నిజ్జర్ హత్య వ్యవహారం.. కెనడాకు అమెరికా షాక్!
హరదీప్ సింగ్ నిజ్జర్ ను భారత ప్రభుత్వ ఏజెంట్లే చంపారంటూ ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించిన సంగతి తెలిసిందే.
కెనడాలో తమ దేశ పౌరుడు, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ నేత హరదీప్ సింగ్ నిజ్జర్ ను భారత ప్రభుత్వ ఏజెంట్లే చంపారంటూ ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా భారత దౌత్యవేత్తను దేశం నుంచి బహిష్కరించారు. హత్య దర్యాప్తు వ్యవహారంలో భారత్ కూడా తమకు సహకరించాలని ట్రూడో డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు తమ దేశ పౌరుడిని భారత్ చంపిందని ఆరోపిస్తూ ట్రూడో తన మిత్ర దేశాలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, తదితర దేశాలకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో దర్యాప్తుకు భారత్ ముందుకొచ్చేలా ఒత్తిడి చేయాలని ఆ దేశాలను ట్రూడో కోరారు. ఈ నేపథ్యంలో మొదట ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోని అమెరికా.. కెనడా ఒత్తిడికి తలొగ్గింది. కెనడా ఉత్తిగా ఆరోపణలు చేయదని, కాబట్టి నిజ్జర్ హత్యలో భార™Œ ఆ దేశానికి సహకరించాలని సూచించింది.
తాజాగా భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తో సమావేశంలోనూ ఈ అంశం చర్చకు వస్తుందని కెనడా ఆశించింది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న భారత మంత్రి జైశంకర్ కు అమెరికా నిజ్జర్ వ్యవహారంలో కెనడాకు సహకరించాలని సూచిస్తుందని కెనడా పెద్ద ఎత్తునే ఆశలు పెట్టుకుంది.
అయితే అమెరికా ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడటానికి ఇష్టపడలేదు. తాజాగా జైశంకర్, బ్లింకెన్ తాజా సమావేశంలో అమెరికా –భారత్ సంబంధాలు, కీలక అంశాలపైనే చర్చించారు. కెనడా వ్యవహారంలో వీరిద్దరి మధ్య చర్చకు రాలేదని చెబుతున్నారు. ఈ భేటీపై జైశంకర్ ట్వీట్ చేయడం గమనార్హం. ‘‘నా మిత్రుడు, అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో సమావేశం కావడం ఆనందంగా ఉంది. తామిద్దరం విస్తృత స్థాయి అంశాలు, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించాం. అలాగే త్వరలో జరగబోయే 2+2 భేటీకి సంబంధించిన అంశాలపై చర్చలు జరిపాం’’ అని ఎక్స్ (ట్విటర్)లో పేర్కొన్నారు.
మరోవైపు ఈ సమావేశంపై అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘జీ20కి భారత్ నేతృత్వంతో లభించిన ఫలితాలు, ఇండియా–మిడిల్ ఈస్ట్–యూరోప్ కారిడార్, అత్యున్నత శ్రేణి మౌలిక వసతులపై పెట్టబడులు వంటి అంశాలు చర్చకొచ్చాయి. భవిష్యత్తులో జరగబోయే 2+2 భేటీ కోసం ఇరు దేశాల మధ్య ముఖ్యంగా రక్షణ, అంతరిక్షం, క్లీన్ ఎనర్జీ రంగాల్లో సమన్వయం కొనసాగడం అవసరమని బలంగా విశ్వసిస్తున్నాం’’ అని తెలిపారు. ఇరు దేశాల మంత్రుల భేటీ అనంతరం ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. ఇందులో ఎక్కడా కెనడా పౌరుడి హత్య వ్యవహారం లేదు.
హరదీప్ సింగ్ నిజ్జర్ హత్య వ్యవహారం గురించి మీడియా అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ను ప్రశ్నించగా ఆయన సమాధానం ఇచ్చేందుకు తిరస్కరించారు. ‘‘నా మిత్రుడు, సహచరుడు జైశంకర్ ను విదేశాంగశాఖ ప్రధాన కార్యాలయానికి ఆహ్వానించడం సంతోషంగా ఉంది. జీ20, ఐరాస జనరల్ అసెంబ్లీ వంటి చాలా అంశాలపై చర్చలు జరిగాయి’’ అని తెలిపారు. కాగా నిజ్జర్ హత్య వ్యవహారంలో అమెరికా.. కెనడా పక్షానే ఉందని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో పేర్కొన సంగతి తెలిసిందే.
అమెరికా– భారత్ విదేశాంగ మంత్రుల సమావేశంలో హరదీప్ సింగ్ నిజ్జర్ హత్య వ్యవహారం చర్చకు రాకపోవడంతో మరోసారి జస్టిన్ ట్రూడో సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజ్జర్ హత్యపై అమెరికన్లు తమతోనే ఉన్నారని ప్రకటించారు. తమ దేశం ఇప్పటికీ భారత్ తో సన్నిహిత సంబంధాలను ఏర్పర్చుకోవడానికి కట్టుబడి ఉందని వెల్లడించారు.
కెనడాలోని మాంట్రియల్ లో జరిగిన ఓ సమావేశంలో జస్టిన్ ట్రూడో మాట్లాడారు. ‘‘భారత్ వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. అంతేకాదు.. కీలక భౌగోళిక రాజకీయ ప్రాధాన్యత ఉన్న దేశం. మేము గతేడాదే మా ఇండో–పసిఫిక్ వ్యూహంతో ముందుకొచ్చాం. భారత్‌తో సంబంధాలును బలోపేతం చేసుకోవడంపై మేము చాలా సీరియస్‌గా పనిచేస్తున్నాం’’ అని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యానించడం విశేషం.
అయితే నిజ్జర్ హత్యను ప్రజాస్వామ్య దేశాలు సీరియస్‌గా తీసుకోవాలని ట్రూడో కోరారు. కెనడా, దాని మిత్ర దేశాలు.. భారత్ తో కలిసి పనిచేయాల్సి ఉందన్నారు. అయితే అదే సమయంలో చట్టాలను అనుసరించే దేశంగా.. నిజ్జర్ హత్య విషయంలో తమతో కలిసి భారత్ పనిచేసి వాస్తవాలను వెలికితీయాలని మళ్లీ పాతపాటే పాడారు. కెనడా పౌరుడిని మా గడ్డపై హత్య చేయడంలో భారత ఏజెంట్ల పాత్ర నిర్ధారించే విషయంలో అమెరికన్లు తమతోనే ఉన్నారని తెలిపారు. నిజ్జర్ హత్యను ప్రజాస్వామ్యం, చట్టాలను అనుసరించే దేశాలు తీవ్రంగా పరిగణించాలి అని ఆయన కోరారు.