కిలాడీల హనీ ట్రాప్... అరవైఏళ్ల మనసు కదిలింది!
ఆ మహిళను ఈ పెద్దాయన చనువుగా ఊరడిస్తున్న సమయంలో ఆమె చెల్లి సెల్ ఫోన్ లో వీడియో తీసింది. అక్కడ నుంచి అసలు కథ మొదలైంది.
ఈమధ్యకాలంలో హనీ ట్రాప్ లో పదుతున్న వారి సంఖ్య భారీగా పెరిగిపోతుందంటూ కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ మధ్య వయసు పైవడినవారు ఎక్కువగా ఈ హనీ ట్రాప్ లో బుక్కవ్వడం చర్చనీయాంశం అవుతోంది. ఈ క్రమంలో తాజాగా 60ఏళ్ల పెద్దాయన హనీ ట్రాప్ లో బుక్కయ్యారు!
అవును... ఇద్దరు అక్కా చెల్లెళ్లు వేసిన ట్రాప్ లో 60ఏళ్ల పెద్దాయన బుక్కయ్యారు. ఈ విషయంపై పెద్దాయనను చూసి జాలిపడాలా, ఇంక ఏమైనా అనాలా అనే సంగతి కాసేపు పక్కనపెడితే... లక్షలు సమర్పించుకున్న విషయం మాత్రం హాట్ టాపిక్ గా మారింది.
వివరాళ్లోకి వెళ్తే... బెంగళూరులో మా అబ్బాయి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడని, వైద్య చికిత్స కోసం ఆర్థిక సాయం చేయాలంటూ ఓ మహిళ (40) ఒక పెద్దాయన (60) కి ఫోన్ చేసింది. గతంలో కాస్త పరిచయం ఉన్న నేపథ్యంలో ఆమె మాటకలిపే సరికి కరిగిపోయిన పెద్దాయన కాదనలేకపోయారు. సరేనంటూ ఓ హోటల్‌కు పిలిచి రూ.5 వేల సొమ్ము అందించారు.
అక్కడితో ఆ ఇద్దరి మధ్య అనుబంధం కాస్త బలపడటం మొదలైంది. ఆమె చెప్పే కష్టాలన్నీ వింటూ అప్పుడప్పుడూ తనదైన శైలిలో ఊరడించడం అలవాటుగా చేసుకున్నాడు పెద్దాయన! ఈ ఊరడింపులో భాగంగా ఒకరోజు ఆమెను ఓ హోటల్ కు పిలిపించాడు. రూం బుక్ చేసుకుని ఆ రోజంతా అక్కడే ఉన్నారు. ఈ సమయంలో రెండు మూడు సార్లు కాస్త దగ్గరకు తీసుకుని ఊరడించడంతో... ఆ పెద్దాయన చిక్కుల్లో పడ్డాడు!
ఆ మహిళను ఈ పెద్దాయన చనువుగా ఊరడిస్తున్న సమయంలో ఆమె చెల్లి సెల్ ఫోన్ లో వీడియో తీసింది. అక్కడ నుంచి అసలు కథ మొదలైంది. వారం రోజుల తరువాత ఆ ఫోటోలు, వీడియోలు ఆ పెద్దాయనకు పంపి.. మీ రాసలీలలు ఇవీగో అంటూ బాంబు పేల్చింది. ఆ చిత్రాలు మీ ఇంటికి చేరకుండా ఉండాలంటే కాస్త సాయం చేయాలంటూ బేరం మొదలు పెట్టింది.
ఇలా వారి బలవంతమో.. పెద్దాయన బలహీనతో.. కారణం ఏదైనా సుమారు ఆయన నుంచి రూ.82 లక్షలు గుంజారట. అయినా కూడా సతాయింపులు అంతటితో ఆగకపోవడంతో మరో రూ.40 లక్షలు కావాలంటూ ఒత్తిడి పెంచారు. ఆ సొమ్ము ఇవ్వకపోతే నమ్మించి, అత్యాచారానికి పాల్పడ్డావంటూ కేసు పెడతామని హెచ్చరించారు.
దీంతో పెద్దాయన అలర్ట్ అయ్యారు. పోలీసు స్టేషన్ కు పరుగులు తీశారు. ప్రస్తుతం ఆ ఇద్దరు మహిళల కోసం పోలీసులు గాలింపు ప్రారంభించారు. ఇలా మొదట కరిగిపోయి, అనంతరం కక్కుర్తిపడిపోయి ఈ పెద్దాయన ఇలా బుక్కైపోయాడు!