ఏపీలో ఎన్డీయే సర్కార్ అంటున్న పవన్..టీడీపీ మాటేంటి..?

ఏపీలో 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల తరువాత ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటున్నారు.

Update: 2023-07-20 17:13 GMT

ఏపీలో 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల తరువాత ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఎన్డీయే కూటమి మీటింగ్ కి వెళ్ళి వచ్చిన తరువాత పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల మీటింగులో మాట్లాడుతూ ఈ తరహా సంచలన కామెంట్స్ చేశారు.

ఏపీలో ఎన్డీయే సర్కార్ కచ్చితంగా వస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు. ఆ ప్రభుత్వంలో జనసేన కీలక పాత్ర పోషిస్తుంది అని అన్నారు. ఇక ముఖ్యమంత్రి పదవి విషయంలో కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలంతా అఖండ మెజారిటీ ఇస్తే ముఖ్యమంత్రి అవుతాను అని ఆయన అంటున్నారు.

అయినా ఎన్నికల ముందు ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరు అన్నది ప్రధానం కాదని, ఎన్నికల్లో ఎవరి సత్తా ఏమిటో నిరూపించుకుని ఆ మీదట బలాబలాల ఆధారంగా ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలన్నది నిర్ణయం తీసుకుంటామని అంటున్నరు. మరి ఎన్డీయే సర్కార్ అంటున్నారు. పొత్తులు అంటున్నారు. ఎక్కడా టీడీపీ ప్రస్తావన తేవడంలేదు.

ఒకవేళ ఎన్డీయేలో బీజేపీ జనసేన ఉన్నట్లు అయితే ఉమ్మడి సీఎం అభ్యర్ధి ప్రకటించడానికి ఇబ్బంది ఉండదు కదా అన్నది ఒక ప్రశ్న. మరి ఈ కూటమిలో టీడీపీ కూడా ఉంటుందా అన్నది మరో ప్రశ్న. ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరో ముందే చెప్పమని ఎన్నికల తరువాత అని పవన్ అన్న మాటలనే తీసుకుంటే కనుక ఒక వేళ ఎన్డీయే కూటమిలో టీడీపీ చేరినా చంద్రబాబు సీఎం అని ఇప్పటికే డిసైడ్ అయిన టీడీపీకి ఇది ట్రబుల్ ఇచ్చేదిగానే చూడాల్సి ఉంది.

ఇక పవన్ తన స్పీచ్ లో ఎక్కడా కూడా వైసీపీ వ్యతిరేక ఓట్ల చీలిక ఉండబోదు అని అనడంలేదు. ఆయన వారాహి యాత్ర నుంచే ఆ ప్రకటనను ఎందుకో ఇవ్వడం లేదు అన్నది ఇక్కడ గమనార్హం. అంటే టీడీపీతో కాకుండా జనసేన బీజేపీ కలసి పోటీ చేస్తాయా అన్నది కూడా చూడాల్సి ఉంది.

ఏది ఏమైనా పవన్ ఎక్కడా కూడా టీడీపీ ప్రస్తావన తీసుకుని రాకపోవడమే కాదు బీజేపీ గురించి ఎక్కువగా చెబుతున్నారు. బహుశా ఆయన బీజేపీతో కలసి కూటమిగా ముందుకు వెళ్తారన్న అనుమానంతోనే సీనియర్ నేత, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య బీజేపీతో పొత్తు పెట్టుకుంటే పెద్దగా ప్రయోజనం లేదు అని లేఖ రాసారు అని అంటున్నారు.

మరో వైపు చూస్తే బీజేపీ పెద్దలతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని మోడీతో తన బంధం రాజకీయాలకు అతీతమైనది అని పవన్ చెప్పారు. అలాగే అమిత్ షా వంటి పెద్దలతో తాను ఏపీ బాగు కోసమే చర్చిస్తాను అని ఆయన అంటున్నారు. ఇవన్నీ చూస్తూంటే కనుక ఏపీలో బీజేపీ జనసేన కలసి పోటీ చేయడం ఖాయమని తేలుతోంది.

మరి ఎన్డీయే కూటమిలోకి టీడీపీ రావడం అన్నది ముందు ముందు చోటు చేసుకునే పరిణామాల మీద ఆధారపడి ఉంటుందని అంటున్నారు. అంటే ఇపుడు బంతి టీడీపీ కోర్టులోకి నెట్టబడింది అన్న మాట. పవన్ సేఫ్ జోన్ లో ఉన్నారని అంటున్నారు. అలాగే బీజేపీ పవన్ని తమ వైపునకు తిప్పుకోవడంలో సక్సెస్ అయింది అని అంటున్నారు. దాంతో ఏపీలో వచ్చేది టీడీపీ ప్రభుత్వం కాదు ఎన్డీయే ప్రభుత్వం అన్న పవన్ చెప్పిన మాటతో కూటమిలో టీడీపీ చేరితే కనుక అధికారంలో కచ్చితంగా వాటా ఇచ్చి తీరాల్సిందే అన్న సంకేతం సందేశం ఇమిడి ఉన్నాయని అంటున్నారు.

Tags:    

Similar News