టీడీపీలో మారని తమ్ముళ్లు.. సేమ్ సీన్ రిపీట్.. మళ్లీ వైసీపీదే గెలుపు!
చంద్రబాబుకు ఏం చేయాలో తెలియక తర్వాత చూద్దాం అని వాయిదా వేసుకున్నారు
రాజకీయాల్లో అయినా.. వ్యక్తిగతంగా అయినా.. అనుభవం అత్యంత కీలకం. గత అనుభవం నుంచి పాఠాలు నేర్చుకోకపోతే.. జీవితాంతం ఇబ్బందులు తప్పవని అంటారు అనుభవజ్ఞులు. ఇప్పుడు టీడీపీ పరిస్థితి కూడా ఇలానే ఉందని అంటున్నారు పరిశీలకులు. గత 2019 ఎన్నికల్లో టీడీపీ నేతలకు గెలిచే అవకాశం ఉన్నా.. ఇబ్బడి ముబ్బడిగా సింపతీ వచ్చినా.. అంతర్గత కుమ్ములాటలు.. ఆధిపత్య రాజకీయంతో అత్యంత కీలకమైన అరకు అసెంబ్లీ నియోజకవర్గాన్ని పార్టీ వదులుకుంది.
2014 ఎన్నికల్లో అరకు నుంచి ఎస్టీ నాయకుడు.. కిడారి సర్వేశ్వరరావు వైసీపీ తరఫున విజయం దక్కించుకు న్నారు. తర్వాత ఆయన టీడీపీకి జై కొట్టారు. అయితే.. మావోయిస్టులు ఆయనను దారుణంగా హత్య చేశారు. ఈ క్రమంలో ఆయన కుమారుడు కిడారి శ్రావణ్ కుమార్‌ను చంద్రబాబు చేరదీశారు. మంత్రిని చేశారు. 2019 ఎన్నికల్లో ఆయనకు టికెట్ కూడా ఇచ్చారు. అయితే.. ఆయన గత ఎన్నికల్లో ఘోర ఓటమిని చవి చూశారు. కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేక పోయారు.
దీనికి కారణం.. టీడీపీలోని రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు. నిజానికి కిడారిని మావోయిస్టులు దారుణం గా హత్య చేసిన నేపథ్యంలో ఆ కుటుంబానికి గిరిజనుల నుంచి ఇబ్బడిముబ్బడిగా సింపతీ వచ్చింది. దీంతో కిడారి శ్రావణ్ గెలుపు నల్లేరుపై నడకే అనుకున్నారు. అయితే.. అనూహ్యంగా టీడీపీకే చెందిన మరో గిరిజన జాతినాయకుడు సియ్యారి దొన్నుదొర కూడా టికెట్ కావాలని పట్టుబట్టారు. అంతేకాదు.. స్థానికంగా ధర్నాలు, రాస్తారోకోలు కూడా చేశారు.
అయితే.. చంద్రబాబు ఆయనను పట్టించుకోలేదు. దీంతో దొన్నుదొర.. ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. ఫలితంగా.. ఇక్కడ ఓట్లు చీలిపోయి.. సింపతీ తగ్గిపోయి.. వైసీపీ విజయం దక్కించుకుంది. కట్ చేస్తే.. గత ఎన్నికల్లో ఏం జరిగిందోఈ నియోజకవర్గం ఎలా దూరమైందో తెలిసినా.. టీడీపీ నేతలకు ఎక్కడా చీమకుట్టినట్టుగా లేదు. ఈసారి కూడా.. సేమ్ టు సేమ్ వివాదాల్లోనే మునిగిపోయారు. మాకే కావాలంటే.. మాకే కావాలంటూ కిడారి-సియ్యారి వర్గాలు టికెట్ కోసం కుస్తీ పడుతున్నాయి.
దీంతో చంద్రబాబుకు ఏం చేయాలో తెలియక.. తర్వాత చూద్దాం.. అని వాయిదా వేసుకున్నారు. ఇక, ఆ నేతలు.. ఇంటికే పరిమితమై.. ఒకరిపై ఒకరు ఆధిపత్య రాజకీయ బాణాలు విసురుకుంటున్నారు. దీంతో ఈ సారి కూడా వైసీపీ గెలుపు ఖాయమని ఆ పార్టీ నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు.