ఇలా కూడా మోసం చేస్తున్నారు పారాహుషార్
ఆన్ లైన్ లో కార్యకలాపాలు మొదలైన తర్వాత నుంచి ఏదో రకంగా మోసం చేసే తీరు అంతకంతకూ ఎక్కువ అవుతోంది
ఆన్ లైన్ లో కార్యకలాపాలు మొదలైన తర్వాత నుంచి ఏదో రకంగా మోసం చేసే తీరు అంతకంతకూ ఎక్కువ అవుతోంది. కోట్లాది మంది ఆన్ లైన్ కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్న వేళ.. మోసపూరిత విధానాలతో మోసం చేసే కేటుగాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికే ఎన్నో తరహా మోసాల్ని చూశాం. ఇప్పటివరకు వెలుగు చూడని సరికొత్త ఆన్ లైన్ మోసం ఒకటి తాజాగా కర్ణాటకలో వెలుగు చూసింది. ఆన్ లైన్ కొనుగోళ్లలో క్యాష్ ఆన్ డెలివరీ పెట్టే ప్రతి ఒక్కరు చదవాల్సిన ఈ దుర్మార్గం వివరాల్లోకి వెళితే..
బెంగళూరులోని యశ్వంత్ పురకు చెందిన పోలీసులు ఈ-కామర్స్ కొనుగోళ్ల డేటాను దొంగ మార్గంలో సంపాదించి.. వినియోగదారుల్ని అడ్డంగా దోచేసే 21 మందితో కూడి అంతర్ రాష్ట్ర ముఠాను అరెస్టు చేశారు. వారిని విచారించే సమయంలో షాకింగ్ అంశాలు వెలుగు చూశాయి. ఈ టీంలోని వారంతా ఈ కామర్స్ కంపెనీల నుంచి క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్ల డేటాను దొంగలిస్తారు. వినియోగదారులు ఆర్డర్ చేసిన వస్తువులకు బదులుగా నకిలీ వస్తువుల్ని పంపుతారు.
తమ వద్ద ఉన్న డేటా ప్రకారం.. కాస్త ఆలస్యంగా డెలివరీ అయ్యే సామాన్ల వివరాల్ని గుర్తించి.. నకిలీ వస్తువుల్ని.. చెప్పిన సమయం కంటే ముందుగా డెలివరీ చేస్తారు. దీంతో.. తాము డెలివరీ చేసిన వస్తువు కాస్తంత ముందుగా వచ్చిందన్న సంతోషంతో.. వాటిని స్వీకరించేవారు. ఆ తర్వాత తమకు డెలివరీ చేసిన వస్తువులు నకిలీవిగా గుర్తించిన వినియోగదారులు ఈకామర్స్ సంస్థకు తిరిగి పంపేవారు.
దీంతో.. వినియోగదారులు.. ఈకామర్స్ సంస్థలు నష్టాల్ని చవిచూస్తున్న పరిస్థితి. ఇంతకూ ఈ డేటా ఎలా బయటకు వస్తుందన్న విషయంలోకి వెళితే.. ఈ కంపెనీల్లో పని చేసే కొందరు ఉద్యోగుల్ని ట్రాప్ చేసి వివరాల్ని సేకరించి.. ఈ తరహాలో మోసం చేస్తున్నారు. నకిలీ వస్తువుల్ని అంటగట్టటం కారనంగా తమకు 2021 జూన్ నుంచి రూ.70 లక్షలు నష్టం వాటిల్లినట్లుగా ఒక కంపెనీ ఫిర్యాదు ఇవ్వటంతో పోలీసులు రంగంలోకి దిగారు. విచారణలో భాగంగా సరికొత్త మోసాన్ని వెలికి తీశారు. ఈ ముఠాలో ముంబయి.. గుజరాత్.. మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన మొత్తం 21 మంది నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.26.95 లక్షల నగదు.. 11 మొబైల్ ఫోన్లు.. 3 ల్యాప్ టాప్ లు.. హార్డ్ డిస్కుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.