తీవ్ర గాయాలతో పడున్న వ్యక్తిపై మూత్రం.. వీడియో వైరల్!
మరిన్ని వివరాలు వెల్లడించిన నగర డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సురజ్ కుమార్ రాయ్
ఈమధ్య కాలంలో మనిషి మనిషిగా బ్రతకండం కంటే హీనంగా బ్రతకడానికి ఎక్కువ మోజు పడుతున్నట్లు కనిపిస్తోన్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా... ఒక మనిషి మరో మనిషిపై మూత్రం పోస్తోన్న సంఘటనలు వరుసగా తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా ఎంపీ లో మరో ఘటన వెలుగులోకి వచ్చింది.
"మాయమైపొతూన్నడమ్మా మనిషన్న వాడు.. మచ్చుకైనా లేడు చూడు మనవత్వం ఉన్నవాడు".. అన్నట్లుగా అయిపోతోంది ప్రస్తుత సమాజం అన్నా అతిశయోక్తి కాదు. కొన్ని రోజుల క్రితం మధ్యప్రదేశ్ లో గిరిజనుడిపై ఓ వ్యక్తి మూత్రం పోసిన సంగతి తెలిసిందే. ఈ విషయం రాజకీయ రంగు పులుముకుంది. సీఎం కాళ్లు కడగడం.. అనంతరం "అది నేను కాదు" అని కాళ్లు కడిగించుకున్న వ్యక్తి చెప్పడం తెలిసిందే.
అనంతరం ఏపీలోని ఒంగోలులో కూడా తాగి కొట్టుకున్న స్నేహితుల్లో కొంతమంది ఒక యువకుడిపై ఇలాంటి పనే చేశారంటూ కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా అలాంటి మరో సంఘటన ఆగ్రాలో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
అవును... తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో రోడ్డు పక్కన పడి ఉన్న ఓ వ్యక్తిపై మూత్రం పోస్తూ వీడియో తీసుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ విషయం పోలీసుల దగ్గరకు వెళ్లడంతో వెంటనే రంగంలోకి దిగారు. వీడియోలోని దృశ్యాల ఆధారంగా మూత్రం పోసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు.
అనంతరం ఈ విషయాలపై స్పందించిన పోలీసులు ఈ ఘటనవెనుక ఇద్దరు ఉన్నారని.. ఇందులో మూత్రం పోసిన వ్యక్తి దొరికాడని, వీడియో తీసిన వ్యక్తి పరారీలో ఉన్నాడని చెబుతున్నారు! ఇదే సమయంలో ఈ వీడియో ఇప్పటిది కాదని.. మూడు నాలుగు నెలల క్రితం నాటిదని పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా మరిన్ని వివరాలు వెల్లడించిన నగర డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సురజ్ కుమార్ రాయ్... గాయాలతో పడి ఉన్న వ్యక్తిపై మూత్రం పోసిన వ్యక్తిని ఆదిత్యగా, వీడియో తీసిన వ్యక్తిని అటుస్ గా గుర్తించినట్టు తెలిపారు. వీడియో వైరల్ గా మారిన వెంటనే నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని అన్నారు.
అలా గాలింపు చేపట్టిన గంటల వ్యవధిలోనే మూత్రం పోసిన ఆదిత్యను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అతడు ఇచ్చిన సమాచారంతో వీడియో తీసిన అటుస్ కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం ఈ అమానవీయ చర్యకు పాల్పడిన నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్టు డీసీపీ తెలిపారు.