గే యాప్ లో ఛాటింగ్ చేస్తూ... హైదరాబాద్ లో కొత్త తరహా క్రైం!
అవును గే డేటింగ్ అప్లికేషన్ ద్వారా ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లను ట్రాప్ చేశాడు ఒక వ్యక్తి
హైదరాబాద్ బాగా డెవలప్ అయ్యింది.. ఇక్కడ అన్ని రకాల క్రైం లూ జరుగుతున్నాయి అనే డైలాగ్ తరహాలో ఉంది తాజా వ్యవహారం. గే యాప్ లో పరిచయమైన వ్యక్తులను రూం కి పిలిచి చేసే ఘనకార్యాలకు సంబంధించిన దారుణాలు రెండు వెలుగులోకి వచ్చాయి. దీంతో... చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు!
అవును... గే డేటింగ్ అప్లికేషన్ ద్వారా ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లను ట్రాప్ చేశాడు ఒక వ్యక్తి. వారిని రూం కి పిలిచాడు. అనంతరం న్యూడ్ గా ఉన్న వీడియోలు రికార్డ్ చేసి.. ఆపై బెదిరింపులకు పాల్పడి.. డబ్బు, బంగారం దోచుకుంటున్నాడు. ఒకే రోజు రెండు వేరు, వేరు ఘటనల్లో ఇదర్ని ఇలా మోసం చేశాడు.
వివరాళ్లోకి వెళ్తే... బంజారాహిల్స్ రోడ్ నంబర్–12 ప్రాంతానికి చెందిన యువకుడు (23) తన గే లకు సంబంధించి యాప్ లో చాటింగ్ చేస్తుండగా.. అవతలి వైపు నుంచి ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కాసేపు చాటింగ్ చేసుకున్న తరువాత తన గదికి రావాలంటూ అవతలి వ్యక్తి లొకేషన్ పంపాడు.
దీంతో సదరు యువకుడు ఆ వ్యక్తి గదికి వెళ్లాడు. అయితే ఒక్కసారిగా సీన్ రివర్స్ అయ్యింది. ఆవ్యక్తి తన రూం కి వచ్చిన యువకుడికి కత్తి చూపించి న్యూడ్ వీడియోలు, ఫొటోలు తీశాడు. బలవంతంగా అతడి చేతికి ఉన్న బ్రాస్లెట్ తో పాటు గొలుసు, నగదు, డెబిట్, క్రెడిట్ కార్డులు లాక్కున్నాడు.
ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. అతడి భారి నుంచి తప్పించుకుని బయటపడిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అంతకంటే ముందు అదే వ్యక్తి మరో యువకుడిని ఇదే తరహాలో అల్లరి చేశాడు. గే యాప్ లో పరిచయం అయిన మరో యువకుడిని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 భోళానగర్ లోని తన గదికి రప్పించాడు. అనంతరం కత్తితో బెదిరించి, దుస్తులు విప్పించి, నగ్న దృశ్యాలు వీడియో తీశాడు.
ఇక్కడ కూడా... వీడియోలు ఎందుకు తీస్తున్నావంటూ నిలదీయగా అతడిపై దాడి చేశాడు. అనంతరం తన స్నేహితుడుతో కలిసి దాడి చేసి నగదు, బంగారు ఉంగరం లాక్కున్నాడు. ఇదే సమయంలో ఫోన్ పే ద్వారా రూ. 20 వేలు తన స్నేహితుడి ఖాతాకు బదిలీ చేయించాడు.
బాధితుల ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ క్రైం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా... నిందితుడిని రౌడీషీటర్ గా గుర్తించారు. ఈ కొత్తతరహా మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు!