లోకేష్ చేతిలో రెడ్ బుక్... చాలా స్టోరీ ఉంది!
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రకాశం జిల్లాలో కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. 165వ రోజు సంతనూతలపాడు నియోజకవర్గంలో ఈ పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా లోకేష్ తన చేతిలో ఉన్న ఒక ఎరుపు రంగు అట్ట కలిగిన పుస్తకం ఆవశ్యకతను వివరించారు!
అవును... ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడు నియోజకవర్గంలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేస్తున్నారు. తన ప్రయాణ సమయంలో.. లోకేష్ ఎరుపు కవర్ తో కూడిన పుస్తకాన్ని తీసుకువెళుతుండటం అభిమానుల్లో ఉత్సుకతను రేకెత్తించింది.
లోకేష్ చేతిలో ఉన్న ఆ ఎరుపు పుస్తకం ఏమిటి.. ఎందుకు దానికి అంత ప్రాధాన్యత ఇచ్చి మరీ పట్టుకు తిరుగుతున్నారు.. బహుశా స్పీచ్ లు రాసి ఉన్నాయా వంటి అనుమానాలు మరికొంతమంది వ్యక్తపరిచారు. అయితే తాజాగా, ఎర్ర పుస్తకంలోని విషయాలు, ఉద్దేశ్యాన్ని లోకేష్ కీలక విషయాలు వెల్లడించారు.
అవును... తన చేతిలో ఉండే ఎరుపు రంగు అట్ట ఉన్న పుస్తకం ప్రాధాన్యతను, ప్రత్యేకతను లోకేష్ వివరించారు. ఇందులో భాగంగా... తన పాదయాత్రను అడ్డుకోవడం ద్వారా జగన్ పై అభిమానం నిరూపించుకోవాలని కొందరు అధికారులు విపరీతంగా ఆరాటపడుతున్నారని లోకేష్ అన్నారు.
ఈ అధికారులు నిబంధనలను ఉల్లంఘించి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారని.. దీంతో టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారని లోకేష్ ఆరోపించారు. ఈ అధికారులను జవాబుదారీగా ఉంచేందుకు, బాధ్యుల పేర్లను రెడ్ బుక్ లో నమోదు చేస్తున్నట్లు లోకేష్ వెల్లడించారు. దీంతో ఈ విషయం మరింత హాట్ టాపిక్ గా మారింది.
రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే.. వైసీపీ ప్రయోజనాలకు అనుకూలంగా వ్యవహరించిన అధికారులపై సమగ్ర విచారణ చేపడతామని లోకేష్ స్పష్టం చేశారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని, బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో లోకేష్ రెడ్ బుక్ ను ప్రజలకు, మీడియాకు చూపించారు.
ఇదే సమయంలో లోకేష్ చేతిలో ఉన్న ఎరుపు రంగు అట్ట పుస్తకంపై స్పందించిన వైసీపీ నేతలు అవహేళన చేస్తున్నారు. ఈ పుస్తకంలో ఇప్పటి వరకు ఎన్ని పేర్లు రాశారు.. ఈ అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని అడుగుతున్నారు.
ఇదే సమయంలో అసలు భవిష్యత్తులో టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందా అని వైసీపీ నేతలు లోకేష్ ను ప్రశ్నిస్తూ... ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ పుస్తకమే మిగులుతుందని ఎద్దేవా చేస్తున్నారు!