పద్నాలుగేళ్ల బాలికకు స్నాప్ చాట్ లో పరిచయం.. కట్ చేస్తే రేప్
అమీర్ పేట - బల్కంపేటకు చెందిన 20 ఏళ్ల గణేష్ యాదవ్ కు స్థానికంగా ఉండే పద్నాలుగేళ్ల బాలిక స్నాప్ చాట్ ద్వారా పరిచయమైంది
వయసుకు మించిన పరిచయాలతో ఎప్పుడూ ముప్పే. అందునా సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యే వారి విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిందే. లేదంటే ముప్పు ఊబిలోకి చిక్కుకున్నట్లే. హైదరాబాద్ కు చెందిన ఒక బాలిక ఉదంతం గురించి తెలిస్తే ఇదెంత నిజమన్న విషయం అర్థమవుతుంది. తొమ్మిదో తరగతి చదివే ఒక బాలికకు స్నాప్ చాట్ ద్వారా పరిచయమైనోడు చేసిన చేష్ట గురించి తెలిస్తే నోట మాట రాదంతే.
అమీర్ పేట - బల్కంపేటకు చెందిన 20 ఏళ్ల గణేష్ యాదవ్ కు స్థానికంగా ఉండే పద్నాలుగేళ్ల బాలిక స్నాప్ చాట్ ద్వారా పరిచయమైంది. తొమ్మిదో క్లాస్ చదివే ఆ బాలికతో అతను పరిచయం పెంచుకున్నాడు. స్నేహం పేరుతో ఆమె ఫోటోల్ని తీసుకున్నాడు. అనంతరం ఆమె ఫోటోల్ని మార్ఫింగ్ చేశాడు.
వాటితో బెదిరింపులకు దిగేవాడు. తన కోరిక తీర్చకుంటే ఆ ఫోటోల్ని బయటపెడతానని.. ఆమె పరువు తీస్తానని వార్నింగ్ ఇచ్చేవాడు. అతని బెదిరింపులకు బెదిరిపోయిన ఆ బాలికపై ఆమె ఇంట్లో ఎవరూ లేని టైంలో రెండుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఆ విషయాన్ని అసరాగా చేసుకొని తన కోరికను తీర్చాలంటూ బెదిరింపులకు దిగేవాడు. దీంతో బెదిరిపోయిన ఆ బాలిక స్కూల్ కు వెళ్లటం మానేసింది. దీంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు బాధితురాలిని ప్రశ్నించగా అసలు విషయం చెప్పింది. దీంతో వారు ఎస్సార్ నగర్ పోలీసుల్ని సంప్రదించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు గణేష్ యాదవ్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని.. ఈ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా అనవసర సమస్యల్లో చిక్కుకోవటం ఖాయమని హెచ్చరిస్తున్నారు.