హైదరాబాద్ లో సినీ నిర్మాత దారుణ హత్య!
కాగా ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ లోని పద్మారావు నగర్‌కు చెందిన జి.అంజిరెడ్డి (71) గతంలో సినీ నిర్మాతగా పనిచేశారని చెబుతున్నారు.
హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. సినీ నిర్మాత అంజిరెడ్డి (71) దారుణ హత్యకు గురయ్యారు. స్థిరాస్తుల వ్యవహారంలోనే ఈ హత్య జరిగిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు.
కాగా ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ లోని పద్మారావు నగర్‌కు చెందిన జి.అంజిరెడ్డి (71) గతంలో సినీ నిర్మాతగా పనిచేశారని చెబుతున్నారు. ఈయనకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఓ కుమారుడు నగరం పరిధిలోనే మోకిలాలో ఉంటుండగా.. మరో కుమారుడు, కుమార్తె విదేశాల్లో జీవిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే అంజిరెడ్డితో పాటు ఆయన భార్యకు కూడా అమెరికా పౌరసత్వాలు వచ్చాయి. దీంతో అక్కడే స్థిరపడాలని భావించిన ఆయన నగరంలోని తన స్థిరాస్తులు విక్రయించాలని భావించారు.
ఈ క్రమంలో అంజిరెడ్డి నిర్మాతగా ఉండగా పరిచయమైన సీనియర్ ఫొటోగ్రాఫర్ రవి కాట్రగడ్డతో ఆయనకు స్నేహం ఉంది. ఈ నేపథ్యంలో అంజిరెడ్డి తన ఆస్తులను విక్రయిస్తానని.. ఎవరైనా ఉంటే చెప్పాలని ఎనిమిది నెలల క్రితం రవికి తెలిపారు. ఆ తర్వాత అంజిరెడ్డి అమెరికా వెళ్లారు. అంజిరెడ్డి సూచన మేరకు ఫొటోగ్రాఫర్ రవి ఈ విషయాన్ని రియల్టర్లతో కూడిన వాట్సాప్ గ్రూపులో పోస్టు చేశారు.
ఈ క్రమంలో నెల రోజుల క్రితం భార్యతో హైదరాబాద్ వచ్చిన అంజిరెడ్డి వద్దకు రవి తన వెంట జీఆర్ కన్వెన్షన్ యజమాని రాజేష్ ను తీసుకువచ్చారు. జీఎఆర్ కన్వెన్షన్ గోపాలపురంలోని సరోజినిదేవి రోడ్ లో ఉంది. అంజిరెడ్డికి అలా పరిచయమైన రాజేష్ నమ్మకంగా, సన్నిహితంగా మెలిగాడు. పద్మారావునగర్ లోని ఇల్లు తనకు నచ్చిందని, తానే కొంటానని అంజిరెడ్డికి చెప్పినట్టు తెలుస్తోంది. అలాగే తమకు సైదాబాద్ లో ఉన్న మరో ఆస్తిని విక్రయించాలని అంజిరెడ్డి భావించారు. ఈ విషయం తెలుసుకున్న రాజేష్.. దాన్ని కొనడానికి ఒకరు సిద్ధంగా ఉన్నారని అంజిరెడ్డికి చెప్పాడు.
వాస్తవానికి అంజిరెడ్డి, ఆయన భార్య గత నెల 22న అమెరికా వెళ్లాల్సి ఉంది. అయితే సెప్టెంబర్ 29న రెండు ఆస్తుల లావాదేవీలు పూర్తవుతాయని రాజేష్ వారితో చెప్పడంతో అంజిరెడ్డి హైదరాబాద్ లోనే ఉండిపోయాడు. ఆయన భార్య విదేశానికి వెళ్లింది.
ఈ క్రమంలో ఎలాంటి నగదు చెల్లించకుండా అంజిరెడ్డికి పద్మారావునగర్ లో ఇంటిని సొంతం చేసుకోవాలని రాజేష్ భావించాడని అనుమానిస్తున్నారు. దీనికోసం రెండు విడతల్లో అంజిరెడ్డికి రూ.2.1 కోట్లు నగదు రూపంలో చెల్లించినట్లు, వృద్ధుడు కావడంతో ఆయనకు ఏమైనా అయితే మరో రూ.50 లక్షలు ఆయన భార్యకు ఇచ్చి ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించుకునేలా నమూనా డ్రాఫ్ట్ సిద్ధం చేశాడని తెలుస్తోంది.
ఈ క్రమంలో అంజిరెడ్డి మేడ్చల్ లోని అద్వైత్ గేటెడ్ కమ్యూనిటీలో విల్లా కొనాలని నిర్ణయించినట్టు సమాచారం. సెప్టెంబర్ 29 ఉదయం పద్మారావునగర్ కు వెళ్లిన రాజేష్... అంజిరెడ్డిని తీసుకుని విల్లా చూడటానికి మేడ్చల్ వెళ్లారు. అక్కడ ఉండగా ఆస్ట్రేలియా నుంచి ఫోన్ చేసిన భార్యతో అంజిరెడ్డి మేడ్చల్ లో ఉన్నట్టు చెప్పారు. ఆ తర్వాత మోకిలాలో ఉండే కుమారుడు శ్రీచరణ్‌రెడ్డి ఎన్నిసార్లు ప్రయత్నించినా అంజిరెడ్డి ఫోన్ కలవలేదు.
కాగా అంజిరెడ్డి, రాజేష్ సెప్టెంబర్ 29 సాయంత్రం 5.30 గంటలకు వేర్వేరు కార్లలో రాజేష్ కు చెందిన జీఆర్ కన్వెన్షన్ ఉన్న డీమార్ట్ బిల్డింగ్ లోకి ప్రవేశించారు. బేస్ మెంట్– 3లో అంజిరెడ్డి కారు పార్క్ చేశాక రాజేష్, అతడి భార్య, డ్రైవర్, కన్వెన్షన్ లో పని చేసే ఇద్దరు బిహారీలు అంజిరెడ్డిని దారుణంగా హత్య చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆపై మృతదేహాన్ని్న బేస్ మెంట్–3లోని ఆయన కారు వద్దకు తీసుకువచ్చి పడేశారని అనుమానిస్తున్నారు. హత్య జరిగిన రోజు రాత్రి 9.15 గంటలకు అంజిరెడ్డి కుమారుడు చరణ్ కు ఫోన్ చేసిన రవి.. అంజిరెడ్డికి యాక్సిడెంట్ అయిందని చెప్పాడు.
దీంతో హుటాహుటిన వచ్చిన కుమారుడు శ్రీ చరణ్ రెడ్డి తన తండ్రి కారు బేస్‌మెంట్–3లో పార్క్ చేసి ఉండటం, దాని పక్కనే తన తండ్రి మృతదేహం పడి ఉండటాన్ని గుర్తించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోపాలపురం పోలీసులు తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఆ తర్వాత సీసీ కెమెరా ఫుటేజీలు, ఇతర సాంకేతిక ఆధారాలతో హత్యగా తేల్చారు. ఈ దారుణంలో పాలుపంచుకున్న రాజేష్, అతడి భార్య, డ్రైవర్, ఇద్దరు బిహారీలను తమ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.