హిజ్రాగా మారిన భర్తను సుపారీ ఇచ్చి ఖతం చేయించింది
ఇందులో భాగంగా సిద్దిపేటకు చెందిన వ్యాపారి రమేశ్ కు రూ.18 లక్షలు ఇచ్చేందుకు డీల్ ఫైనల్ చేసుకున్నారు. రెండు వాయిదాల్లో రూ.4.6లక్షల మొత్తాన్ని ఇచ్చారు.
సిద్దిపేటలో వెలుగు చూసిన అనుమానాస్పద మరణం.. తరచి చూస్తే.. హత్యగా తేలింది. చిక్కుముడులున్న ఈ కేసు లెక్క తేల్చేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. చివరకువిజయం సాధించారు. హత్యకు కారణం వెలికి తీసిన వైనం.. అందుకు కారణాలు బయటకు వచ్చి షాక్ కు గురి చేస్తున్నాయి. డిసెంబరు 11న చోటు చేసుకున్న హత్య వెనుక అసలు కథేమిటన్న విషయాన్ని సాక్ష్యాలతో సహా గుర్తించారు పోలీసులు. సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..
సిద్దిపేట బోయిగల్లీకి చెందిన వేదశ్రీకి నాసర్ పురా వీధికి చెందిన వెంకటేశ్ తో 2014లో పెళ్లైంది. 2015లో వీరికో పాప పుట్టింది. తర్వాతి నుంచి అదనపు కట్నం కోసం భర్త వేధింపులకు పాల్పడేవాడు. తర్వాతి కాలంలో అతడిలో మార్పులు వచ్చి హిజ్రాగా మారాడు. తన పేరును రోజాగా మార్చుకున్నాడు. ఆ తర్వాత నుంచి వారిద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. దాదాపు ఏడేళ్లు విడిగా ఉన్న తర్వాత.. భార్య వద్దకు వచ్చిన రోజా.. తమ కుమార్తెను తనకు ఇవ్వాలని కోరేవాడు. దీనికి ఆమె నో చెప్పటంతో.. ఆమె పని చేస్తున్న ప్రైవేటు స్కూల్ వద్దకు వచ్చి ఇబ్బంది పెట్టేవాడు.
దీంతో.. ఆమె విసిగిపోయేది. మరోవైపు ఆమె సిద్దిపేటకు చెందిన రమేశ్ అనే వ్యక్తితో సన్నిహితంగా ఉండేది. అతనితో కలిసి రోజాను అడ్డు తొలిగించుకోవటానికి ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా సిద్దిపేటకు చెందిన వ్యాపారి రమేశ్ కు రూ.18 లక్షలు ఇచ్చేందుకు డీల్ ఫైనల్ చేసుకున్నారు. రెండు వాయిదాల్లో రూ.4.6లక్షల మొత్తాన్ని ఇచ్చారు. గత ఏడాది డిసెంబరు 11న తన ఇంట్లో ఒంటరిగా ఉన్న రోజాకు రమేశ్ స్నేహితుడైన శేఖర్ మద్యం తాగించాడు.
అనంతరం మరో ఇద్దరితో కలిసి దిండుతో ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశారు. తొలుత అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. పోస్టుమార్టంలో హత్యగా తేలటంతో విచారణ షురూ చేశారు. ఎక్కడా ఎలాంటి ఆధారాలు లభించకపోవటంతో ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఒక్కొక్క అంశాన్ని జాగ్రత్తగా చూస్తూ.. చివరకు వేదశ్రీ ప్రవర్తనలో అనుమానాలు వ్యక్తం కావటం.. చివరకు హత్యలో ఆమెతో పాటు మరో ఐదుగురి పాత్ర ఉందన్న విషయాన్ని తేల్చారు. తాజాగా వేదశ్రీ.. రమేశ్.. శేఖర్ లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలింపులు చేపట్టారు. అయినా.. వేధింపులకు గురి చేసే భర్త మీద కేసు పెట్టి.. చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరితే అయిపోయే దానికి.. హత్య ప్లాన్ చేస్తే తాను జైలుకు వెళతానన్న చిన్న లాజిక్ ను ఆమె ఎలా మర్చిపోయారో?