వివేకా కేసు పునఃసమీక్షించాలి.. సీబీఐకి అవినాష్ లేఖ

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు

Update: 2023-07-24 04:17 GMT

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ గత నాలుగేళ్ళుగా జరిపిన విచారణ పూర్తిగా వేరే కోణంలో సాగిందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపించారు. అందువల్ల సీబీఐ విచారణను పునఃసమీక్షించాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆయన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ కి వినతి చేస్తూ లేఖ రాయడం సంచలనం రేపుతోంది. సీబీఐ ఈ కేసులో చార్జిషీట్లు దాఖలు చేస్తూ కోర్టుకు అన్నీ సమర్పించింది.

అందులో చాలా విషయాలను సీబీఐ పేర్కొంది. అయితే సీబీఐ కోర్టుకు దాఖలు చేసిన రెండు చార్జి షీట్లను అధారంగా చేసుకుని అవినాష్ రెడ్డి ఈ లేఖ రాశారు. సీబీఐ మొదటి నుంచి ఒక కోణం నుంచే ఈ కేసుని విచారణ చేసింది అన్నది అవినాష్ రెడ్డి ప్రధాన అభియోగం అంతే కాదు సీబీఐ అధికారి రాం సింగ్ ఉన్నపుడు ఆయన పూర్తిగా పక్షపాతంతో ఈ కేసుని విచారించారని అవినాష్ రెడ్డి ఆరోపించడం విశేషం.

అసలు రాం సింగ్ విచారణను సరిగ్గా జరపలేదని కడప ఎంపీ చెప్పడం కూడా గమనార్హం.ఈ కేసులో అనేక కీలక అంశాలు ఉన్నాయని ఎన్నో కోణాలు ఉన్నాయని వాటిని పూర్తిగా పక్కన పెట్టి రాం సింగ్ కేవలం ఇద్దరి స్టేట్మెంట్స్ ఆధారంగానే విచరణ చేశారని పేర్కొన్నారు. ఇక హత్య చేసిన దస్తగిరిని అప్రూవర్ గా మార్చేసి ఆయన నుంచి తీసుకున్న స్టేట్మెంట్ తోనే సాక్ష్యాలను సేకరించారని కూడా కడప ఎంపీ ఆ లేఖలో వివరించారు.

ఇక ఈ కేసులో ఎన్నో అనుమానాలు ఉన్నాయని అవినాష్ రెడ్డి చెప్పుకొచ్చారు. అందుకోసం ఈ కేసుని తిరిగి సమీక్ష చేయాలని ఆయన సీబీఐ డైరెక్టర్ కి విజ్ఞప్తి చేశారు. ఇక సీబీఐ దాఖలు చేసిన రెండవ చార్జిషీట్ ని ఆధారం చేసుకుని వివేకా రెండవ వివాహం, బెంగళూరు ల్యాండ్ సెటిల్మెంట్ అంశాలను అవినాష్ రెడ్డి ప్రస్థావించారు.

ఇక రాం సింగ్ వ్యవహార శైలి గురించి అవినాష్ రెడ్డి తన లేఖలో అనేక అంశాలను సీబీఐ డైరెక్టర్ దృష్టికి తెచ్చారు. విచారణ అధికారిగా బాధ్యతలు తీసుకోకముందే నిబంధనలకు వ్యతిరేకంగా రాం సింగ్ విచారణ చేశారని ఆరోపించారు. తనతో పాటు తన తండ్రి భాస్కరరెడ్డిని, అలాగే శివ శంకర్ రెడ్డిని ఇరికించందుకు కూడా సాక్ష్యులను రాం సింగ్ బెదిరించారని పేర్కొన్నారు.

ఇలా సీబీఐ అధికారి రాం సింగ్ వేధింపులను భరించలేక పీఏ క్రిష్ణా రెడ్డి, కడప ఎస్పీ ఇద్దరూ పులి వెందుల కోర్టులో ఫిర్యాదు చేశారని ఆ లేఖలో వివరించారు. అంతే కాకుండా పలువురి సాక్ష్యాల స్టేట్మెంట్స్ ని కూడా రాం సింగ్ మార్చేసారు అని అవినాష్ రెడ్డి చెప్పడం విశేషం. ఇక దస్తగిరి హత్య చేశానని చెప్పినా ఆయన్ని అరెస్ట్ చేయకుండా ఆలస్యం చేసారని అన్నారు. ఇక డాక్టర్ అభిషేక్ రెడ్డి వివేకాహత్య కేసులో తాను ఇచ్చిన వాంగ్మూలాన్ని మార్చేసారు అని మీడియా ముందే చెప్పారని గుర్తు చేశారు.

ఇక వివేకా హత్య కేసులో కీలకమైన రెండవ వివాహం అంశాన్ని సీబీఐ కావాలనే పక్కన పెట్టిందని అవినాష్ రెడ్డి ఆరోపించడం విశేషం. రెండవ భార్య పేరు మీద ఉన్న ఆస్తి పత్రాలను ఎత్తుకెళ్ళడానికే ఈ హత్య జరిగి ఉండవచ్చు అన్న కోణంలో విచారణ జరగలేదు అని అవినాష్ అంటున్నారు. అందువల్ల ఈ కేసును పున సమీక్ష చేసి రాం సింగ్ చేసిన తప్పులను సవరించాలని అసలు నిందితులను పట్టుకుని న్యాయం చేయాలని సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ కి అవినాష్ రెడ్డి వినతి చేశారు.

Tags:    

Similar News