అది కారు కాదు.. కదిలే అద్భుతం.. భారత్ లో రూట్ క్లియర్

కొత్త ఈవీ విధానంతో ఎలక్ట్రానిక్ వెహికిల్స్ కు భారత్ కేంద్రంగా మారుతుంది. అంతర్జాతీయ కంపెనీలూ వస్తాయి.

Update: 2024-03-16 17:30 GMT

శాటిలైట్ ఆధారిత నెట్ వర్క్.. డ్రైవర్ లేకుండానే ప్రయాణించే వీలు.. అత్యంత పటిష్ఠమైన సేఫ్టీ ఫీచర్స్.. ఆకట్టుకునేలా డిజైన్స్.. తనంతట తానే రివర్స్ తీసుకునే, పార్క్ చేసుకునే చాన్స్.. ఇదంతా ఏ విమానం గురించో కాదు.. కేవలం ఒక కారు గురించి.. ఇంత అద్భుతమైన సౌకర్యాలు ఉండబట్టే ఆ కారంటే ప్రపంచవ్యాప్తంగా మహా డిమాండ్. అమెరికాలో అయితే కలల కారు. ఫోన్లలో యాపిల్ లాగా.. కార్లలో ఆ కంపెనీ కార్లు అలాగన్నమాట. అయితే, ఇలాంటి కారు ప్రపంచంలో అత్యంత పెద్ద మార్కెట్ అయిన భారత్ కు మాత్రం ఇప్పటివరకు రాలేదు.

ఇండియాలోకి ఆ సూపర్ కార్

అపర కుబేరుడు ఎలాన్ మస్క్ గురించి అందరికీ తెలిసిందే. అతడికి చెందిన కార్ల కంపెనీనే టెస్లా. కొన్నాళ్లుగా భారత్ లోకి వచ్చేందుకు టెస్లా విశ్వప్రయత్నాలు చేస్తోంది. కానీ, విధానాల కారణంగా వీలు పడలేదు. ఇప్పుడు టెస్లాకు మాత్రం రాచ మార్గం ఏర్పడింది. దీనికి కారణం.. కొత్తగా కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ వెహికిల్ పాలసీ (ఎలక్ట్రానిక్ వెహికిల్ -ఈవీ పాలసీ). శుక్రవారం ఈ పాలసీని కేంద్రం ఆమోదం తెలిపింది. తద్వారా టెస్లాకు మార్గం సుగమమమైంది. కొత్త ఈవీ విధానంతో ఎలక్ట్రానిక్ వెహికిల్స్ కు భారత్ కేంద్రంగా మారుతుంది. అంతర్జాతీయ కంపెనీలూ వస్తాయి. తద్వారా ఇండియన్స్ కు కొత్త టెక్నాలజీ చేరువ అవుతుంది. భారత్ లో తయారీ (మేకిన్‌ ఇండియా)కు ఊతం వస్తుంది. ఈవీలు అంటే పర్యావరణానికి మేలు. ముడి చమురు దిగుమతి తగ్గుతుంది.వాణిజ్య లోటు కూడా తగ్గుతుంది.

రూ.4 వేలకోట్లు పెడితే రాయితీ..

భారత్ లో ఒక కంపెనీ కనీసం రూ.4,150 కోట్లు (5 వేల మిలియన్‌ డాలర్లు) పెట్టుబడి పెడితే పలు రాయితీలు లభిస్తాయి. 500 మిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టి, మూడేళ్లలో ప్లాంటు నెలకొల్పాలి. తయారీకి వాడే విడి భాగాల్లో 25 శాతం స్థానికంగానే కొనాలి. అలాంటి సంస్థలు35 వేల డాలర్ల కంటే అధిక ధర కలిగిన కార్లను 15 శాతం సుంకంతో ఏటా 8 వేల ఈవీల కార్ల వరకు దిగుమతి చేసుకోవచ్చు. ప్రస్తుతం కార్ల ధరను బట్టి 70-100 శాతం వరకు దిగుమతి సుంకాలు వర్తిస్తున్నాయి. ఇది టెస్లా భారత్ లోకి వచ్చేందుకు అడ్డంకి అయింది. దీనిని ఎత్తివేయాలని టెస్లా ఎప్పటినుంచో కోరుతోంది. తాజాగా తీసుకొచ్చిన విధానంతో భారత రోడ్లపై టెస్లా కనిపించనుంది.

Tags:    

Similar News