ఆయుధాలతో కూడిన కారుతో సీఎం ఇంట్లోకి... బెంగాల్ లో కలకలం!

తాజాగా ఒక ముఖ్యమంత్రి నివాసం వద్ద కలకలం

Update: 2023-07-21 09:57 GMT

తాజాగా ఒక ముఖ్యమంత్రి నివాసం వద్ద కలకలం ఏర్పడింది. ఒక వ్యక్తి ఆయుధాలతో కూడిన కారుతో సీఎం ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అలా లోపలికి చొరబడేందుకు యత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పైగా ఆ వాహనానికి పోలీస్ స్టిక్కర్ అతికించి ఉండటం తో భద్రతా సిబ్బంది షాకయ్యాయని తెలుస్తుంది.

అవును... పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నివాసం వద్ద తీవ్ర కలకలం రేగింది. ఆయుధాలతో కూడిన కారుతో లోపలికి చొరబడేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. అప్రమత్తమైన వ్యక్తులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని నూర్‌ ఆలంగా గుర్తించారు.

కోటు, టై ధరించిన అతడు.. పోలీస్‌ స్టిక్కర్‌ తో కూడిన వాహనంతో కోల్‌ కతా నగరంలోని కాళీఘాట్‌ లోని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసంలోకి ప్రవేశించేందుకు యత్నించాడు. ఈ క్రమంలోనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. అతడిని అరెస్టు చేశారు.

ఈ సమయంలో మద్యం మత్తులో ఉన్న అతడి నుంచి గన్‌, కత్తి, మత్తు పదార్థాలతోపాటు కొన్ని భద్రతా ఏజెన్సీలకు చెందిన ఐడీ కార్డులను స్వాధీనం చేసుకున్నారని తెలుస్తుంది. ఈ సందర్భంగా అదుపులో ఉన్న అతడిని పోలీసులు, స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు ప్రశ్నిస్తున్నారని అంటున్నారు.

మరోవైపు, పశ్చిమ బెంగాల్‌ లో అధికారంలో ఉన్న తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) కోల్‌ కతాలో శుక్రవారం "అమరవీరుల దినోత్సవం" ర్యాలీ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ మరికొద్ది గంటల్లో ఆ కార్యక్రమంలో పాల్గొనడ్దానికి వెళ్లాల్సి ఉంది. సరిగ్గా ఆ టైం లో గన్‌, కత్తి కలిగిన వ్యక్తి భద్రతా లేన్‌ లోకి ప్రవేశించడం కలకలం రేపింది.

Tags:    

Similar News