రాజకీయాల్లోకి రంగా వారసురాలు... బెజవాడ నుంచి బరిలోకి?
ఎన్నికలకు ఇంకా ఎనిమిది నెలల సమయం
ఎన్నికలకు ఇంకా ఎనిమిది నెలల సమయం ఉందని కథనాలొస్తున్న సమయంలో... ఇప్పటినుంచే రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఏపీలో వాతావరణం వర్షాలతో చల్లబడినా.. రాజకీయ వాతావరణం మాత్రం రోహిణీ కార్తి వేడిని మించి సెగలు కక్కుతుంది. పార్టీలో ఉక్కబోత కలిగిస్తుంది. ఇందులో భాగంగా తాజాగా వంగవీటి రంగా కుటుంబానికి సంబంధించిన ఒక వార్త తెరపైకి వచ్చింది!
అవును.. ఏపీలో ఎన్నికలు సమీపిస్తోన్న వేళ రాజకీయ పరిణామాలు తీవ్రంగా మారుతున్నాయని తెలుస్తుంది. ఇందులో భాగంగా దివంగత వంగవీటి రంగా కుమార్తె వంగవీటి ఆశాలత రాజకీయాల్లోకి రాబోతున్నారనే చర్చ తెరపైకి వచ్చింది. గతకొన్ని రోజులుగా విజయవాడ కేంద్రంగా ఈ చర్చ తీవ్రంగా మారిందని తెలుస్తుంది.
ఇందులో భాగంగా... వంగవీటి రంగా కుమార్తె వంగవీటి ఆశాలత రాజకీయాల్లోకి రాబోతున్నారని, ఆమె బెజవాడ సెంట్రల్ లేదా బెజవాడ ఈస్ట్ నుంచి ఎన్నికల బరిలోకి దిగే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. వంగవీటి వారసురాలిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతోందని అంటున్నారు.
ఈ చర్చ తెరమీదికి రావడానికి బలమైన కారణం ఉందని అంటున్నారు. రంగా రాజకీయ వారసత్వాన్ని బలంగా జనంలోకి తీసుకుపోవడానికి ఆయన కుమార్తె ఆశాలతను ఎన్నికల బరిలోకి దించాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా... 2024 ఎన్నికల్లో ఆమె రంగప్రవేశం ఖాయం అని అంటున్నారు.
ఈ మేరకు రంగా కుటుంబానికి రాజకీయంగా గట్టి పట్టు ఉన్న విజయవాడ సెంట్రల్ నుండి ఆమెని బరిలోకి దింపేందుకు ఆమె మేనమామ భారీ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కచ్చితంగా ఈమెను రంగా రాజకీయ వారసురాలిగా ఫుల్ ఫోకస్ లోకి తేవాలని ఆయన తపన పడుతున్నారని అంటున్నారు.
ఈ చర్చ తెరపైకి రావడంతో... ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గాన్ని ఆకట్టుకునే విషయంలో.. రంగా వారసత్వం పార్టీకి ఉపయోగపడుతుందని పలు పార్టీలు ఆలోచిస్తున్నాయంట. దీంతో వంగవీటి ఆశాలతను పార్టీలోకి స్వాగతించడానికి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారని అంటున్నారు!
అయితే ఈ విషయాలకు సంబంధించి.. రంగా వారసురాలి రాజకీయ రంగ ప్రవేశం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఆమెకు నిజంగానే రాజకీయాలపై ఆసక్తి ఉందా.. ఉంటే ఏ పార్టీవైపు ఆమె మొగ్గుచూపే ఛాన్స్ ఉంది.. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది.. అనే అంశాలకు సంబంధించి కూడా మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా... ఈ చర్చ బెజవాడ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిందనేది మాత్రం వాస్తవం అనేది పలువురి అభిప్రాయంగా ఉంది.
కాగా... వంగవీటి రంగా హత్య తర్వాత ఆయన భార్య రత్నకుమారి ఎమ్మెల్యేగా పనిచేసిన సంగతి తెలిసిందే. 1989, 1994 లో ఆమె విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత వంగవీటి రంగా కుమారుడు.. వంగవీటి రాధా 2004 లో కాంగ్రెస్ పార్టీ నుంచే అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
అయితే రాజకీయాలలో రత్నకుమారి కానీ, రంగా కుమారుడు రాధా కానీ తమదైన ముద్ర వేసినప్పటికీ... వంగవీటి అభిమానులు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారని అంటుంటారు! దీంతో ఈసారి రంగా కూతురిని రంగంలోకి దింపి రాజకీయాల్లోకి తీసుకురావాలని.. రంగా ఆశయాల సాధనలో ఆమె కీలక భూమిక పోషించాలని ఆయన మేనమామ భావిస్తున్నారని అంటున్నారు.