కానిస్టేబుల్ భార్య పన్నాగం... ప్రియుడి మోజులో ఘాతుకం!
ప్రియుడిపై పెంచుకున్న మోజో లేక అత్యాశతో కూడిన ఫ్రీడం కోరుకుందో తెలియదు కానీ దారుణానికి పాల్పడింది ఒక గృహిణి
ప్రియుడి మోజులో పడిపోయింది. ఇద్దరు ఆడపిల్లలున్న ఈ తల్లి ఏకంగా మర్డర్ స్కెచ్ వేసింది. ప్రియుడితో తన భర్తను చంపించాలనుకుంది. అందుకోసం ప్రియుడి స్నేహితుడికి సుపారీ కూడా ఇచ్చింది. కట్టుకున్న భర్తను కడతేర్చింది. అనంతరం గుండెపోటుగా చిత్రీకరించింది. పోలీసులకు దొరికింది. పిల్లలను అనాధలను చేసింది.
అవును... ప్రియుడిపై పెంచుకున్న మోజో.. లేక, అత్యాశతో కూడిన ఫ్రీడం కోరుకుందో తెలియదు కానీ... దారుణానికి పాల్పడింది ఒక గృహిణి. పెళ్లైంది.. ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్న భర్త ఉన్నాడు.. బంగారం లాంటి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అంత అందమైన జీవితం ఆమెకు తృప్తి ఇచ్చినట్లు లేదు. ప్రియుడి మోజులో ఘాతుకానికి తెగించింది.
వివరాళ్లోకి వెళ్తే... బర్రి రమేష్ కుమార్ (40) విశాఖ వన్ టౌన్ పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయనకు ఒక భార్య శివజ్యోతి అలియాస్ శివాని 3, 5 సంవత్సరాల ఇద్దరు కుమార్తెలతో కలిసి ఎంవీపీ కాలనీలో నివాసముంటున్నారు.
అది ఆగస్టు 1వ తేదీ:
ఈ నెల ఒకటో తేదీన విధులు నిర్వహించుకుని రమేష్ ఇంటికి చేరుకున్నాడు. తెల్లారేసరికి తన భర్త గుండెపోటుతో మృతి చెందాడంటూ.. రమేష్ భార్య ఎంవీపీ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. సీఐ మల్లేశ్వరరావు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. భార్య ప్రవర్తనపై అనుమానం కలగడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అతి ప్రవర్తనే అనుమానానికి దారితీసింది:
రమేష్ గుండెపోటుతో మృతి చెందాడని చెబుతోన్న అతడి భార్య ప్రవర్తనపై అనుమానం కలగడంతో.. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సమయంలో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు. పోస్టుమార్టం నివేదికలో ఊపిరాడక మృతి చెందినట్లు తేలింది. దీంతో అనుమానాన్ని కన్ ఫాం చేసుకున్న పోలీసులు... తమదైన శైలిలో విచారించడంతో వాస్తవాలు వెల్లడయ్యాయి.
ప్రియుడితో వ్యవహారం.. ఫ్యామిలీ గొడవలు:
ఎంవీపీ కాలనీలోని రమేష్ ఇంటి ఎదురుగా రామారావు అనే వ్యక్తి ఉంటున్నాడు. రమేష్ ఇంటి పక్కనే నిత్యం కారు పార్కింగ్ చేసేవాడు. ఈ క్రమంలో రమేష్ భార్య శివజ్యోతితో రామారావుకు పరిచయం ఏర్పడింది. దీంతో... సుమారు ఏడాదిన్నరగా వీరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది.
ఈ క్రమంలో... వీరిద్దరూ సన్నిహితంగా ఉండటం రమేష్ గమనించాడు. దీంతోఈ రామారావుతో ఒకసారి గొడవ పడ్డాడు. అనంతరం రామారావు, శివజ్యోతి కొన్ని రోజులు బయటకు వెళ్లిపోయారు. దీంతో... ఇరు వర్గాల కుటుంబీకులు రమేష్ కు నచ్చజెప్పి శివజ్యోతిని ఇంటికి తీసుకొచ్చారు.
అయినా కూడా శివజ్యోతి ప్రవర్తనలో మార్పు రాలేదని చెబుతున్నారు. ఫలితంగా భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో రామారావు దగ్గరికే వెళ్లిపోవాలని శివజ్యోతిని కానిస్టేబుల్ రమేష్ మండిపడేవాడు. పిల్లలను తీసుకొని వెళ్తానని వాదించడంతో ఇద్దరి మధ్య తరచూ ఘర్షణలు జరిగేవి.
పక్కా ప్లాన్ తో మర్డర్:
ఆమెకు తన ప్రియుడు రామారావుతో వెళ్లిపోవాలని ఉన్నప్పటికీ.. పిల్లలను కూడా తీసుకుని వెళ్లిపోతానంటే అందుకు రమేష్ ఒప్పుకునేవాడు కాదు. దీంతో అతని అడ్డు తొలగించుకుంటే అంతా అంతా క్లియర్ అని భావించింది. దీంతో ప్రియుడు రామారావుతో కలిపి ఒక స్కెచ్ వేసింది. దీనికోసం ఒక వ్యక్తికి సుపారీ ఇచ్చింది.
అవును... ఆమె తన వద్దనున్న బంగారం రూ.1.50 లక్షలకు అమ్మి.. అప్పుఘర్ కు చెందిన వెల్డింగ్ పనులు చేసే నీలాకు సుపారీ ఇచ్చారు. ఈ క్రమంలో ఒకటో తేదీ రాత్రి రమేష్ ఇంటికి వచ్చి భోజనం చేసి నిద్రపోయారు. అది గమనించిన శివజ్యోతి... రమేష్ - నీలాలను పిలిచింది.
ఆ సమయంలో ఎవరూ రాకుండా బయట రామారావు కాపలా ఉన్నాడు. లోపల రమేష్ ముఖంపై నీలా దిండు పెట్టి గట్టిగా అదిమిపట్టుకోగా.. కదలకుండా శివజ్యోతి కాళ్లు పట్టుకొని ప్రాణాలు తీశారు. దీంతో.. ఈ హత్యాకేసులో ఎ1గా శివజ్యోతి, ఎ2గా రామారావు, ఎ3గా నీలాపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సీపీ వెల్లడించారు.
పిల్లల పరిస్థితి ఏమిటి?:
కానిస్టేబుల్ రమేష్ దంపతులకు 3, 5 సంవత్సరాల ఇద్దరు కుమార్తెలున్నారు. ఈ విషయాలపై స్పందించిన విశాఖ సీపీ... ముందుగా వారు తాత, అమ్మమ్మల సంరక్షణలో ఉండేలా చూస్తామని తెలిపారు. లేదంటే.. పోలీసుల సంరక్షణలో "పాపా హోం" కు తరలించి శ్రద్ధ తీసుకొని.. వారికి అవసరమైన చదువు, ఆలనా పాలనా చేపడతామని సీపీ తెలిపారు.