ముల్తానా మట్టి పేరుతో హెరాయిన్ సప్లై.. హైదరాబాద్ లో మరో రాకెట్ బద్ధలు

ఇటీవల కాలంలో వరుస పెట్టి పట్టేస్తున్న డ్రగ్స్ డీలర్ల పరంపరలో తాజాగా మరో పెద్ద చేపల్ని పట్టేశారు శంషాబాద్ ఎస్ వోటీ పోలీసులు

Update: 2024-07-21 05:01 GMT

డ్రగ్స్ అన్న పదం వినిపించొద్దు.. కఠినంగా వ్యవహరించడన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ ఆదేశాలతో మరింత ఉత్సాహంగా పని చేస్తోంది పోలీసు శాఖ. ఇటీవల కాలంలో వరుస పెట్టి పట్టేస్తున్న డ్రగ్స్ డీలర్ల పరంపరలో తాజాగా మరో పెద్ద చేపల్ని పట్టేశారు శంషాబాద్ ఎస్ వోటీ పోలీసులు. ఈ సందర్భంగా రూ.7కోట్లు విలువ చేసే కేజీ హెరాయిన్ ను.. దానిని సప్లై చేస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

ముల్తానామట్టి పేరు చెప్పి టోకరా ఇస్తూ.. హెరాయిన్ ను సప్లై చేసే వీరిని వల పన్ని పట్టేశారు. ఈ సందర్భంగా నేరస్తుల బ్యాక్ గ్రౌండ్ ను వెల్లడించారు. రాజస్థాన్ లోని నాగోర్ జిల్లాకు చెందిన 26 ఏళ్ల నేమిచంద్ భాటి అక్కడ డ్రగ్స్ సరఫరా నెట్ వర్కులో కీలకంగా వ్యవహరించే సంతోష్ ఆచార్య అనే వ్యక్తి వద్ద నుంచి హెరాయిన్ కొని అమ్మేవాడు. నేమిచంద్ బంధువు అజయ్ భాటి హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్ మెట్ వద్ద కిరాణా నడిపేవాడు. స్థానికంగా డ్రగ్స్ కు డిమాండ్ ఉందని చెప్పిన అజయ్ మాటతో.. అతనికి నేమిచంద్ డ్రగ్స్ పంపేవాడు. ఇతగాడికి అవసరమైన డ్రగ్స్ ను బస్సుల్లో.. రైళ్లలో సప్లై చేసేవారు. దీనికి రాజస్థాన్ కు చెందిన నర్పట్ సింగ్ అనే వ్యక్తిని కొరియర్ గా పంపేవారు. ఎప్పుడైనా డ్రగ్స్ పాకెట్ ను పట్టుకొని ప్రశ్నించిన వారికి.. ముల్తానా మట్టి అంటూ అమాయకంగా బదులిచ్చేవాడు. అతడి మాటల్ని విని వదిలేసేవారు.

రెండు నెలల క్రితం నేమి చంద్ హైదరాబాద్ వచ్చాడు. ఈ సందర్భంగా అతడ్ని రంగారెడ్డి జిల్లా మల్కాపూర్ లో కిరాణాషాపు నడిపే హరీశ్ చౌదరి కలిశాడు. హైదరాబాద్ లో డ్రగ్స్ కు భారీ డిమాండ్ ఉందని.. భారీగా తీసుకొచ్చి అమ్మేస్తే పెద్ద ఎత్తున లాభాలు వస్తాయని చెప్పాడు. దీంతో నేమిచంద్ కిలో హెరాయిన్ ను (రూ.7 కోట్లు విలువ ఉంటుంది) ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో హరీశ్ కు పంపాడు. తను మాత్రం దర్జాగా ఫ్లైట్ లో వచ్చేశాడు.

తాను తీసుకొచ్చిన కేజీ హెరాయిన్ ను మాదాపూర్ లోని కొన్ని పబ్ మేనేజర్లకు అమ్మాలని ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా కొన్ని డీల్స్ మాట్లాడుకున్నారు. డ్రగ్స్ ను డెలివరీ చేసేందుకు నేమిచంద్ తో పాటు అజయ్.. హరీశ్.. నర్పట్ సింగ్ లు మాదాపూర్ లోని శిల్పారామానికి చేరుకున్నరు. కేజీ హెరాయిన్ ను నాలుగు పాకెట్లుగా మార్చారు. అయితే.. అప్పటికే వీరి గురించి సమాచారం అందుకున్న శంషాబాద్ ఎస్ వోటీ పోలీసులు చాకచక్యంగా పట్టేశారు. వారి దగ్గరున్న హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తమ కమిట్ మెంట్ తో ఒక ప్రధాన డ్రగ్స్ సరఫరా లింకును తెంచేశారంటూ సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి పేర్కొన్నారు. తెలంగాణను డ్రగ్స్ రహితంగా మారుస్తామన్నారు. ఏమైనా.. భారీ ఎత్తున పట్టేసిన ఈ డ్రగ్స్ ముఠాను లోతుగా విచారిస్తే మరికొన్ని లింకులు బయటపడొచ్చన్న మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News