డాక్టర్‌ రాధ హత్య కేసులో కొత్త కోణం... పట్టిచ్చిన వైఫై!

Update: 2023-08-13 08:43 GMT

మచిలీపట్నంలో సంచలనం సృష్టించిన డాక్టర్‌ రాధ హత్య కేసులో కొత్తకోణం వెలుగు చూసింది. పోలీసులు సాంకేతిక సహకారంతో నిందుతులను గుర్తించారు. ఈ సమయంలో వైఫై సిగ్నల్ కూడా కీలకంగా మారింది. ఫలితంగా నిందితుడి ఫోన్ కనెక్ట్ అయిన వైఫై పోలీసులకు ఒక క్లారిటీ ఇచ్చింది.

గత నెల 25న మచిలీపట్నంలో తన ఇంట్లో డాక్టర్‌ రాధ హత్యకు గురయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రాధ భర్త మహేశ్వరరావు, డ్రైవర్‌ మధులను పోలీసులు అరెస్టు చూపించారు. నిందితులను మచిలీపట్నం కోర్టులో హాజరుపరచగా, వీరికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించారు. దీంతో వీరిద్దరినీ జిల్లా జైలుకు తరలించారు పోలీసులు.

అయితే అసలు వీల్లే నిందితులు అని పోలీసులు ఎలా కనిపెట్టారనేది మాత్రం ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ని మించి ఉంటుందనడంలో సందేహం ఉండదు! ఆ స్థాయిలో ట్విస్టులు, జలక్కులు, ఇంటర్వెల్ బ్యాంగులు.. ఆ స్థాయిలో ప్లాన్ చేశాడు డాక్టర్‌ రాధ భర్త. కరుడుగట్టిన హంతకుడికి ఏమాత్రం తీసిపోని రీతిలో ఉందన్నా అతిశయోక్తి కాదు!

అవును... తన భార్యను హత్య చేయాలని మూడు నెలల ముందే మహేశ్వరరావు పథకం రచించారు. దీనికి తగ్గట్లుగా ఆసుపత్రిలో సీసీ కెమెరాల్లో సాంకేతిక సమస్య తలెత్తి ఆగిపోయినా మరమ్మతులు చేయించలేదు. అప్పటి నుంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో జూలై 26 దాటితే మరింత ఆలస్యం అయిపోద్దని భావించాడు.

కారణం.... జులై 26న రాధ.. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఉన్న తన కోడలు ప్రసవానికి వెళ్లాల్సి ఉంది. ఆమె వెళ్తే ఇప్పట్లో రాదని గ్రహించే 25వ తేదీనే హత్య పథకాన్ని అమలు చేశారు. డాక్టర్‌ లిఫ్ట్‌ ద్వారా, మధు మెట్ల గుండా కిందకు దిగడం సీసీ కెమెరాలో రికార్డు అయింది.

ఇదే సమయంలో ఆసుపత్రికి కిలోమీటరు దూరంలో ఓ సీసీ కెమెరాలో డ్రైవర్‌ మధు కదలికలు కనిపించాయి. వర్షంలో హడావుడిగా డాక్టర్‌ స్కూటీపై వచ్చి.. సూపర్‌ మార్కెట్‌ లో కారం ప్యాకెట్‌ కొనుగోలు చేసి వెళ్లాడు. ఈ క్లూ ఆధారంగా దర్యాప్తు సాగింది. దీంతో ఆ కుటుంబానికి అత్యంత నమ్మకస్థుడైన డ్రైవర్‌ ను పోలీసులు అదుపులోకి తీసుకుని సుదీర్ఘంగా విచారించారు.

దీంతో ఇద్దరం కలసి చంపేశామని డ్రైవర్ వెల్లడించాడు. అనంతరం ఆ వివరాల ఆధారంగా డాక్టర్‌ మహేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఈ విచారణలు అసలు విషయం వెల్లడించాడు నిందితుడు. తన భార్యను హత్య చేసిన అనంతరం సాక్ష్యాలు ఏమీ లేకుండా చేశానని తెలిపాడు ఉమామహేశ్వర రావు.

భార్యను హత్య చేసిన అనంతరం నేరుగా కింద ఉన్న తన ఛాంబర్‌ లోకి వచ్చిన డాక్టర్... హత్యతో తనకు సంబంధం లేదని నిరూపించుకునేందుకు తీవ్రంగా తాపత్రయపడ్డారు. ఇందులో భాగంగా గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌ లో వివిధ అంశాలపై అన్వేషించారు. తాను ఫలానా సమయంలో ఆఫీసులో ఇంటర్నెట్ లో కనెక్ట్ అయ్యి ఉన్నానని సాక్ష్యం సృష్టించుకునేందుకే ఇదంతా చేసినట్లు గుర్తించారు.

అయితే ఎంత పెద్ద నేరస్తుడైనా ఒక చిన్న మిస్టేక్ చేస్తారని అన్నట్లుగా వైఫై సిగ్నల్ తో దొరికేశాడు డాక్టర్. అదెలా అంటే... ఆసుపత్రిలో ప్రతి అంతస్తుకు ప్రత్యేకంగా వైఫై రూటర్లు ఉన్నాయి. వీటికి అనుసంధానమైన ఫోన్ల వివరాలను పరిశీలించగా.. హత్య జరిగిన సమయంలో రెండో అంతస్తులోని రూటర్‌ కు ఆయన ఫోన్ కనెక్ట్ అయినట్లు బయటపడింది.

ఆతర్వాత కింది అంతస్తులోని వైఫైకు రాత్రి 10.30 గంటల వరకు కనెక్ట్‌ అయినట్లు వెలుగుచూసింది. దీంతో... హత్య జరిగిన సమయంలో ఈయన ఇంట్లోనే, హత్య జరిగిన ప్రాంతంలోనే ఉన్నట్లు ఒక క్లారిటీకి వచ్చారు పోలీసులు.

అదంతా ఒకెత్తు అయితే... తాను పక్కా ప్రణాళిక ప్రకారమే ఆధారాలు లేకుండా హత్య చేశాననీ, మీరెలా చేధించారని దర్యాప్తు అధికారులను నిందితుడు మహేశ్వరరావు ప్రశ్నించడం మరొకెత్తు!

Tags:    

Similar News