రూ. 6,600 కోట్ల మోసంలో ముంబై మహిళ అరెస్ట్... వివరాలివే!

ఎన్‌ ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ముంబయికి చెందిన సింపీ భరద్వాజ్‌ అనే మహిళను అరెస్టు చేశారు.

Update: 2023-12-20 08:30 GMT

ట్రెండ్ మారింది.. ప్రస్తుతం బిట్ కాయిన్ మోసాలు తెరపైకి వస్తున్నాయి. పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశ చూపించడం, అనంతరం గాయబ్ అవ్వడం పలువురు మోసగాళ్లకు అలవాటుగా మారిపోతుంది! ఈ సమయంలో ఇదే విధంగా బిట్ కాయిన్ లో పెట్టుబడులు పెడితే భారీ ఎత్తున లాభాలు వస్తాయని ఆశచూపి కోట్ల రూపాయలు వసూలు చేసిన ముంబైకి చెందిన ఒక మహిళను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం వైరల్ గా మారింది.

అవును... బిట్‌ కాయిన్‌ లో ఇన్వెస్ట్ చేస్తే అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి వేల కోట్ల రూపాయలు వసూలు చేసిన కేసులో ఎన్‌ ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ముంబయికి చెందిన సింపీ భరద్వాజ్‌ అనే మహిళను అరెస్టు చేశారు. ఈ మేరకు ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఈడీ అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా ముంబై, ఢిల్లీ నగరాల్లో సుమారు రూ.6,600 కోట్లు వసూలు చేశారని వెల్లడించారు.

ఈడీ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం... ముంబైకు చెందిన "వేరియబుల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌" అనే సంస్థకు సింపీ భరద్వాజ్‌ ఆమె భర్త అజయ్‌ భరద్వాజ్‌ తోపాటు.. అమిత్‌ భరద్వాజ్‌, మహేందర్‌ భరద్వాజ్‌, వివేక్‌ భరద్వాజ్‌ అనే వ్యక్తులు ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థ నిర్వహిస్తోన్న "గెయిన్‌ బిట్‌ కాయిన్‌ పోంజీ స్కీం" లో భాగంగా బిట్‌ కాయిన్‌ లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయని ఆశ చూపి ఏజెంట్ల ద్వారా డబ్బులు వసూలు చేయడమే.

ఈ క్రమంలో మల్టీ-లెవల్‌ మార్కెటింగ్‌ చేసి ముంబై, ఢిల్లీ నగరాల్లో ప్రజల నుంచి సుమారు రూ.6,600 కోట్లు వసూలు చేశారు. ఈ సంస్థ మోసాలపై ఢిల్లీ, ముంబైలలో పలువురు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు... వీరు వసూలు చేసిన మొత్తాన్ని విదేశాల్లోని పలు సంస్థల ఖాతాలకు మల్లించి, ఆ డబ్బుతో ఆయా దేశాల్లో పెద్ద ఎత్తున స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు గుర్తించారని తెలిపారు.

ఈ క్రమంలో ఢిల్లీ, ముంబై లలోని సంస్థ ప్రమోటర్ల నివాసాలు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించగా.. ఈ సోదాల్లో ఖరీదైన మూడు లగ్జరీ కార్లు, రూ.18.91 లక్షల డబ్బు, రూ.69 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ తెలిపింది. ఈ కేసులో సింపీ భరద్వాజ్‌ ను డిసెంబరు 17న ముంబయిలో అరెస్టు చేసి, కోర్టులో ప్రవేశపెట్టగా డిసెంబరు 26 వరకు ఈడీ కస్టడీకి కోర్టు అనుమతించింది. మిగిలినవారు పరారీలో ఉన్నట్లు ఈడీ తెలిపింది.

Tags:    

Similar News