ఇంటి బయట కూర్చున్న మహిళపై దాడి చేసిన వాలంటీర్!
అందరూ సరిగా ఉన్నా.. ఇద్దరు ముగ్గురు చేసే తప్పుడు పనుల కారణంగా మిగిలిన వారంతా మాటలు పడాల్సిన ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది.
అందరూ సరిగా ఉన్నా.. ఇద్దరు ముగ్గురు చేసే తప్పుడు పనుల కారణంగా మిగిలిన వారంతా మాటలు పడాల్సిన ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. తాజా ఉదంతం చూస్తే ఇదే విషయం అర్థమవుతుంది. ఏపీలోని వాలంటీర్లలో అత్యధికులు బాధ్యతగా ఉన్నా.. కొందరు వాలంటీర్ల అత్యుత్సాహం.. వ్యక్తిగతంగా వారికున్న దుర్మార్గ బుద్ధి కారణంగా మిగిలిన వారందరికి మచ్చ తెచ్చేలా చేస్తున్నారు. తాజాగా అలాంటి ఉదంతమే బాపట్ల జిల్లాలో చోటు చేసుకుంది.
జిల్లాలోని చెరుకుపల్లి మండలంలోని వివాహిత ఆదివారం ఇంటి ముందున్న అరుగు మీద కూర్చుంది. ఆ టైంలో వాలంటీరు లోకకుమార్ ఆమె వద్దకు వచ్చాడు. ‘నువ్వంటే నాకు ఇష్టం’అంటూ ఆమె చెయి పట్టుకొని అసభ్యకరంగా వ్యవహరించాడు. దీంతో షాక్ తిన్న ఆమె పెద్ద ఎత్తున కేకలు వేస్తూ.. చేయి వదిలించుకునే ప్రయత్నం చేశారు. ఎందుకు అరుస్తావు అంటూ ఆమెను కాలితో తన్నటంతో ఆమె కిందకు పడిపోయారు. చుట్టుపక్కల వారు స్పందించి.. ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు.
అతడ్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన వారిపై అతడు నోరు పారేసుకున్నాడు. తనను ఎవరూ ఏం చేయలేరంటూ వెళ్లిపోయాడు. కాసేపటికి తన అనుచరులతో కలిసి కర్రలతో వచ్చిన అతని నుంచి బాధితురాలిని కాపాడేందుకు చెరుకుపల్లి తీసుకొచ్చారు ఇరుగుపొరుగు వారు. గత ఏడాది కూడా ఇదే వాలంటీరు తనతో అమానుషంగా ప్రవర్తించారని.. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. తన కంప్లైంట్ ను పట్టించుకోలేదని బాధితురాలు పేర్కొన్నారు.
దౌర్జన్యానికి పాల్పడిన వాలంటీరే తమపై కేసులు పెడతాడని.. అదేమంటే తన వెనుక ఎంపీ మోపిదేవి ఉన్నాడంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా పేర్కొన్నారు. మరోవైపు వాలంటీర్ లోక కుమార్ పై మరికొందరు మహిళలు ఆరోపణలు చేస్తున్నారు. తమ వద్ద వడ్డీకి డబ్బులు తీసుకొని.. తిరిగి చెల్లించాలని అడిగితే తమపై దౌర్జన్యం చేస్తున్నట్లుగా వార్డు సభ్యురాలు మరియమ్మ అనే మహిళ వాపోయారు. ఈ ఉదంతాన్నిపోలీసులు సీరియస్ గా తీసుకొని.. కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు.