పవన్ ఏ పార్టీ తో పొత్తు పెట్టుకోవాలో చెప్పిన జోగయ్య
బీజేపీ ఏపీలో పవన్ కి ఉన్న గ్లామర్ ని ఆయన పార్టీకి పెరిగిన గ్రాఫ్ ని తనకు అనుకూలంగా వాడుకోవాలని చూస్తోంది అని జోగయ్య అంటున్నారు.
మాజీ మంత్రి చేగొండి హరి రామజోగయ్య ఏపీలోనే సీనియర్ మోస్ట్ లీడర్. హోం మంత్రిగా ఎంపీగా పనిచేసిన జోగయ్య ఇపుడు కాపుసేనకు గౌరవ అధ్యక్షుడిగా ఉంటున్నారు. ఆయన తాజాగా ఏపీలో రాజకీయం పవన్ ఢిల్లీ టూర్, ఎన్డీయే మీటింగులో పాల్గొనడం వంటి వాటి మీద తనదైన శైలిలో రాజకీయ విశ్లేషణ చేస్తూ ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు.
ఏపీలో పవన్ కళ్యాణ్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలో కూడా జోగయ్య చెప్పేశారు. బీజేపీ ఏపీలో పవన్ కి ఉన్న గ్లామర్ ని ఆయన పార్టీకి పెరిగిన గ్రాఫ్ ని తనకు అనుకూలంగా వాడుకోవాలని చూస్తోంది అని జోగయ్య అంటున్నారు. ఏపీలో బీజేపీ జనసేన పొత్తులకు వెళ్తే కేవలం రెండు శాతం మాత్రమే గత ఎన్నికల కంటే అధికంగా జనసేనకు ఓట్ల శాతం పెరగవచ్చు అని అంటున్నారు.
దానికి కారణం బీజేపీ పట్ల ఏపీ జనాలలో సానుకూలత లేకపోవడం అదే టైం లో జగన్ సర్కార్ మీద బీజేపీ అనుకున్న స్థాయిలో పోరాడడం లేదని అంటున్నారు. జగన్ తో ఈ రోజుకీ బీజేపీకి సత్సంబంధాలు ఉన్నాయని అంటున్నారు.
అందువల్ల ఈ పొత్తు వల్ల ఏపీలో వైసీపీని ఓడించలేరని ఆయన అభిప్రాయపడుతున్నారు. అదే టీడీపీతో జనసేన పొత్తు వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అదేలా అంటే చంద్రబాబుకు మంచి పాలనా దక్షుడిగా పేరుందని, అదే విధంగా టీడీపీతో పొత్తు వల్ల జనసేనకు బాగా కలసి వస్తుందని అంటున్నారు.
ఇక జనసేనతో పొత్తు పెట్టుకుని ఏపీలో రాజకీయంగా లాభపడాలని బీజేపీ చూస్తోంది అని జోగయ్య అంటున్నారు. ఇక బీజేపీవి మత రాజకీయాలు అని వాటి వల్ల జనసేనకు రాజకీయంగా నష్టం వాటిల్లుతుందని ఆయన అంటున్నారు.
దీనిని బట్టి చూస్తే హరిరామ జోగయ్య చెప్పేది ఏంటి అంటే టీడీపీతోనే పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని ముందుకు సాగాలని, అదే విధంగా ఈ రెండు పార్టీలు కూటమిగా ముందుకు వస్తేనే ఏపీలో రాజకీయం మారుతుందని, వైసీపీ గద్దె దిగుతుందని అంటున్నారు.
మరి పవన్ కళ్యాణ్ ఆలోచనలు చూస్తే ఏపీలో 2014 నాటి పొత్తు అంటున్నారు. బీజేపీ జనసేన టీడీపీ కలవాలని ఆయన నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అంటే బీజేపీ పట్ల ఈ రోజుకీ పవన్ కి అభిమానం ఉందని అర్ధం అవుతోంది.
అదే టైం లో మోడీ పట్ల ఆరాధనా భావం కూడా ఉంది. మరి హరి రామ జోగయ్య చేస్తున్న ఈ రాజకీయ విశ్లేషణను పవన్ గమనిస్తారా ఏపీలో బీజేపీని దూరం పెట్టి టీడీపీలో నడుస్తారా అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా జోగయ్య అభిప్రాయం అంటే అది ఆయన ఒక్కడిదేనా లేక కాపుల మనోభావాలు కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయా అన్నది కూడా చూడాల్సి ఉంది అంటున్నారు.