ఎంపీలో ఘోరం... దళిత యువకుడిని కొట్టి చంపిన వైనం!

వివరాళ్లోకి వెళ్తే... తనను లైంగికంగా వేదించారంటూ 2019లో నితిన్ సోదరి కొంతమంది దుండగులపై ఫిర్యాదు చేసింది

Update: 2023-08-29 05:27 GMT

ఈ దేశంలో రోజు రోజుకీ దళితులపై దాడులు పెరుగుతున్నాయే తప్ప తగ్గుతున్నట్లు లేదు. స్వాతంత్రం వచ్చి ఇన్ని ఏళ్లయినా.. మరోపక్క అభివృద్ధి చెందేస్తున్నాం అని నాయకులు ఊకదంపుడు ఉపన్యాశాలు చేసినా... కుల వివక్ష విషయంలో మాత్రం దేశం వెనక్కి వేగంగా పరుగులుపెడుతుంది! దీనికి బలం చేకూరుస్తూ తాజాగా ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది.

అవును... కొందరు వ్యక్తులు నితిన్‌ అహిర్వార్‌ (18) అనే దళిత యువకుడిని పాశవికంగా కొట్టి చంపారు! అడ్డొచ్చిన ఆమె తల్లిని కూడా కొట్టి వివస్త్రను చేశారు! మధ్యప్రదేశ్‌ రాష్ట్రం సాగర్‌ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ అమానుషానికి పాల్పడిన వ్యక్తులే గతంలో నితిన్‌ సోదరిని లైంగికంగా వేధించడం గమనార్హం!

వివరాళ్లోకి వెళ్తే... తనను లైంగికంగా వేదించారంటూ 2019లో నితిన్ సోదరి కొంతమంది దుండగులపై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కేసును వెనక్కి తీసుకోవాలని నిందితులు ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. అయినప్పటికీ నితిన్ వెనక్కి తగ్గలేదు.

ఈ సమయంలో తాజాగా మరోసారి నితిన్‌ ఇంటికి వెళ్లి మరీ బెదిరించారు. అల్లరి చేయడం ప్రారంభించారు. కేసు వెనక్కి తీసుకునేది లేదని నితిన్‌ సోదరి, తల్లి స్పష్టం చేయడంతో నిందితులు వారి ఇంటిని ధ్వంసం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం గ్రామంలోని బస్టాండ్‌ వద్ద ఉన్న నితిన్‌ దగ్గరకు వెళ్లి అతన్ని కొట్టడం మొదలుపెట్టారు.

దీంతో విషయం తెలుసుకున్న అతని తల్లి, సోదరి బస్టాండ్ వద్దకు చేరుకున్నారు. ఇ సమయంలో తన కొడుకుని కొట్టవద్దని తల్లి అడ్డువెళ్లి వేడుకుంది. అయినా కూడా ఆగని ఆ ఆ ముష్కరులు ఆ తల్లిని కూడా కొట్టి, వివస్త్రను చేశారు. పరిస్థితిని అర్ధం చేసుకున్న నితిన్‌ సోదరి.. అక్కడనుంచి పారిపోయి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ సమయంలో దాడిలో తీవ్రంగా గాయపడిన నితిన్‌ ను ఆస్పత్రికి తరలించగా... చికిత్స పొందుతూ మరణించాడు. పోలీసులు ప్రధాన నిందితుడు విక్రమ్‌ సింగ్‌ ఠాకూర్‌ తో పాటు తొమ్మిది మందిని అరెస్టు చేశారని తెలుస్తోంది.

అనంతరం... "సెక్షన్ 307 కింద ప్రధాన నిందితుడితో సహా తొమ్మిది మంది వ్యక్తులపై కేసు నమోదు చేయబడింది. ఆసుపత్రిలో బాధితుడు మరణించిన తర్వాత, సెక్షన్ 302 మరియు ఎస్సీ/ఎస్టీ చట్టం కూడా వర్తింపజేయబడింది" అని అడిషనల్ ఎస్పీ సంజీవ్ ఉయికే తెలిపారు.

Tags:    

Similar News