అంతకంతకూ ఎక్కువ అవుతున్న కార్ల అమ్మకాలు
ఈ ఏడాది రెండో త్రైమాసికంలో ప్రయాణికుల వాహనాలు అత్యధికంగా అమ్ముడుపోయినట్లుగా వాహన తయారీ సంస్థల సమాఖ్య సియామ్ వెల్లడించింది.
పండుగల సీజన్ వచ్చేసింది. కార్లు.. బైకులతో పాటు వివిధ ఎలక్ట్రానిక్ వస్తువుల్ని కొనేందుకు ఇంతకు మించిన టైం మరొకటి లేదన్న భావన ఉంటుంది. అందుకు తగ్గట్లే.. వాహనాల అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే ఎక్కువగా నమోదవుతున్నాయి. జులై - సెప్టెంబరు మూడు నెలల కాలానికి ఇప్పటివరకు. జరిగిన అమ్మకాల్ని చూస్తే.. గత ఏడాది త్రైమాసికంతో పోలిస్తే ఎక్కువగా కనిపిస్తోంది. వాహనాల కొనుగోలు జోరు ఆసక్తికరంగా ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఈ ఏడాది రెండో త్రైమాసికంలో ప్రయాణికుల వాహనాలు అత్యధికంగా అమ్ముడుపోయినట్లుగా వాహన తయారీ సంస్థల సమాఖ్య సియామ్ వెల్లడించింది. జులై - సెప్టెంబరులో కంపెనీల నుంచి డీలర్లకు 10.74 లక్షల వాహనాలు చేరాయి. గత ఏడాది అదే సమయానికి టోకుగా సరఫరా అయిన 10.26 లక్షల వాహనాలతో పోలిస్తే ఈ ఏడాది 4.7 శాతం ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు.
ఒక ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆర్నెల్ల కాలంలోనే ప్రయాణికుల వాహనాల సంఖ్య 20 లక్షల మార్కును దాటటం కూడా ఇదే మొదటిసారిగా చెబుతున్నారు. 2022-23 మొదటి ఆర్నెల్లలో 19.36 లక్షల ప్రయాణికుల వాహనాల అమ్మకాలు సాగితే.. ఈసారి అందుకు భిన్నంగా 20.7లక్షల వాహనాలు అమ్ముడు కావటం విశేషం. ఈ వాహనాల్లో ఎస్ వీయూల అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.
ఆసక్తికరమైన విషయం ఏమంటే.. కార్ల కొనుగోలు విషయంలో ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. గతానికి భిన్నంగా ప్రారంభస్థాయి కార్ల అమ్మకాలు బాగా తగ్గినట్లు చెబుతున్నారు. 2018-19లో (అంటే కరోనాకు ముందు) జులై- సెప్టెంబరు మధ్యనున్న మూడు నెలల కాలంలో ఎంట్రీ లెవల్ కార్ల అమ్మకాలు 1.38 లక్షలు కాగా.. తాజాగా చూస్తే అది కేవలం 35వేల కంటే తక్కువగా ఉండటం గమనార్హం. కార్లు కొనుగోలు చేసే వారిలో వచ్చిన మార్పు ఎంతన్నది తాజా లెక్కలు స్పష్టం చేస్తున్నట్లుగా చెప్పాలి.
దేశ వ్యాప్తంగా చూస్తే.. గత ఏడాది.. ఈ ఏడాది సెప్టెంబరులో వాహనాల కొనుగోళ్ల విషయానికి వస్తే.. గత ఏడాది టూ వీలర్లు, కార్ల విషయానికి వస్తే ఈ కాలంలో 3.55 లక్షల వాహనాల అమ్మకాలు సాగితే.. ఈ ఏడాది ఇదే కాలానికి 3.61 లక్షలుగా ఉన్నాయి. మూడు చక్రాల వాహనాల అమ్మకాల జోరు కూడా ఎక్కువగా ఉన్న విషయాన్ని చెబుతున్నారు. గత ఏడాది సెప్టెంబరు ఒక్క నెలలోనే 50,626 త్రిచక్ర వాహనాల అమ్మకాలు సాగితే.. ఈ ఏడాది అది కాస్తా 74,418గా ఉన్నట్లు వెల్లడైంది. మొత్తంగా దేశీయంగా వాహన రంగం జోరు దూసుకెళుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.