గమనార్హం.