పురందేశ్వరిది.. హెడ్ మాస్టర్ ఉద్యోగమేనా..?
రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన ఎన్టీఆర్ కుమార్తె
రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి గురించి ఆ పార్టీలోనే అంత ర్గత చర్చ జరుగుతోంది. ''ఆమె హెడ్ మాస్టర్ డ్యూటీ చేస్తున్నారు'' అని కొందరు నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం పార్టీలో మార్పు కావాలని కోరుకునేవారు.. తమ గళం వినిపించాలని ఆశిస్తున్నవారు.. చాలా మంది ఉన్నారు. అదేసమయంలో వచ్చే ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచి రూట్ మ్యాప్ ను రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసుకుని ముందుకు సాగాలని భావిస్తున్నవారు కూడా ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే పార్టీలో నూతన అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టి దగ్గుబాటి పురందేశ్వరిపై ఎక్కువ మంది ఆశలు పెట్టుకున్నారు. అయితే.. ఆమెను ఏ విషయం అడిగినా.. అంతా పైవాళ్లు చూసుకుంటారు! అనే సమాధానమే వస్తోంది. పార్టీలో పదవుల విషయాన్ని ప్రస్తావించినా.. పార్టీలో నియోజకవర్గాలకు నా యకుల ఎంపిక విషయాన్ని ప్రస్తావించినా.. వీటికి భిన్నంగా కీలకమైన పొత్తుల విషయాన్ని ప్రస్తావించి నా.. పురందేశ్వరి.. అంతా అధిష్టానం చూసుకుంటుంది! అనే మాటే చెబుతున్నారు.
దీంతో మరి పురందేశ్వరి ఏం చేస్తారు? ఆమె పని ఏంటి? అనేది చర్చకు వస్తోంది. అంతేకాదు, పురందేశ్వ రి కేవలం హెడ్ మాస్టర్ ఉద్యోగానికి పరిమితం అయ్యారా? అనే టాక్ కూడా వినిపిస్తుండడం గమనార్హం. సాధారణంగా స్కూళ్లలో ఏ సమస్య వచ్చినా.. టీచర్లు, విద్యార్థులు కూడా హెడ్ మాస్టర్‌కే చెబుతారు.
కానీ, ఆయనకు ఎలాంటి అధికారాలు ఉండవు. విని.. పై అధికారులకు(డీఈవో) చెబుతానని అంటారు. తర్వాత.. వాటిని మరిచిపోతారు. ఇప్పుడు పురందేశ్వరి కూడా ఇలానే చేస్తున్నారా? అని బీజేపీ నాయకులు తల్లడిల్లుతున్నారు.
''గతంలో ఉన్నవాళ్లు మా మాట వినిపించుకోలేదు. ఇప్పుడైనా మార్పు వస్తుందని ఆశిస్తుసన్నాం. వచ్చే ఎన్నికల్లో పొత్తులపై తేల్చాలని కోరుతున్నాం. అప్పటికప్పుడు అభ్యర్థులను ప్రకటించినా.. ప్రయోజనం లేదు. ఈ విషయాన్ని కూడా చెబుతున్నాం. అయినా.. గతంలో జరిగినట్టే ఇప్పుడు కూడా జరుగుతోంది. చూస్తాం.. చేస్తాం.. పైవారికి చెబుతాం.. అనే అంటున్నారు. ఏం చేస్తారో .. ఏం చూస్తారో.'' అని సీమకు చెందిన నాయకులు వ్యాఖ్యలు చేస్తుండడం గమనార్హం.