పెళ్లికి నో చెప్పిందని మెడికోను చంపేసినోడికి ఆ శిక్ష పడింది

క్రిష్ణా జిల్లా మానికొండ గ్రామానికి చెందిన మన్నే జ్ఞానేశ్వర్ హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు కంపెనీలో పని చేస్తుండేవాడు

Update: 2023-12-05 04:34 GMT

ఆన్ లైన్ లో పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లి.. ఆ తర్వాత నో చెప్పిన ఉదంతంలో మెడికోను దారుణంగా చంపేసిన కిరాతక ఘటనకు తగిన శిక్ష వేస్తూ గుంటూరు జిల్లా కోర్టు కీలక తీర్పును ఇచ్చింది. మూడేళ్ల క్రితం జరిగిన ఈ సంచలన హత్యను నిందితుడు ఉద్దేశపూర్వకంగా చేసినట్లుగా కోర్టు ముందు సాక్ష్యాలు బలంగా ఉన్న నేపథ్యంలో యావజ్జీవ కారాగార శిక్షను విధించటంతో పాటు.. రూ.6వేల జరిమానాను విధిస్తూ కోర్టు తన తీర్పును ఇచ్చింది.

క్రిష్ణా జిల్లా మానికొండ గ్రామానికి చెందిన మన్నే జ్ఞానేశ్వర్ హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు కంపెనీలో పని చేస్తుండేవాడు. అతడికి 2020 నవంబరులో ఆన్ లైన్ లో తపస్వి పరిచయమైంది. ఆమె చిన అవుటపల్లి సిద్ధార్థ డెంటల్ మెడికల్ కాలేజీలో బీడీఎస్ చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు ముంబయిలో ప్రైవేటు జాబ్ చేస్తుండేవారు. వారి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ క్రమంలో 2021లో హైదరాబాద్ నుంచి విజయవాడకు షిఫ్టు అయి.. ఒక కంపెనీలో జాబ్ లో చేరాడు. అనంతరం ఇద్దరు గన్నవరంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకొని కలిసి ఉన్నారు.

కొంతకాలం తర్వాత నుంచి తపస్విని అనుమానించటం మొదలు పెట్టాడు. దీంతో అతడి ప్రవర్తనకు విసిగిపోయిన ఆమె ఇంటిని ఖాళీ చేసి తన స్నేహితురాలి వద్దకు వెళ్లి.. తనతో ఉండటం మొదలు పెట్టింది. ఆ స్నేహితురాలు కూడా మెడికోనే. ఇదిలా ఉండగా.. తరచూ తపస్విని కలిసి పెళ్లి చేసుకుందామని కోరేవాడు. అందుకు ఆమె నో చెప్పటంతో.. పెళ్లికి కాదంటే చంపేస్తానని బెదిరించేవాడు. దీంతో ఆమె నూజివీడు పోలీసులకు కంప్లైంట్ చేసింది. దీంతో.. పోలీసులు అతడికి వార్నింగ్ ఇచ్చి.. కౌన్సెలింగ్ చేసి ఆమెకు చెందిన బంగారు ఆభరణాల్ని తాకట్లు నుంచి విడిపించారు.

దీంతో తపస్వి మీద కోపాన్ని పెంచుకున్నఅతడు.. 2022 డిసెంబరు 5న కత్తి.. సర్జికల్ బ్లేడ్ కొనుగోలు చేసి టూ వీలర్ మీద ఆమె ఉండే ఇంటికి వెళ్లాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని కోరాడు. అందుకు ఆమె నో చెప్పింది. అంతే.. తనతో తెచ్చుకున్న కత్తి.. సర్జికల్ బ్లేడ్ తో ఇష్టారాజ్యంగా పొడిచేశాడు.అనంతరం తననుతాను పొడుచుకొని ఆత్మహత్య చేసుకనే ప్రయత్నం చేశాడు. తపస్వి అరుపులతో బయటకు వచ్చిన ఆమె స్నేహితురాలు.. జరిగిన దారుణానికి భయపడి పెద్దగా కేకలు వేయటంతో.. స్థానికులుఇంటికి వచ్చి నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే తపస్వి చనిపోయింది. ఈ కేసు విచారణ పూర్తై.. ఇరు వర్గాల వాదనల అనంతరం హత్య చేసిన రోజుకు ఒక రోజు ముందుగా గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఈ కేసు తీర్పును ఇచ్చారు. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షను విధించటంతోపాటు.. రూ.6వేలు ఫైన్ వేస్తూ తీర్పును ఇచ్చారు.

Tags:    

Similar News