సుప్రీంకోర్టునూ వ‌ద‌ల‌ని సైబ‌ర్ గాళ్లు... ఏం జ‌రిగిందంటే!

సైబ‌ర్ నేరం. స‌మాజంలో దాదాపు అంద‌రూ ఏదో ఒక సంద‌ర్భంలో ఈ నేర‌స్తుల బారిన ప‌డిన‌వారేన‌ని ఇటీవ‌ల సైబరాబాద్ సీపీ చెప్పుకొచ్చారు.

Update: 2023-09-01 02:30 GMT

సైబ‌ర్ నేరం. స‌మాజంలో దాదాపు అంద‌రూ ఏదో ఒక సంద‌ర్భంలో ఈ నేర‌స్తుల బారిన ప‌డిన‌వారేన‌ని ఇటీవ‌ల సైబరాబాద్ సీపీ చెప్పుకొచ్చారు. కొంద‌రు తృటిలో త‌ప్పించుకుంటే మ‌రికొంద‌రు వీరి బారిన ప‌డి.. స‌ర్వం కోల్పోయిన వారు ఉన్నారు. ఇలా... సైబ‌ర్ నేర‌గాళ్లు ఇందుగ‌ల‌డందు లేద‌ను విధంగా ఎందెందు.. వెత‌కి చూసిన అందందే ఉంటూ.. జనాల‌ను ముంచేస్తున్నారు.

ఇక‌, ఇప్పుడు ఏకంగా దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం.. సుప్రీంకోర్టును కూడా.. సైబ‌ర్ నేర‌గాళ్లు వ‌ద‌ల్లేదు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ప్ర‌ధాన న్యాయ‌య‌మూర్తి జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్ ప్ర‌క‌టించారు. ‘సుప్రీం కోర్టు’ పేరిట ఓ నకిలీ వెబ్‌సైట్ హ‌ల్ చ‌ల్ చేస్తోంద‌ని ఆయ‌న కోర్టులోనే స్వ‌యంగా వెల్ల‌డించారు. ఈ వెబ్‌సైట్‌ విషయంలో లాయర్లు, క‌క్షి దారులు అత్యంత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని కూడా ఆయ‌న‌ హెచ్చరించారు.

ఏం జ‌రుగుతోంది?

సుప్రీంకోర్టులో జ‌రిగే కార్య‌క‌లాపాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు రికార్డు చేస్తూ.. ‘సుప్రీం కోర్ట్‌ ఆఫ్‌ ఇండియా` పేరుతో ఒక వెబ్ సైట్ అందుబాటులో ఉంది. దీనిలో స‌మ‌స్త స‌మాచారం అందుబాటులో ఉంటుంది. కేసులు, న్యాయ మూర్తులు, గ‌త తీర్పులు.. సంచ‌ల‌న తీర్పులు, రాజ్యాంగ ధ‌ర్మాస‌నం తీర్పులు ఇలా అనేకం అందుబాటులో ఉన్నాయి.

అయితే.. ఇప్పుడు ఈ సైట్‌కు ఓ నకిలీ వెబ్‌సైట్‌ను సృష్టించారు. రెండు URLలను కూడా జనరేట్‌ చేశారు. వీటితో వ్యక్తిగత వివరాలు, రహస్య సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఆధార్‌, బ్యాంకు వివ‌రాలు, ఓటీపీలు కూడా కోరుతున్నారు. వీరి వ‌ల‌లో క‌నుక ప‌డితే.. ఇక‌, ఖాతాలు ఖాళీ కావాల్సిందేన‌ని అంటున్నారు న్యాయ‌వాదులు. వాస్త‌వానికి సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఎన్నడూ ప్రజలు వ్యక్తిగత సమాచారాన్ని బ్యాంకు వివ‌రాల‌ను అడ‌గ‌దు. రహస్య వివరాలు, ఆర్థిక లావాదేవీల గురించి అడగదు.

‘‘నకిలీ వెబ్‌సైట్ల పట్ల జాగ్రత్తగా ఉండండి. సుప్రీంకోర్టు పేరుతో వస్తున్న ఆ నకిలీ లింక్‌లను క్లిక్‌ చేయొద్దు. దాన్ని నగదు లావాదేవీలకు ఉపయోగించొద్దు’’ అని న్యాయవాదులు, వ్యాజ్యదారులకు సీజేఐ సూచించారు.

Tags:    

Similar News