కాపురానికి పంపని మామను అల్లుడు చంపితే.. అతన్ని బావమరిది చంపేశాడు

కామారెడ్డి జిల్లాలో షాకింగ్ క్రైం చోటు చేసుకుంది. జిల్లాకు చెందిన బిచ్కుంద మండలంలో చోటు చేసుకున్న రెండు హత్యలు స్థానికంగా కలకలాన్ని స్రష్టించాయి.

Update: 2023-11-26 05:49 GMT

ఆవేశం ఉండాలే కానీ అదుపు దాటకూడదు. హద్దులు దాటే ఆగ్రహం అనవసర సమస్యల్ని తీసుకొస్తుంది. తాజా ఉదంతంలో రెండు నిండు ప్రాణాలు పోయేలా చేయటమే కాదు.. కోలుకోలేని విషాదాన్ని తెచ్చి పెట్టింది.

కామారెడ్డి జిల్లాలో షాకింగ్ క్రైం చోటు చేసుకుంది. జిల్లాకు చెందిన బిచ్కుంద మండలంలో చోటు చేసుకున్న రెండు హత్యలు స్థానికంగా కలకలాన్ని స్రష్టించాయి. బిచ్కుంద మండలంలోని గుండెనెమ్లి గ్రామానికి చెందిన అరుణకు అదే మండలానికి చెందిన సంతు అనే వ్యక్తితో పెళ్లైంది. వారికి నాలుగేళ్ల పాప ఉంది. ఏడాది క్రితం ఆమె మరోసారి గర్భం దాల్చింది.

ఆ సమయంలో సంతు వేధింపులు ఎక్కువ కావటంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. రెండో కాన్పులో పాప పుట్టింది. పాప పుట్టి ఏడాది అవుతున్నా భార్యను తన వద్దకు పంపకపోవటంపై సంతు ఆగ్రహానికి గురయ్యేవాడు. తరచూ తన భార్యను కాపురానికి పంపాలని కోరేవాడు. అయితే.. అతడి వేధింపుల అనుభవంతో భార్య అరుణతో పాటు ఆమె పుట్టింటి వారు సంతు వద్దరకు పంపే విషయంలో సంశయంతో ఉన్నారు.

ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి అత్తారింటికి వెళ్లిన సంతు.. తన భార్యను తనతో రావాలని కోరాడు. అందుకు ఆమె నో చెప్పింది. దీంతో.. వారి మధ్య వాదన జరిగింది. అది ఘర్షణగా మారింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన సంతు భార్య అరుణను కర్రతో బలంగా కొట్టాడు. దీంతో ఆమె తల పగిలింది.

అక్కడే ఉన్న అరుణ తండ్రి రాంబోయి(55) అల్లుడ్ని ఆపే ప్రయత్నం చేశాడు. అప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్న సంతు.. మామను సైతం కర్రతో బలంగా కొట్టాడు. దీంతో మామ రాంబోయి అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో తీవ్రమైన కోపానికి గురైన రాంబోయి కుమారుడు.. సంతు బావమరిది సాయిలు.. తన బంధువు వేణుతో కలిసి రాయితో సంతు మీద దాడి చేశారు. ఈ సందర్భంగా రాయిని అతడి తల మీద బలంగా కొట్టాడు. దీంతో.. అక్కడికక్కడే సంతు మరణించాడు. తల పగిలి గాయపడిన అరుణను చికిత్స కోసం బాన్సువాడకు తరలించారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News