హైదరాబాద్‌ లో మరో ఘోరం.. ప్రేమను తిరస్కరించిందని ప్రేమోన్మాది ఘాతుకం!

మహిళలపై లైంగిక దాడులు, హింస నివారణకు ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెస్తున్నా కొంతమందిలో ఎలాంటి మార్పూ ఉండడం లేదు

Update: 2023-09-04 07:02 GMT

మహిళలపై లైంగిక దాడులు, హింస నివారణకు ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెస్తున్నా కొంతమందిలో ఎలాంటి మార్పూ ఉండడం లేదు. ప్రేమించడం తమ హక్కుగా భావిస్తూ.. ఎదుటి వాళ్లు కూడా తాము చెప్పగానే తమను ప్రేమించేయాలనే పంతంతో ఉంటున్నారు. తమ ప్రేమను తిరస్కరిస్తే తీవ్ర ఘాతుకానికి ఒడిగడుతున్నారు.

హైదరాబాద్‌ నగరంలో తాజాగా ఇలాంటి దారుణమే జరిగింది. తన ప్రేమను నిరాకరించిందన్న కక్షతో ఒక ప్రేమోన్మాది దురాగతానికి ఒడిగట్టాడు. ఏకంగా యువతి ఉంటున్న ఇంటికే వచ్చి ఆమెపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో తన సోదరిని కాపాడటానికి అడ్డుగా వచ్చిన యువకుడిని పలుమార్లు కత్తితో పొడవడటంతో అతడు మరణించాడు. యువతి చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటన హైదరాబాద్‌ ఎల్బీ నగర్‌ పరిధిలోని ఆర్టీసీ కాలనీలో తీవ్ర కలకలం సృష్టించింది.

ఈ దారుణ ఘటన వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలానికి చెందిన గుండుమల్ల సురేందర్‌ గౌడ్, ఇందిరమ్మ దంపతులకు ముగ్గురు సంతానం ఉన్నారు. వీరిలో పెద్ద కుమార్తె సంఘవి (26) రామంతాపూర్‌ హోమియో కళాశాలలో నాలుగో సంవత్సరం చదువుతోంది. రెండో కుమారుడు పృథ్వీ (23) ఇటీవల ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. ప్రస్తుతం అతడు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు.

కాగా అక్కా తమ్ముడు.. సంఘవి, పృథ్వీ కొన్నాళ్లుగా ఎల్బీనగర్‌ ఆర్టీసీ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. కాగా ఫరూక్‌ నగర్‌ మండలం, నేరెళ్లచెరువు గ్రామానికి చెందిన శివకుమార్‌ (26), సంఘవి షాద్‌ నగర్‌ లోని ఒకే పాఠశాలలో పదో తరగతి చదివారు. అప్పటి నుంచే శివకుమార్‌ ప్రేమ పేరుతో సంఘవిని వెంటపడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో సంఘవి తనకా ఉద్దేశం లేదని చెబుతూ వచ్చింది. అయినా అతడు తన వేధింపులను ఆపలేదు. తనను ప్రేమించమని వేధిస్తూనే ఉన్నాడు.

డిగ్రీ పూర్తిచేసిన శివకుమార్‌.. ప్రస్తుతం రామంతాపూర్‌ లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇటీవల సంఘవిని కలిసి తనను ప్రేమించాలని కోరాడు. దీంతో ఆమె అతడిపై కోప్పడింది. ఎన్నిసార్లు చెప్పినా వినవెందుకని మండిపడింది. ఇలా పలుమార్లు తిరస్కరణకు గురైన శివకుమార్‌ సంఘవిపై కక్ష పెంచుకుని ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నాడు.

ఈ నేపథ్యంలో సంఘవి ఇంటి అడ్రస్‌ తెలుసుకున్న శివకుమార్‌ సెప్టెంబర్‌ 3న కత్తి తీసుకుని ఆమె నివాసానికి వెళ్లాడు. సంఘవి సోదరుడు పృథ్వీ ఇంటి నుంచి బయటకెళ్లడం చూశాడు. ఇదే అదునుగా ఆమె ఇంట్లోకి వెళ్లాడు. తన ప్రేమ గురించి మరోమారు ప్రస్తావించడంతో ఆమె అతడిని తిట్టింది. దీంతో తన వద్ద కత్తిని చూపి తనను ప్రేమించకపోతే చంపుతానని హెచ్చరించాడు.

ఇదే సమయంలో ఇంటికి వచ్చిన సంఘవి తమ్ముడు తన సోదరిని బెదిరిస్తున్న శివకుమార్‌ ను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో విచక్షణ కోల్పోయిన శివకుమార్‌.. పృథ్వీపైన దాడికి దిగాడు. కత్తిపెట్టి ఛాతీలో పొడిచాడు. దీన్ని ఆపబోయిన సంఘవి ముఖంపైనా కత్తితో దాడి చేశాడు. దీంతో సంఘవి భయపడిపోయి ఓ గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుంది. తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో పృథ్వీ అక్కడి నుంచి తప్పించుకుని బయటికి వచ్చి తలుపు గడియపెట్టి.. రోడ్డు మీదకొచ్చి పడిపోయాడు.

సంఘవి కేకలు పెడుతుండటంతో పక్కింటి మహిళ ఝాన్సీ వెంటనే వచ్చింది. అప్పటికే యువతి సోదరుడు కత్తిపోట్లతో బయటకు వెళుతూ జరిగిన విషయాన్ని ఆమెకు వివరించాడు. దీంతో అప్రమత్తమైన ఝాన్సీ ఓ కర్ర తీసుకుని గది ముందుకెళ్లి.. తలుపు కొట్టి.. సంఘవిని ఏమైనా చేస్తే బయటకు రాగానే చితకబాదుతామని బెదిరించింది. దీంతో నిందితుడు శివకుమార్‌ యువతి గది తలుపులు పగులకొట్టేవాడల్లా ఆగిపోయాడు.

ఈలోపే ఝాన్సీ మరో ద్వారం గుండా యువతిని బయటకు తీసుకొచ్చారు. స్థానికులు పృథ్వీని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. నిందితుడి దాడిలో గాయపడ్డ సంఘవిని మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని తమ అదుపులోకి తీసుకున్నారు.

కాగా పోలీసుల దర్యాప్తులో నిందితుడికి గతంలోనే నేర చరిత్ర ఉందని వెల్లడైంది. సొంత తండ్రినే హత్య చేశాడని చెబుతున్నారు. అతడి మానసిక ప్రవర్తన కూడా సరిగా లేదని అంటున్నారు. శివకుమార్‌ డిగ్రీ పూర్తి చేశాక.. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించాడు. ఉద్యోగం లేకుండా సినిమాలంటూ తిరగడంతో తండ్రి అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో సుత్తితో కొట్టి తన తండ్రిని హత్య చేశాడని శివకుమార్‌ గ్రామస్తులు చెబుతున్నారు. అయితే తమకు ఒక్కడే కుమారుడని.. ఎక్కడా చెప్పవద్దని తల్లి వేడుకోవడంతో పోలీసులకు చెప్పలేదని తండ్రిని హత్య చేసిన విషయాన్ని పోలీసులకు చెప్పలేదని సమాచారం. ఇంతలోనే యువతిపై కన్నేసి ఆమె సోదరుడిని దారుణంగా హత్య చేశాడు. యువతి చావుబతుకుల్లో ఉండటానికి కారణమయ్యాడు.

Tags:    

Similar News