పెళ్లి పేరుతో హైదరాబాద్ యువతికి రూ.2.71 కోట్లు టోకరా

అవును.. ఇది నిజంగా జరిగింది. మరీ ఇంత అమాయకంగా మోసపోతారా? అన్న సందేహం కలగొచ్చు

Update: 2024-03-25 06:53 GMT

అవును.. ఇది నిజంగా జరిగింది. మరీ ఇంత అమాయకంగా మోసపోతారా? అన్న సందేహం కలగొచ్చు. కానీ.. మోసం చేసినోడు మహా ముదురైతే ఎంతటి వారైనా మోసపోవటం ఖాయం. తాజా ఉదంతంలో అలాంటిదే జరిగింది. నమ్మకంగా ప్లాన్ చేసి మాటలతో మాయ చేసిన ఈ కేటుగాడి వ్యవహారం తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. విజయవాడకు సమీపంలోని పోరంకి గ్రామానికి చెందిన 37 ఏళ్ల శ్రీబాల వంశీక్రిష్ణ లీలల్ని తాజాగా హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు వెల్లడించారు.

బెట్టింగులు.. రేసులకు అలవాటు పడిన వంశీక్రిష్ణ డబ్బుల్లేక అడ్డదారులు తొక్కాడు. ఒక మ్యాట్రిమోనీలో సభ్యత్వం తీసుకున్న అతడు నకిలీపేర్లతో యువతులకు పెళ్లి ప్రపోజల్స్ పంపాడు. దాదాపు ఆరుగురు అతడి రిక్వెస్టులను ఓకే చేశారు. వారి ఫోన్ నెంబర్లు తీసుకున్న ఈ కేటుగాడు వారితో మాట్లాడేవాడు. వారు నమ్మినట్లుగా భావించినంతనే మోసం చేసేవాడు.

తాను అమెరికాలో ఉద్యోగం చేస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చి.. భాగస్వామికి వీసా రావాలంటే సిబిల్ స్కోర్ ఎక్కువ ఉండాలని చెప్పేవాడు. లోన్లు తీసుకోవాలని చెప్పి.. లోన్లు తీసుకునేలా చేసి ఆ డబ్బును తన ఖాతాల్లోకి తెప్పించుకునేవాడు. ఇలా పలువురిని మోసం చేసిన అతను.. హైదరాబాద్ లోని మదీనాగూడకు చెందిన 30 ఏళ్ల యువతిని తనకు అలవాటైన ధోరణిలోనే గాలం వేశాడు. రిషికుమార్ గా పరిచయం చేసుకున్నాడు.

తాను అమెరికాలోని గ్లెన్ మార్క్ ఫార్మాలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. పెళ్లి తర్వాత అమెరికాకు రావాలంటే వీసా కోసం సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉండాలని చెప్పాడు. ఆమె సిబిల్ స్కోర్ 743 ఉండగా.. వీసా కోసం 845 కంటే ఎక్కువసిబిల్ స్కోర్ ఉండాలని నమ్మించాడు. సిబిల్ స్కోర్ పెరిగేందుకు గ్లెన్ మార్క్ సంస్థ లోన్ ఇస్తుందని చెప్పి.. ఆమెను నమ్మించిన వంశీ.. ఆమె చేత పర్సనల్ లోన్లు.. ఇతర అప్పులు చేసేలా చేశాడు.

ఆ డబ్బుల్ని తన ఖాతాలోకి బదిలీ చేయించుకున్నాడు. ఈ విధంగా రూ.2.71 కోట్లు కొట్టేశాడు. ఆ తర్వాత పత్తా లేకుండా పోయాడు. దీంతో మోసపోయినట్లుగా గుర్తించిన సదరు యువతి.. సైబర్ పోలీసుల్ని ఆశ్రయించారు. దీంతో అతడిపై ఫోకస్ పెట్టిన పోలీసులు అతడ్ని తాజాగా అరెస్టు చేశారు. ఇప్పటివరకు ఇతడిపై తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఏడు.. ఏపీ.. తమిళనాడులో ఒక్కో కేసు నమోదైనట్లుగా గుర్తించారు. మాయ మాటలకు ఇంత భారీగా మోసపోయిన యువతి ఉదంతం సంచలనంగా మారింది.

Tags:    

Similar News