ఎలక్ట్రిక్ కార్ల రేసులోకి మేఘా.. తెలంగాణకు మరో బలం

ఎలాన్ మస్క్ ఎక్కడ? మేఘా క్రిష్ణారెడ్డి ఎక్కడ?

Update: 2023-07-15 06:35 GMT

రాష్ట్రం ఏదైనా.. ముఖ్యమంత్రిగా ఎవరున్నా.. తాము ఎంట్రీ ఇచ్చిన రంగంలో తమదే పైచేయిగా నిలుస్తూ.. అనతి కాలంలో ఎవరూ ఊహించనంత ఎత్తుకు ఎదిగిన సంస్థల్లో తెలుగు ప్రాంతానికి చెందిన మేఘా సంస్థ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో అయినా.. తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కూడా తమ హవా తగ్గనట్లుగా వ్యవహరించే సంస్థల్లో మేఘా మొదటి స్థానంలో నిలుస్తుంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీలో ప్రభుత్వాధినేతగా ఎవరున్నా.. కీలక ప్రాజెక్టుల్ని నిర్మించే అవకాశాన్ని సొంతం చేసుకునే మేఘా సంస్థ ఇప్పుడు ప్రపంచ కుబేరుడితో పోటీకి సై అనటం ఆసక్తికరంగా మారింది.

ఎలాన్ మస్క్ ఎక్కడ? మేఘా క్రిష్ణారెడ్డి ఎక్కడ? అని అనుకోవచ్చు. కానీ.. కొన్నిసార్లు అంచనాలకు భిన్నంగా సీన్లు చోటు చేసుకుంటూ ఉంటాయి. తాజాగా అలాంటి సీన్ ఒకటి ఎదురుకానుందా? అంటే.. అవునని చెప్పాలి. భారత మార్కెట్ మీద కన్నేసినప్పటికీ తాను అనుకునేది అనుకున్నట్లుగా సొంతం చేసుకునే విషయంలో మస్క్ మహా పట్టుదలతో ఉంటాడు. అయితే.. అతన్ని ఊరిస్తున్న భారత మార్కెట్ కోసం తన విధానాల్ని కాస్తంత సడలించుకొని.. భారత్ లో టెస్లా కార్ల కంపెనీని షురూ చేసేందుకు రెఢీ కావటం తెలిసిందే. దీనికి సంబంధించిన ఒక ప్రాథమిక ప్రకటన వెలువడింది.

కట్ చేస్తే.. టెస్లా కార్లు భారత్ లో తయారీకి సంబంధించిన వార్త వచ్చిన తర్వాతి రోజునే మరో కీలక ప్రకటన ఒకటి వచ్చింది. దాన్ని చేసిన సంస్థ మేఘా. ఎంఈఐఎల్ గా పెద్దగా ప్రజల్లో రిజిస్టర్ కాని మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ తాజాగా తన చైనా భాగస్వామి బీవైడీతో కలిసి తెలంగాణలో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విద్యుత్ బస్సుల తయారీలో తన సత్తా చాటుతూ.. పలు రాష్ట్ర ప్రభుత్వాల రోడ్డు రవాణా సంస్థల నుంచి సానుకూల స్పందన పొందుతూ.. భారీ ఆర్డర్లను సొంతం చేసుకుంటున్న ఈ సంస్థ.. ఇప్పుడు ఎలక్ట్రానిక్ కార్ల రంగంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెఢీ అవుతోంది.

చైనాకు చెందిన బీవైడీతో కలిసి తెలంగాణలో విద్యుత్ కార్లు.. బ్యాటరీలను తయారు చేసే కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు వీలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ రెండు సంస్థలు కలిసి ఏకంగా బిలియన్ డాలర్లు అంటే మన రూపాయిల్లో రూ.8200 కోట్ల పెట్టుబడిని పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా విద్యుత్ తో నడిచే హ్యాచ్ బ్యాక్ నుంచి లగ్జరీ కార్ల వరకు తమ కొత్త ప్లాంట్ లో తయారు చేయాలన్నది తాజా ప్రతిపాదన. ఈ భారీ ప్రాజెక్టులో భాగంగా ఆర్ అండ్ డీ.. ఛార్జింగ్ స్టేషన్లతో ఇతరాలు ఉండనున్నాయి. తమ ప్రాజెక్టకు సంబంధించి కేంద్రం అనుమతులకు పంపిన ఈ సంస్థ.. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే.. మిగిలిన వ్యవహారాలు జెట్ స్పీడ్ తో దూసుకెళతాయని చెబుతున్నారు.

ఇప్పటికే ఒలెక్ట్రా గ్రీన్ టె్ పేరుతో హైదరాబాద్ సమీపంలో ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు 150 ఎకరాల్ని సేకరించి.. పనుల్ని అప్పగించింది. ఏడాదికి 10వేల విద్యుత్ బస్సుల తయారీ సామర్థ్యంతో ఈ ప్లాంట్ ఉండనుంది. ఇందులో రోబోలే ఎక్కువగా వినియోగించేలా ప్లాన్ చేస్తున్నారు. విద్యుత్ తో నడిచే టిప్పర్లు.. ట్రక్కులను కూడా ఈ సంస్థ ఇప్పటికే ఆవిష్కరించింది.

మొత్తంగా విద్యుత్ వాహనాల్లో తిరుగులేని అధిక్యతను ప్రదర్శించాలన్నది ఈ సంస్థ లక్ష్యంగా చెబుతుంటారు. అందుకు తగ్గట్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓవైపు దేశంలో టెస్లా ప్లాంట్ నిర్మాణంపై ఎలాన్ మస్క్ కీలక ప్రకటన చేసిన వేళ.. పోటీగా తెలుగోడి సాయంతో చైనాకు చెందిన బీవైడీ ముందుకు రావటం.. అందుకు తగ్గట్లుగా ఇప్పటికే ఎస్ యూవీ ఆటో 3 ఈ6 మోడళ్లను విక్రయిస్తోంది. ఇదంతా చూస్తే కేంద్రం ఓకే అన్నంతనే ఎలక్ట్రికల్ కార్ల తయారీలో తన మార్క్ చూపిస్తుందంటున్నారు. ఇందుకు మన తెలుగు సంస్థ ఒకటి కీలకం కావటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News