ఉత్తరాంధ్రా జనసేన టార్గెట్...రంగంలోకి పవన్

ఉత్తరాంధ్రా జిల్లాలు కూడా జనసేనకు కలసివచ్చేవిగానే ఆ పార్టీ అంచనా కడుతోంది.

Update: 2023-07-22 03:44 GMT

జనసేన ఉమ్మడి గోదావరి జిల్లాలలో తన హవాను చాటుకునేలా వారాహి యాత్రను రెండు దశలుగా నిర్వహించింది. జన స్పందన బాగానే ఉంది అన్న భావన వచ్చింది. యాత్ర పూర్తి అయింది. ఇపుడు పవన్ వారాహి రధం ఏ వైపు తిరగనుంది అన్నదే చర్చగా ముందుకు వస్తోంది. ఆయన రాయలసీమ వైపు వెళ్తారా లేక కోస్తా జిల్లాల వైపు వస్తారా అన్నది కూడా జనసేనలో తర్జన భర్జనగా ఉంది.

అయితే పవన్ చూపు ఉత్తరాంధ్రా మీద ఉందని అంటున్నారు. ఉత్తరాంధ్రా జిల్లాలు కూడా జనసేనకు కలసివచ్చేవిగానే ఆ పార్టీ అంచనా కడుతోంది. ఇక్కడ బీసీలుగా ఉన్న వారిలో అత్యధికులు తూర్పు కాపులు ఉన్నారు. వీరంతా కూడా తమ వైపు మొగ్గు చూపుతారని జనసేన భావిస్తోంది.

విశాఖ రూరల్ నుంచి మొదలుపెడితే విజయనగరం శ్రీకాకుళం జిల్లాలలో తూర్పు కాపులు నిండుగా ఉన్నారు విశాఖ అర్బన్ పరిధిలో మాత్రం కాపులు ఓసీలుగా ఉన్నారు. ఇక విశాఖ అయితే జనసేన 2019లో బాగానే పెర్ఫార్మెన్స్ చేసింది. ఓట్ల పరంగా చాలా నియోజకవర్గాలలో మంచిగానే తన పట్టు నిరూపించుకుంది.

విశాఖ ఎంపీ సీటులో జనసేనకు రెండు లక్షల ఎనభై వేల దాకా ఓట్లు వచ్చాయి. అలాగే పవన్ పోటీ చేసిన గాజువాకలో 56 వేల పై చిలుకు ఓట్లు వస్తే తరువాత స్థానంలో భీమిలీ ఉంది. ఇక్కడ పాతిక వేల పైన ఓట్లు దక్కాయి. విశాఖ ఉత్తరంలో ఇరవై వేలు, పెందుర్తిలో కూడా ఇరవై వేల పై దాకా వచ్చాయి. రూరల్ లో చూసుకుంటే యలమంచిలిలో ఇరవై వేల దాకా వచ్చాయి.

దీంతో జనసేన ఈ సీట్లను వచ్చే ఎన్నికల్లో తీసుకోవాలని చూస్తోంది. అదే టైం లో ఉత్తరాంధ్రాలో ఉన్న విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో కూడా పట్టు సాధించాలని పధక రచన చేస్తోంది. విశాఖ ఉత్తరం, గాజువాక, పెందుర్తి, భీమిలీ, అనకాపల్లి, చోడవరం, ఎలమంచిలిలలో కాపులే విజయ నిర్ణేతలు. అత్యధిక శాతం వారే ఉన్నారు.

ఇక విజయనగరం జిల్లాలో చూస్తే విజయనగరం, గజపతినగరం, నెల్లిమర్ల, ఎస్ కోట, చీపురుపల్లిలలో తూర్పు కాపులు పెద్ద ఎత్తున ఉన్నారు. దాంతో ఇక్కడ పాగా వేయాలని జనసేన భావిస్తోంది. అదే విధంగా శ్రీకాకుళం జిల్లాలో చూస్తే పాతపట్నం తూర్పు కాపులకు పెట్టింది పేరుగా ఉంది.

అలాగే ఎచ్చెర్ల మరో కీలకమైన సీటుగా ఉంది. కాపులకు ఇది విజయ ద్వారంగా చెప్పుకుంటారు. శ్రీకాకుళం నియోజకవర్గం కూడా కాపులకు అండగా ఉండే సీటు, ఇక రాజాంలో కూడా తూర్పు కాపులు నిర్ణయాత్మకమైన శక్తిగా ఉన్నారు. పలాసలో సైతం వారిదే హవాగా ఉంది. దాంతో ఈ సీట్ల మీద జనసేన టార్గెట్ చేసింది అంటున్నారు.

ఇటీవల జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుకి పవన్ కళ్యాణ్ కీలకమైన బాధ్యతలు అప్పగించారు. ఉత్తరాంధ్రా జిల్లాలలో జనసేనను బలోపేతం చేసే దిశగా కార్యక్రమాలు చేపట్టాలని ఆయన సూచించారు. అందుకోసం మీకు ఉన్న బలమైన స్నేహితుల సహకారం తీసుకోవాలని కూడా పవన్ కోరడం విశేషం.

బలమైన స్నేహితులు అంటే పూర్వం ప్రజారాజ్యంలో పనిచేసి ఇపుడు వేరే పార్టీలలో ఉన్న వారిని వెనక్కి పిలిపించడం, అలాగే కాపులతో పాటు వివిధ వర్గాల నుంచి ఆసక్తి ఉన్న వారిని అంగబలం, అర్ధబలం దండీగా ఉన్న వారిని కూడా పార్టీలోకి తీసుకోవాలని జనసేన ఆలోచిస్తోంది. ఇపుడు ఆ బాధ్యతలను పంచకర్ల చూస్తారు అని అంటున్నారు మొత్తం మీద ఉత్తరాంధ్రాలో 34 ఎమ్మెల్యే స్థానాలు ఉంటే సగానికి సగం అంటే 15 సీట్లలో పాగా వేయడానికి జనసేన స్కెచ్ గీస్తోంది. అలాగే విజయనగరం, విశాఖ, అనకాపల్లి ఎంపీ సీట్ల మీద ఆ పార్టీ కన్ను ఉంది అంటున్నారు. మరి పొత్తులతో ఇవన్నీ సాధ్యమవుతాయా లేదా అన్నది చూడాలని అంటున్నారు.

Tags:    

Similar News