దొంగలు కాదు.. గుండెలు తీసిన బంట్లు... పోలీసులను ఏమారుస్తున్నారిలా!

ఈ రహస్య ఆస్పత్రులు సాధారణ ఆస్పత్రులతో పోలిస్తే నాలుగు రెట్లు పెద్దవిగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు

Update: 2024-07-10 17:30 GMT

విలన్లు తమను పోలీసులు పట్టుకోకుండా ఉండటానికి మారు వేషాల్లో తిరగడం, లేదా ముఖానికి ఎవరూ గుర్తు పట్టకుండా మాస్కు తగిలించుకోవడం, లేదా డూప్లికేట్‌ (నకిలీ) వ్యక్తిని సృష్టించడం, లేదా పూర్తిగా ముఖాన్ని మార్చేసుకోవడానికి ప్లాస్టిక్‌ సర్జరీలు చేయించుకోవడం వంటివి ఇన్నాళ్లూ మనం సినిమాల్లోనే చూశాం.

కానీ నేరగాళ్లు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు.. వారి రూపురేఖలు మార్చుకోవడానికి ఏకంగా రహస్య ఆస్పత్రులనే నిర్వహిస్తుండటం హాట్‌ టాపిక్‌ గా మారింది. ఈ రహస్య ఆస్పత్రుల్లో నేరగాళ్లు ప్లాస్టిక్‌ సర్జరీల ద్వారా తమ ముఖాలను మార్చేసుకుంటున్నారు. తీవ్రమైన కుంభకోణాలకు పాల్పడినవారు, దారుణమైన నేరాలు చేసినవారు పోలీసుల నుంచి తప్పించుకోవడానికి తమ ముఖకవళికలను ప్లాస్టిక్‌ సర్జరీల ద్వారా మార్చేసుకుంటున్నారు.

2022లో చైనా మాఫియాకు చెందిన ఓ వ్యక్తిని ఫిలిప్పీన్స్‌ అధికారులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అతడు పోలీసుల నుంచి తప్పించుకొనేందుకు ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకొన్నట్లు వెల్లడించాడు. దీంతో పోలీసులు విచారణ చేపట్టగా రహస్య ఆస్పత్రులు రెండు వెలుగు చూశాయి. వీటిలో అక్రమంగా నేరస్తులకు ప్లాస్టిక్‌ సర్జరీలు చేస్తున్నారు. దీంతో పోలీసులు ఈ రెండు రహస్య ఆస్పత్రులను సీజ్‌ చేసి నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు.

ఈ రహస్య ఆస్పత్రులు ఫిలిఫ్పీన్స్‌ రాజధాని నగరమైన మనీలాకు సమీపంలోని పాసే అనే పట్టణంలో ఉన్నాయి. వీటిపై విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు వాటిపై ఏకకాలంలో దాడులు చేపట్టారు. దీంతో అక్కడి బండారం బట్టబయలైంది.

పోలీసుల దాడుల్లో హెయిర్‌ ట్రాన్సప్లాంట్‌ టూల్స్, డెంటల్‌ ఇంప్లాంట్స్, స్కిన్‌ వైట్‌ నింగ్‌ ఐవీ డ్రిప్స్‌ వంటివి పట్టుబడ్డాయి. వీటి సాయంతో వ్యక్తుల రూపురేఖలు పూర్తిగా మార్చేయవచ్చని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ప్లాస్టిక్‌ సర్జరీలు చేస్తున్న ముగ్గురు వైద్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురు ఫిలిఫ్ఫీన్స్‌ దేశస్తులు కాదని పోలీసులు వెల్లడించారు. ఇద్దరు వియత్నాం దేశానికి చెందినవారు కాగా మరొకరు చైనాకు చెందిన డాక్టర్‌ అని తెలిపారు.

ఈ వైద్యులకు ఎక్కువ మొత్తం వేతనంగా ఇస్తామని ఆఫర్‌ చేసినట్టు తెలుస్తోంది. ఈ ముగ్గురు వైద్యులు పిలిఫ్సీన్‌ లో ఉండటానికి అనుమతులు కూడా తీసుకోలేదని చెబుతున్నారు. ఈ రెండు ఆస్పత్రులే కాకుండా మరో రెండు ఆస్పత్రుల్లోనూ ఈ దందా నడుస్తోందని తేల్చారు.

ఈ రహస్య ఆస్పత్రులు సాధారణ ఆస్పత్రులతో పోలిస్తే నాలుగు రెట్లు పెద్దవిగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఆన్‌లైన్‌ కేసినోలకు చెందినవారు, పిలిఫ్సీన్స్‌ లో అక్రమంగా ఉంటున్నవారు ఈ ఆస్పత్రులకు వస్తుంటారని తెలుస్తోంది.

Tags:    

Similar News