హత్య చేసిన ఆమె బతికున్నట్లుగా నమ్మించిన పోలీసు రియల్ క్రైం స్టోరీ

ఢిల్లీ పోలీసు విభాగంలో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న సరేంద్ర రాణా అనే ఖాకీ నిర్వాకం తెలిసినంతనే షాక్ కు గురి కాక మానదు.

Update: 2023-10-02 16:39 GMT

రీల్ కాదు. రియల్ క్రైం స్టోరీ. సినిమాల్లోనూ.. వెబ్ సిరీస్ లో మాదిరి ఒక దుర్మార్గ పోలీసు చేసిన ఆరాచకం తాజాగా వెలుగు చూసింది. నేరస్తుల్ని పట్టుకునే టాలెంట్ పోలీసులకు ఎంతన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పోలీసే నేరస్తుడిగా మారితే.. తనకున్న టాలెంట్ ఎంత చూపిస్తారన్న దానికి నిదర్శనంగా తాజా ఉదంతాన్ని చెప్పొచ్చు. హత్యకు పాల్పడటమే కాదు.. సదరు వ్యక్తి బతికి ఉన్నట్లుగా నమ్మించిన వైనం తాజాగా బయటకు వచ్చింది. ఢిల్లీ పోలీసు విభాగంలో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న సరేంద్ర రాణా అనే ఖాకీ నిర్వాకం తెలిసినంతనే షాక్ కు గురి కాక మానదు.

ఢిల్లీ పోలీసు విభాగంలో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న సురేంద్రరాణాకు 2014లో కానిస్టేబుల్ గా పని చేస్తున్న మోనా పరిచయమైంది. వీరిద్దరూ కంట్రోల్ రూంకు డిప్యుటేషన్ మీద వెళ్లినప్పుడు వీరి పరిచయం మొదలైంది. కొంతకాలం తర్వాత యూపీ పోలీసు విభాగంలో మోనాకు ఎస్ఐగా పోస్టింగ్ వచ్చింది. దీంతో.. కానిస్టేబుల్ జాబ్ ను వదిలేసి.. ఢిల్లీలో సివిల్స్ కు ప్రిపేర్ కావటం మొదలు పెట్టింది. అయితే.. ఆమె మీద కన్నేసిన సురేంద్ర ఆమెను ఫాలో అవుతున్నాడు.

అతడి ఉద్దేశాన్ని గమనించిన ఆమె.. సురేందర్ ను వారించింది. ఈ క్రమంలో 2021 సెప్టెంబరులో వీరి మధ్య గొడవైంది. అనంతరం ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి గొంతు నులిమి చంపేశాడు. అనంతరం ఆమె డెడ్ బాడీని మురుగు కాల్వలో పడేశాడు. ఆ తర్వాత ఆమె శవం బయటకు రాకుండా పెద్ద బండరాళ్లను పెట్టాడు. తాను చేసిన హత్యను కప్పి పుచ్చటం కోసం కొత్త నాటకానికి తెర తీశాడు. బాధితురాలి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి.. ఆమె అర్వింద్ అనే వ్యక్తితో వెళ్లిపోయినట్లుగా చెప్పాడు. ఆమె కోసం వెతుకుతున్నట్లుగా నమ్మించేందుకు పలుమార్లు వారితో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు.

ఆమె బతికి ఉందని నమ్మించటం కోసం ఒక మహిళకు వ్యాక్సిన్ వేయించి.. దాన్ని మోనా పేరుతో సర్టిఫికేట్ తయారు చేయించాడు. మోనా బ్యాంకు అకౌంట్ నుంచి లావాదేవీల్ని జరిపేవాడు. ఆమె సిమ్ కార్డును వాడేవాడు. మొత్తంగా ఆమె బతికి ఉందన్న నమ్మకం కలిగేలా చేసేవాడు. అక్కడితో ఆగని అతడు.. తాను చేసిన నేరం నుంచి తప్పించుకోవటానికి వీలుగా.. తన బావమరిది రాబిన్ ను రంగంలోకి దింపి.. మోనా పెళ్లి చేసుకున్న యువకుడిగా పరిచయం చేసుకొని మాట్లాడించాడు.

మోనా తల్లిదండ్రులు తమ కుమార్తెతో మాట్లాడేందుకు ప్రయత్నించగా.. ఆమె వారితో మాట్లాడటానికి భయపడుతున్నట్లుగా నమ్మించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా మోనా తల్లిదండ్రుల్ని, పోలీసుల్ని తప్పుదారి పట్టేలా ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఇదిలా ఉండగా.. రెండు నెలల క్రితం ఈ కేసు ఢిల్లీ క్రైం బ్రాంచ్ కు చేరింది. అర్వింద్ పేరుతో వస్తున్న ఫోన్ నెంబరును ట్రేస్ చేసిన పోలీసులు.. ఆ వివరాలు అనుమానాస్పదంగా ఉండటాన్ని గుర్తించారు.

దీంతో ఈ అంశంపై మరింత లోతుగా విచారించటంతో గుట్టు రట్టైంది. పోలీసులకు ఇచ్చిన సమాచారంతో మోనా అవశేషాల్ని కాలువ నుంచి వెలికి తీసి.. డీఎన్ఏ పరీక్షలకు పంపారు. చదువుల్లో చురుగ్గా ఉండి.. చిన్న వయసులోనే జాబ్ సంపాదించిన ఆమె మీద సురేందర్ కన్ను పడింది.

తక్కువ వ్యవధిలోనే ఆమె పెద్ద పోస్టుకు వెళుతుందన్న విషయాన్ని గుర్తించిన అతడు.. ఆమె వెంట పడటం.. అతడ్ని ఆమె తండ్రిగా భావిస్తున్నట్లు చెప్పటంతో ఆమెను చంపేశాడు. స్వయంగా పోలీసు కావటంతో చేసిన నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసినప్పటికీ.. చివరకు నిజం బయటకు వచ్చింది. ఇంత దారుణానికి ఒడికట్టిన ఇతగాడికి భార్య.. పన్నెండేళ్ల కొడుకు ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. కుటుంబం ఉండి కూడా.. ఇలాంటి చెత్త పని చేసిన ఇతగాడికి కఠిన శిక్ష విధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Tags:    

Similar News