110 సీట్లలో బలంగా ఉందా ?
రెండు రోజుల ఐప్యాక్ టీముతో జరిపిన సమీక్షలో వైసీపీ
రెండు రోజుల ఐప్యాక్ టీముతో జరిపిన సమీక్షలో వైసీపీ 110 నియోజకవర్గాల్లో బలంగా ఉందని తేలింది. రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపు విషయమై జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ఐప్యాక్ బృందంతో సమీక్షించారు. వైసీపీ తరపున ఐప్యాక్ బృందం మొత్తం 175 నియోజకవర్గాల్లో పార్టీ పరిస్ధితిపై ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తున్నది. ఆ రిపోర్టులను జగన్ రెగ్యులర్ గా సమీక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు సర్వే నివేదికల ఆధారంగా పార్టీ బలోపేతానికి జగన్ చర్యలు తీసుకుంటున్నారు.
తాజాగా జరిగిన రివ్యూలో పార్టీ 110 నియోజకవర్గాల్లో బలంగా ఉందని తేలిందట. అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా ఈ నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపు ఖాయమని జగన్ అనుకుంటున్నారు. మరి మిగిలిన 65 నియోజకవర్గాల మాటేమిటి ? వైనాట్ 175 అనే టార్గెట్ ఏమవుతుంది ? కొద్దిగా కష్టపడితే మరో 15-20 నియోజకవర్గాల్లో గెలిచే అవకాశం ఉందని సర్వేలో తేలిందట. అయినా ఇంకా 45-50 నియోజకవర్గాల మాటేమిటి ? అన్నది పెద్ద ప్రశ్న.
నాలుగేళ్ళ పాలన తర్వాత పాలన తర్వాత వైసీపీ గ్రామీణ ప్రాంతాల్లో బాగా బలపడిందని సర్వే వివరాలు చెప్పాయని సమాచారం. ఇదే సమయంలో అర్బన్, సెమీ అర్బన్ నియోజకవర్గాల్లో కాస్త వ్యతిరేకత ఉందట. అయితే అర్బన్, సెమీ అర్బన్ ప్రాంతాల్లో నవరత్నాలు, పక్కా ఇళ్ళ మంజూరు లాంటి వాటితో ప్రభుత్వంపై వ్యతిరేకత తగ్గుతోందని తేలింది. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే కొన్ని నియోజకవర్గాల్లో ఎంఎల్ఏల మీద, ప్రభుత్వం మీద కూడా జనాల్లో వ్యతిరేకత కనబడిందట.
అందుకనే ఇలాంటి నియోజకవర్గాలను ప్రత్యేకంగా గుర్తించి వ్యతిరేకతను పోగొట్టుకునేందుకు వ్యూహాలు రెడీ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే నాలుగు గోడల మధ్య కూర్చుని ఎన్ని వ్యూహాలైనా ఆలోచించచ్చు, ఎన్ని సమీక్షలైనా చేయవచ్చు. కానీ ప్రాక్టికల్ గా క్షేత్రస్ధాయిలోకి స్వయంగా జగన్ లేదా అభ్యర్ధులు లేదా నేతలు వెళ్ళినపుడే అసలు విషయాలు బయటపడతాయి. కాబట్టి వైనాట్ 175 అని కాకుండా ముందు ప్రజల్లో మద్దతు సంపాదించుకోవటం ఎలాగ అన్న విషయాలపై జగన్ దృష్టిపెట్టాలి.